ఆవు మనకు గోమాత.కాని ఆవు యాంగ్జయిటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్‌వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి‘కౌ హగింగ్’ను సాధన చేస్తున్నారు. ఆవును కావలించుకుని కొంతసేపు గడిపితే యాంగ్జయిటీ పోతుందనివారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. కోవిడ్ సమయంలో ఆందోళనలు పోగొట్టుకోవడానికికౌ హగింగ్‌ను ప్రయత్నిస్తున్నారు.
‘కో నఫ్లెన్’ అంటారట డచ్‌లో ‘ఆవు కావలింత’ని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచే వారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్‌గా చూసే వారున్నారు. ఆవును కావలించుకుని కాసేపు గడిపితే, ఆవును నిమిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు, శరీరం స్వస్థత పొందుతాయని కౌ హగింగ్‌ని ఒక థెరపీగా వారు భావిస్తారు. పదేళ్ల నుంచి ఉన్న సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తోంది. అమెరికాలో అయితే కౌ హగింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని గోశాలల్లో ఒక గోవును పట్టుకుని కూచోవడానికి దాదాపు 75 డాలర్లు (5 వేల రూపాయలు) వసూలు చేస్తున్నారు. అయితే అక్కడి గోశాలలు చాలా శుభ్రంగా, వాసన లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగే ఆవులను అక్కడ చూడవచ్చు.
ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాలిస్తుందని సైకియాట్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ ‘పసిపిల్లలనో, గోవు, శునకం వంటి పెంపుడు జంతువులనో కావలించుకుంటే ఆక్సీటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి వత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్‌ను అదుపు చేస్తాయి’ అంటున్నారు. భారతదేశంలో విశ్వాసాల వల్ల కాని విధానాల వల్లగాని ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లల్లో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు..
Comments
Please login to add a commentAdd a comment