అరవై ఏళ్లుగా మనుషులు లేని ఊరు అదొక శాపగ్రస్త గ్రామం. అరవై ఏళ్లుగా ఆ ఊళ్లో మనుషులెవరూ ఉండటం లేదు. మధ్యయుగాల నాటి ఆ ఊరి పేరు క్రాకో. ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉందిది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద దాదాపు పద్నాలుగు శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించుకున్నారు. ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా రూపొందించుకున్నారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను పూర్తిగా రాళ్లతోనే నిర్మించుకున్నారు.
కొన్నిచోట్ల గుహలలో కూడా ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ‘కేవ్ సిటీ’గా పేరుపొందింది. రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడెరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగపడేది. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో ఈ ఊళ్లోని వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉండటంతో జనాలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు.
బందిపోట్ల దాడుల్లో కొందరు ఊరి జనాలు హతమైపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో కొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూసి వెళుతుంటారు.
(చదవండి: 128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక.)
Comments
Please login to add a commentAdd a comment