సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లో సాగులో ఉన్న డి విటమిన్ గోధుమ పంటను చూపుతున్న వెంకటరెడ్డి
ప్రకృతి సిద్ధంగా కొన్ని ఆహారోత్పత్తుల్లో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, పలు సంస్థలు జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా ఆశించిన విటమిన్‌ను ఏదో ఒక ‘వంగడం’లోకి చొప్పించి, ఆ వ్యవసాయోత్పత్తిలో ఆ విటమిన్ వచ్చేలా చేయడానికి వ్యయ ప్రయాసలకోర్చి ‘జన్యుమార్పిడి’ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా, జన్యుమార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేకుండానే.. పంట ఏదైనా సరే.. మనకు అవసరమైన విటమిన్లను వ్యవసాయోత్పత్తుల్లో పుష్కలంగా రాబట్టుకునే సహజ సేద్య మెళకువలను తాను రూపొందించానని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ముందే వున్న 60 సెంట్ల భూమిని (ఇందులోనే డి విటమిన్ వచ్చేలా గోధుమ పంటను సాగు చేస్తున్నారు), కీసర సమీపంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలలుగా మార్చారు.
వరి, గోధుమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే క్రమంలో కొన్ని సహజ మిశ్రమాలను వినియోగించడం ద్వారా వరి బియ్యం, గోధుమల్లో గతంలో విటమిన్ ఎ, సి, తాజాగా విటమిన్ ‘డి’ని రాబట్టానని ఆయన ప్రకటించారు. తన పొలంలో నుంచే పై మట్టిని, (4–6 అడుగుల) లోపలి మట్టిని సేకరించి ఎండబెట్టి.. ఈ మట్టిని పంటలకు సేంద్రియ ఎరువుగా, సేంద్రియ పురుగుమందుగా వాడటంపై వెంకటరెడ్డి గతంలో చేసిన ఆవిష్కరణలు పత్రికలు, టీవీ ఛానల్స్, యూ ట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల రైతులక్కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎడారి మిడతల దండు పంట ను ఆశించకుండా చేయడానికి కూడా మట్టి ద్రావణం దోహదపడిందని ఆయన చెప్పటం మనకు తెలుసు.
‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్
ఆవిష్కరణల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తున్న చింతల వెంకటరెడ్డి వ్యవసాయోత్పత్తుల్లో విటమిన్ ఎ., సి.లతో పాటు ‘డి’ రాబట్టుకునే సాగు పద్ధతులపై అనేక ఏళ్ల పాటు విస్తృత ప్రయోగాలు చేసి నిర్థారణకు వచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలను క్రమపద్ధతిలో రాసి పేటెంట్ కోసం ధరఖాస్తు పంపారు. పేటెంట్ పొందటానికి దీర్ఘకాలం పడుతుంది. మొదట మన దేశంలో పేటెంట్ కోసం 2019 ఆగస్టు 02న ధరఖాస్తు పంపారు (దీనిపై ఇంకా పేటెంట్ మంజూరు కాలేదు). ఆ తర్వాత, 2020 ఆగస్టు 1న ‘అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూ.ఐ.పి.ఓ.– వైపో)కు ధరఖాస్తు పంపారు. ఈ ధరఖాస్తుపై స్పందించిన వైపో ఈ నెల 11న చింతల వెంకటరెడ్డి ‘మొక్కల్లో పోషక విలువలను పెంపొందించే మిశ్రమం’ గురించి తన వెబ్‌సైట్‌లో పబ్లికేషన్ విడుదల చేసింది (ఇంటర్నేషనల్ పబ్లికేషన్ నంబర్: డబ్ల్యూ.ఓ. 2021/024143 ఎ1). ‘వైపో’ ఇచ్చిన పబ్లికేషన్ పేటెంట్ కాదు.
అయితే, చింతల వెంకటరెడ్డి మాదిరిగా రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి చేయకుండా ఒక సేంద్రియ మిశ్రమం ద్వారా వ్యవసాయోత్పత్తుల్లో డి విటమిన్ తదితర విటమిన్లను పొందటానికి ఉపయోగడపడే మిశ్రమం గురించి గతంలో ఏ దేశంలోనూ ఎవరికీ మేధో హక్కులు ఇవ్వలేదని వైపో పేర్కొంది. 130 దేశాల్లోని జాతీయ స్థాయి పేటెంట్ కార్యాలయాలకు ధరఖాస్తు చేసుకొని పేటెంట్ హక్కులు పొందవచ్చిన వైపో పబ్లికేషన్ మార్గాన్ని సుగమం చేసింది. కాల్షియంను దేహం గ్రహించాలన్నా, ఎముక పుష్టి కలగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా డి విటమిన్ ఆవశ్యకత చాలా ఉంది. పెద్దలకు రోజుకు 1,000 ఇంటర్నేషనల్ యూనిట్(ఐ.యు.)లు, పిల్లలకు 400 ఐ.యు.లు అవసరం. డి విటమిన్ తక్కువగా ఉన్న వారికి, ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారికి ఇంకా ఎక్కువ మోతాదులో డి విటమిన్ అవసరం ఉంటుంది. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది. ఎండలో తిరగని వారు పుట్టగొడుగులు (ఎండబెట్టినవి) తిని విటమిన్ డి కొరతను తగ్గించుకోవచ్చు. అయితే, అదేదో రోజువారీగా తినే ఆహార ధాన్యాల్లోనే వుంటే మరింత మేలు కదా!
ఏ పంట అయినా సరే..
ఏ పంట దిగుబడులోనైనా డి., ఎ., సి. విటమిన్లు వచ్చేలా చేయవచ్చని నా అనుభవంలో రుజువైంది. వరి, గోధుమ, జొన్న, కొర్ర తదితర ధాన్యాలు.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపల్లో వేటిలోనైనా ఈ విటమిన్లు వచ్చేలా చేయవచ్చు. జన్యుమార్పిడి అవసరం లేదు. ప్రత్యేక రసాయనాలు వాడనకవసరం లేదు. ప్రకృతిలో అందరికీ ఎక్కడపడితే అక్కడ దొరికే ఆహారోత్పత్తులనే వాడి కావల్సిన విటమిన్లను పంట దిగుబడుల్లో వచ్చేలా చేయవచ్చు. ఈ ఆవిష్కరణకు ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ వెలువడటం సంతోషదాయకం. భారత పేటెంట్ కోసం వేచి చూస్తున్నాను. క్యారట్, మొక్కజొన్న పిండి, చిలగడ దుంపలను వాడి రైతులు ఎవరైనా తమ పంట ఉత్పత్తుల్లో విటమిన్ డి రాబట్టుకోవచ్చు. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించి, తిని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ టెక్నిక్‌తో పండించిన ఆహారోత్పత్తులను దేశవిదేశాల్లో వాణిజ్య పరంగా విక్రయించాలనుకునే వ్యక్తులు/సంస్థలు మాత్రం ముందుగా నాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. – పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్
మిశ్రమ ద్రావణం ఎంత మోతాదులో వెయ్యాలి?
ఎకరానికి ఒక విడత సరిపడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. 2 కిలోల క్యారట్లు, 2 కిలోల చిలగడ దుంపలు, 2 కిలోల మొక్కజొన్న గింజల పిండిని ఉపయోగించాలి. క్యారట్లు, చిలగడదుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టి, ఒక లీటరు నీరు కలిపి మిక్సీలో వేసి.. ద్రవ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండిని ఇందులో కలపాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర డ్రమ్ము నీటిలో కలిపి పంటకు అందించాలి. వరి, గోధుమ వంటి ధాన్యపు పంటల్లో అయితే, బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టి పడే దశ వరకు సుమారు నెల రోజుల వ్యవధిలో 4–5 సార్లు ఈ ద్రావణాన్ని అందించాలి. కూరగాయ, పండ్లు తదితర పంటల్లో అయితే, పూత, పిందె దశలో 4–5 సార్లు పంటకు ఈ ద్రావణాన్ని ఇవ్వటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు అని వెంకటరెడ్డి తెలిపారు.
ఎ, సి విటమిన్ల కోసం ఏం చేయాలి?
‘ఎ’ విటమిన్ పంట ఉత్పత్తుల్లో రావాలని మనం అనుకుంటే.. చిలకడదుంప లేదా పాలకూర లేదా క్యారెట్‌లు 2 కేజీలు తీసుకొని ఉడికించి మిక్సీ పట్టించి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి, ఎకరం విస్తీర్ణంలో పంటలకు అందించాలి. ‘సి’ విటమిన్ రావాలి అనుకుంటే.. టమాటా లేదా ఉసిరి లేదా నారింజ లేదా బత్తాయి, నిమ్మ కాయలను 2 కిలోలు తీసుకొని ముక్కలు కోసి రసం తీసి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ఒక ఎకరానికి అందించాలి అని వెంకటరెడ్డి వివరించారు. పొలానికి కాలువల ద్వారా పారించే నీటిలో ఈ ద్రావణాన్ని కలపటం కన్నా.. రెయిన్ డ్రిప్ ద్వారా అందిస్తే.. మొదట మొక్కలకు, తర్వాత నేలకు రెండు విధాలా కూడా పోషకాలు అందుతాయి. పంట పొలంలో 3 అడుగుల ఎత్తున ఇనుప సెంట్రింగ్ ఫ్రేమ్ పైన ‘రెయిన్ డ్రిప్’ ప్లాస్టిక్ ట్యూబ్‌లను అమర్చి, పంటకు 1 కేజీ ప్రెజర్‌తో వెంకటరెడ్డి నీరు అందిస్తున్నారు.
క్యారెట్, చిలగడ దుంప,మొక్కజొన్న పిండితో మిశ్రమం..
‘డి’ విటమిన్ కోసం ప్రత్యేకించి వరి, గోధుమలను వెంకటరెడ్డి సాగు చేస్తూ వచ్చారు. తన టెక్నిక్‌ను పాటిస్తే.. ధాన్యాల్లోనే కాదు, కూరగాయలు, దుంప పంటలు, ఆకుకూరలు, క్యాబే జీ వంటి పూల జాతి కూరగాయల్లో కూడా విటమిన్ డి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యారెట్, చిలగడ దుంప, మొక్కజొన్నల మెత్తని పిండి.. వీటితో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ‘రెయిన్ డ్రిప్’ ద్వారా వరి, గోధుమ పంటలకు పిచికారీ చేశామని ఆయన తెలిపారు. పంట పొట్ట దశలో ఉన్పప్పుడు నెల రోజుల్లో 4–5 దఫాలు ఈ ద్రావణాన్ని నీటితోపాటు పంటకు అందించాలని ఆయన తెలిపారు. వీటిలోని కెరొటినాయిడ్స్‌ను పంట మొక్కలు గ్రహించడం ద్వారా విటమిన్ ‘డి’ ఆ పంట దిగుబడుల్లో కనిపించిందని ఆయన తెలిపారు.
వరి, గోధుమల్లో విటమిన్ డి తెప్పించడం కోసం 2011 నుంచి ప్రయోగాలు చేస్తున్నానని, 2018లో సక్సెస్ అయ్యానని, తదుపరి కూడా అనేక పంటలు పండించి నిర్థారణకు వచ్చానని చింతల వెంకటరెడ్డి తెలిపారు. ఓల్డ్ ఆల్వల్‌లో ప్రస్తుతం తన ఇంటి ఎదుట పొలంలో కూడా గోధుమ పంటను డి విటమిన్ కోసం పండిస్తున్నారు. 15 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లోనే ఆయన ద్రాక్ష, వరి, గోధుమ తదితర పంటలు పండిస్తున్నారు. ఎకరానికి ఏటా 5–6 క్వింటాళ్ల ఆముదం పిండి వేస్తుంటారు. పంటలపై పైమట్టి, లోపలి మట్టి పిచికారీ చేస్తుంటారు. గోధుమ మొలకలు, వరి మొలకలను మరపట్టించి, ద్రావణంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తుంటారు.
డి విటమిన్ బియ్యం, గోధుమలను చూపుతున్న వెంకటరెడ్డి
ఏ పంటలో ‘డి’ విటమిన్ ఎంత?
క్యారెట్, మొక్కజొన్న పిండి, చిలగడదుంపలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం వల్ల వరి బియ్యంలో కన్నా, గోధుమల్లో అధిక పాళ్లలో డి విటమిన్ వస్తున్నట్లు చింతల వెంకటరెడ్డి గుర్తించారు. 2019 రబీ పంటలో పండించిన గోధుమల్లో(దిగుబడి హెక్టారుకు 4.68 టన్నులు) 100 గ్రాములకు 1,606 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.లు) డి విటమిన్ ఉండగా, 2020 ఖరీఫ్‌లో పండించిన పంటలో 100 గ్రాములకు 1,803 ఐ.యు.ల మేరకు డి విటమిన్ ఉన్నట్లు విమ్‌తా లాబ్‌లో చేయించిన పరీక్షల్లో తేలిందని వెంకటరెడ్డి తెలిపారు. 2019 రబీలో పండించిన వరి బియ్యంలో 100 గ్రాములకు 136 ఐ.యు.ల మేరకు, 2019 ఖరీఫ్‌లో పండించిన వరి బియ్యం (దిగుబడి హెక్టారుకు 9.68 టన్నులు)లో 100 గ్రాములకు 102.70 ఐ.యు.ల మేరకు విటమిన్ డి వచ్చిందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment