ప్రతీకాత్మక చిత్రం
వయసు ముదిరే కొద్దీ తలనెరవడం కామన్. కానీ యుక్త వయసులోనే నెరవడం ఆరంభమై, మధ్యవయసు వచ్చేసరికి తల ముగ్గుబుట్టలాగా మారడం చాలామందిలో కనిపిస్తోంది. తెల్లబడుతున్న జుట్టు యువతలో మానసికాందోళనకు కారణమవుతోంది. దీన్ని కవర్ చేయలేక, ఎలా ఆపాలో తెలియక పలువురు సతమతమవుతుంటారు. ఈ తరుణంలో ఎలాంటి చిట్కా చెప్పినా పాటించేందుకు రెడీ అవుతుంటారు. అంతర్జాతీయంగా కూడా ఈ అంశంపై పలు పరిశోధనలు జరిగాయి. ఒత్తిడి వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందన్నది నిజమేనంటోంది సైన్స్.
ఈ విషయం ఆధారంగా తాజాగా జరిగిన ఒక పరిశోధన ఆశలు రేకిత్తించే ఫలితాలనిచ్చింది. ఈ పరిశోధనలో నల్లజట్టు తొందరగా తెల్లబడేందుకు ఒత్తిడే కారణమని భావించి కొలంబియా యూనివర్సిటీలో ప్రయోగాలు చేశారు. ఒత్తిడిని అదుపులో పెట్టుకోగలిగితే జుట్టు మళ్లీ నల్లబడుతుందని ‘ఈలైఫ్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం చెబుతోంది. ‘ఒత్తిడికి, తెల్లజుట్టుకు ఉన్న సంబంధం గురించి చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిడికి, జుట్టు పండిపోవడానికి కచ్చితమైన సంబంధం ఉంది అని తెలిపే అధ్యయనం ఇది. ఒత్తిడి తగ్గించుకుంటే అనూహ్యంగా కొంతమేర జుట్టు తిరిగి సహజ రంగులోకి మారుతుందనేందుకు ఆధారాలు లభించాయి’ అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ పికార్డ్ తెలిపారు.
ప్రయోగంలో భాగంగా ప్రతి వెంట్రుకను అధ్యయనం చేస్తూ, దాన్లో ఉన్న పిగ్మెంటేషన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ పరిశోధక బృందం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది. అనంతరం వివిధ వయసులకు చెందిన 14 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని, ప్రతి వారం వాళ్ల ఒత్తిడి స్థాయిలు ఎలా ఉన్నాయో నమోదు చేయమన్నారు. ఈ 14 మంది శరీరంలోని వివిధ భాగాల నుంచి వెంట్రుకలు పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో అతి పిన్నవయస్కుల జీవితాల్లో ఒత్తిడి మాయమైపోయినప్పుడు జుట్టు వారి సహజ రంగుకు తిరిగి వచ్చేసిందని గమనించారు. వీరిలో ఒక వ్యక్తి రెండు వారాలు సెలవులు తీసుకుని, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా గడిపిన తరువాత ఆయన వెంట్రుకల్లో కొన్ని వాటి సహజ రంగును తిరిగి పొందాయి.
ఒత్తిడి లేకుంటే చాలా?
జీవితంలో అనుభవించే టెన్షన్లు, ఒత్తిళ్లు మాయం కాగానే తెల్లబడిపోయిన జుట్టంతా వెంటనే నల్లగా మారిపోతుందని భావించకూడదని సైంటిస్టులు చెప్పారు. కేవలం కుదుళ్ల నుంచి పెరుగుతున్న వెంట్రుకలు తమ సహజ రంగుకు వచ్చేస్తాయని పికార్డ్ స్పష్టం చేశారు. అంటే అప్పటికే కుదురు నుంచి పైకి వచ్చిన వెంట్రుక రంగు మారదు. ఎందుకని ఇలా జరుగుతోందనేందుకు ఒత్తిడి కారణంగా మైటోకాండ్రియాలో జరిగే మార్పుల వల్లనే జుట్టు రంగు మారుతోందని సైంటిస్టులు వివరించారు.
మైటోకాండ్రియాలు కణలకు శక్తి సరఫరా కేంద్రాలు. ‘మానసిక ఒత్తిడి వలన మైటోకాండ్రియా విడుదల చేసే శక్తిలో మార్పులు వస్తాయి. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోతే కుదుళ్ల కింద ఉండే కణాలు సరిగా పనిచేయక జుట్టు పింగ్మెంట్‌ను కోల్పోతుంది’ అని పరిశోధకులు చెప్పారు. అయితే ఒత్తిడి తగ్గగానే మైటోకాండ్రియా శక్తి విడుదలలో మార్పులు సర్దుకుంటాయని, అందువల్ల కుదుళ్ల నుంచి మొలిచే కొత్త జుట్టు తన సహజ రంగును తిరిగి పొందుతుందని తెలిపారు. అయితే అందరిలో ఇది సాధ్యమేనా? అంటే కాదనే సమాధానమే వస్తోంది.
ముఖ్యంగా దీర్ఘకాలంపాటు తెల్లజుట్టు ఉన్నవారికి నల్లరంగు మళ్లీ రాదు. ‘ప్రతి ఒక్కరికి ఒక బయోలాజికల్ లిమిట్ (జీవసంబంధమైన పరిమితి) ఉంటుంది. అంటే ఒక వయసొచ్చాక జుట్టు పండిపోతుంది. ఆ పరిమితికి దగ్గర్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరిగితే రావలసిన సమయం కన్నా ముందే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అంటే నిర్ణీత వయసు దాటిపోయి చాలాకాలం అయిపోతే తెల్ల జుట్టు నల్లగా మారడం దాదాపు అసాధ్యం’ అని పరిశోధకులు వివరించారు. అంటే ఒత్తిడి తగ్గిపోయిన ప్రతివారికీ నల్లజుట్టు పెరగడం ప్రారంభమవుతుందని కాదు. కానీ చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడినవారికి మాత్రం ఒత్తిడి తగ్గితే మళ్లీ నల్లజుట్టు పెరిగే అవకాశం ఉంటుంది.
కేవలం జుట్టు రంగు మార్పు గురించే కాకుండా వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న ఇతర అంశాలను మానసిక ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది, అలాంటి మార్పులను రివర్స్ చేయగలమా లేదా అనే అంశాలపై తమ బృందం పరిశోధన కొనసాగిస్తోందని పికార్డ్ తెలిపారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే మానవ జీవన గమనంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment