ప్రతీకాత్మక చిత్రం
Tips To Maintain Social Media Profile: ఒకప్పుడు.. పెళ్లి సంబంధం చూడాలంటే ‘అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు..’అంటూ లెక్కలు కట్టేవారు. నేడు.. మీ అమ్మాయి/అబ్బాయి ‘సోషల్ మీడియా లింక్ ఇవ్వండి’ అని అడుగుతున్నారు. ఒకప్పుడు.. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే– ‘ఏ స్కూల్, ఎంత పర్సంటేజ్, ఎక్సీపీరియన్స్ ఉందా?’ అని తెలుసుకునేవారు. నేడు.. ‘మీ ప్రొఫైల్ లింక్ షేర్ చేయండి’ అని అడుగుతున్నారు.
ఎవరిగురించైనా తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్‌తో పాటు పోస్టింగ్స్, హ్యాబీస్‌పైనా దృష్టి పెడుతున్నారు. ఏ కంపెనీలో జాబ్?! హార్స్ రైడింగ్ చేస్తున్నారా?! ఇంగ్లిష్ వచ్చా, ప్రఖ్యాత క్లబ్‌లో మెంబర్‌షిప్ ఉందా?... ఇలాంటి అదనపు హంగులనూ దృష్టిలో పెట్టుకొని ‘ఎలాంటి వ్యక్తి’ అనేది అంచనా వేస్తున్నారు.
ఒక మంచి జాబ్ పొందాలన్నా, బిజినెస్ హ్యాండిల్ చేయాలన్నా, పెళ్లి అవ్వాలన్నా.. ఇప్పుడు డిజిటల్ ప్రొఫైల్, పోస్టింగ్స్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి డిజటల్‌లో మీ కీర్తి ఇంతింతై పెరగాలంటే వేటి మీద దృష్టి పెట్టాలో చూద్దాం..
మంచీ–చెడు
సాంకేతికత ప్రభావం సమాజానికి చాలా ప్రయోజనాలను అందిస్తోంది. అదే సమయంలో మనల్ని ఆధారపడేలా, పరధ్యానానికి లోనయ్యే స్థాయిలకు నెట్టేసింది. ప్రపంచంతో ఎలా ఉండాలో కొత్తగా నేర్పిస్తోంది. ఇది స్థానిక సంప్రదాయాలు, ఆచారాలను కూడా ప్రభావితం చేసింది.
ఇవన్నింటిని ఆధారం చేసుకుంటూ మంచి–చెడూ రెండు విధాల డిజిటల్ వేదికగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఏ విధంగా మనం మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నది డిజటల్‌లో మనం చేసే ‘పోస్ట్’లపైనే ఆధారపడి ఉంటుంది. దానికి సిద్ధమవ్వాల్సింది మనమే!
నిజా నిజాల పరిశీలన అవసరం
ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్ ఐడెంటిటీ మీదే అంతా ఆధారపడి ఉంటున్నారు కనుక ‘కంటెంట్’ పోస్ట్ చేసేముందు నిర్ధారణ అవసరం. కొందరికి డిజిటల్ మీడియాలో మంచి పేరు ఉంటుంది. లక్షల్లో ఫాలోవర్లు ఉంటారు. వారు చెప్పే విషయాలను మిగతావారూ నమ్మే విధంగా ఉంటాయి. అందుకని అలాంటివారు మరింత బాధ్యతగా ఉండాలి.
అలాగని, ‘ఫలానావారికి బోలెడంత నాలెడ్జ్ ఉంది’ అని వారు చేసిన పోస్టుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా రీపోస్ట్ లేదా ప్రకటనలు చేయడం అనేది మీ గుర్తింపును దెబ్బతీయవచ్చు. ఒక ‘విషయం’ తెలిసినప్పుడు దానిని మిగతా వేదికల్లోనూ నిజనిర్ధారణ చేసుకోవడం ముఖ్యం. ఉదా: దినపప్రతికలలో దానికి సంబంధిత వార్త పబ్లిష్ అయ్యిందా..’ అని చెక్ చేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన డిజిటల్ గుర్తింపు నిర్మాణం:
►పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించడం మంచి విధానం. మీరు షేర్ చేసే కంటెంట్, దాని ప్రభావం వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండాలి.
►అతిగా షేరింగ్ మానుకోవాలి. మనలో చాలామంది సోషల్ నెట్‌వర్క్‌లలో రిలేషన్‌షిప్ స్టేటస్‌లు పెడుతుంటారు. అభిప్రాయాలను వ్యక్తపరచడం, తప్పులను ఒప్పుకోవడం, లైంగిక గుర్తింపును ప్రకటించడం.. వంటివి చేస్తుంటారు. ఈ వ్యక్తీకరణలు కొన్నిసార్లు మోసగాళ్లకు మీ గుర్తింపును దొంగిలించే సామర్థ్యాన్ని అందిస్తాయి.
►మీ సొంతం కాని కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ను ఫార్వర్డ్ చేసేముందు ఒకసారి వాస్తవ తనిఖీ కూడా చేయండి. ఇందుకు .. ► అంతర్జాతీయ సర్టిఫైడ్ ఫాక్ట్ చెక్స్ నెట్‌వర్క్ www. factly.com, www. boomlive.in ల సాయం తీసుకోవచ్చు.
►మీ ప్రైవసీని రక్షించుకోవాలి. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు VPN లేదా ఇన్‌కాగ్నిటో మోడ్ ఫీచర్‌ని ఉపయోగించాలి. లేదా TOR/Ducj Duck Go ను ఉపయోగించవచ్చు. ►ఉచిత వై–ఫై నెట్వర్క్‌లను అస్సలు వాడద్దు. ఎండ్–టు–ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న మెసేజ్ అప్లికేషన్‌లను ఉపయోగించాలి. ఫోన్, యాప్, మెయిల్స్ డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను మార్చుతూ ఉండాలి. మొబైల్ యాప్‌లు, బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు ఓకే చేసేముందు ఒకటికి రెండుసార్లు ‘సరైనదేనా’ అని నిర్ధారించుకోండి.
►పిల్లల ఆన్‌లైన్ వినియోగాన్ని పెద్దల నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
►ఈ డిజిటల్ యుగంలో వ్యక్తి, సంస్థ గురించిన సామాజిక ప్రొఫైల్ తెలుసుకోవడంలో ఏ విధంగా సాయపడుతుందో.. మన అలవాట్లనూ బహిర్గతం చేస్తుంది. చెడు అలవాట్లను నివారించి, మంచి డిజిటల్ గుర్తింపు పొందడానికి సరైన మార్గాన్ని వేసుకోవడానికి అందరం ప్రయత్నిద్దాం.
-అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment