సాధారణంగా కొత్త సంవత్సరం వస్తోంది అంటే ఎన్నో సంబరాలు. సంవత్సరంతో పాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇళ్ళని, వీధులని, నగరాలని అలంకరిస్తారు. అలంకారాలు, దీపాలు, టపాకాయలు, కొత్తబట్టలు, మిఠాయిలు (ఎక్కువగా కేకు) పంచుకోవటాలు, విందులు, వినోదాలు, శుభాకాంక్షలు. అంటే రాబోయే కాలం ఆనంద దాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటమే వీటిలోని అసలు అర్థం.
మనిషి ఆలోచించటం మొదలుపెట్టినప్పటి నుండి లెక్కించటం కూడా ప్రారంభించాడు. ప్రకృతిలో వస్తున్న మార్పులని పరిశీలించి, తదనుగుణంగా ఉండటం కోసం కాలాన్ని కూడా గణించటం ప్రారంభించాడు. కాలగణనకి ప్రమాణం ప్రకృతిలో జరిగే పరిణామాలే. కొద్దికాలం జరిగిన తరవాత మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టే ప్రకృతి కనపడితే ఈ క్రమం ఏమిటి? అన్నది అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనిషి కాలాన్ని లెక్కపెట్టటం జరిగింది.
లెక్కపెట్టటం ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు మొదలుపెట్టాలి. ఒక్కొక్క ప్రాంతం వారు వారికి అనుకూలంగా ఉన్న సమయం నుండి లెక్కపెట్టటం మొదలుపెట్టారు. కాలక్రమంలో దానిలో ఒక హేతుబద్ధతని అవలంబించారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండే సమయాన్ని కాలాన్ని లెక్కకట్టటానికి మొదలుగా తీసుకున్నారు. పాశ్చాత్యులకి ఆహ్లాదకరంగా ఉండే వసంతం (స్ప్రింగ్) మార్చ్, ఏప్రిల్ నెలలు.
మార్చ్ 23 ని సంవత్సర మానానికి ఆదిగా పరిగణించేవారు. తరువాత నెల మధ్యలో ఎందుకని ఏప్రిల్ 1 ని సంవత్సరాదిగా జరుపుకునే వారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అది జనవరి 1 కి మారింది. మార్చ్ మొదటి నెల కనుక డిసెంబర్ 10 వ నెల, నవంబర్ 9 వ నెల, అక్టోబర్ 8 వ నెల, సెప్టెంబర్ 7 వ నెల అయ్యాయి. ఆ పేర్లే నెలల సంఖ్యని తెలియ చేస్తున్నాయి. ఈ కాలెండర్ ని గ్రెగేరియన్ కాలెండర్ అంటారు. అందరికీ తమ కాలెండర్ ఉన్నా, ఇప్పుడు ప్రపంచం అంతా ఈ కాలెండర్‌నే అనుసరిస్తోంది.
ఈ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తారీకుతో కొత్త సంవత్సరం మొదలు అవుతుంది. సౌరమానాన్ని అనుసరించి ఒక సంవత్సరంలో 365 1/3 రోజులు ఉంటాయి. అందుకని నాలుగు సంవత్సరాలకి ఒక మారు లీప్ ఇయర్ అని ఒక రోజు అధికంగా వస్తుంది. ఆ రోజు తక్కువ రోజులు ఉండే ఫిబ్రవరికి వెడుతుంది.
అయితే ఆనందోత్సాహాలు ఎందుకు? ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు. ఆ విధంగా గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు. సంవత్సరంలో మొదటి రోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం.
రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాము.
అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికి రానివాటిని పక్కకి పెట్టి, అవసరమైన వాటిని చేపట్టటానికి నిర్ణయించుకో వలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు.
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment