ఇదీ మట్టిని ఎరువుగా వాడే తీరు! | This is the way used to manure the soil! | Sakshi
Sakshi News home page

ఇదీ మట్టిని ఎరువుగా వాడే తీరు!

Published Mon, Apr 7 2014 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

ఇదీ మట్టిని ఎరువుగా వాడే తీరు!

ఇదీ మట్టిని ఎరువుగా వాడే తీరు!

రెండో పద్ధతి: పొలం మొత్తంలో అడుగు లోతు మట్టిని రెండు దఫాలుగా సేకరించి ఎండబెట్టి, దశల వారీగా ఎరువుగా వాడుకోవాలి.
 
 ఈ పద్ధతిలో కందకం తవ్వే శ్రమ, ఖర్చు ఉండదు. విటమిన్ ఏ, సీ ఉండే బియ్యం, గోధుమలు పండిస్తున్నది ఈ పద్ధతిలోనే.  పంట కోసిన తర్వాత తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. పంట కోసిన వెంటనే నేలలో పదును ఆరిపోక ముందే.. మోళ్లతో పాటు లేచి వచ్చేలా 4-6 అంగుళాల లోతున పొలం మొత్తాన్నీ దున్నాలి.
 
 ఈ పైపొర మట్టిని డోజర్ ట్రాక్టర్‌తో పక్కకు తీసి ఒక కట్టగా/కుప్పగా వేసి ఉంచాలి (గత పంట కాలంలో పోషకాలను కోల్పోయిన ఈ మట్టిని మోళ్లతో పాటు రెండు నెలలు కుళ్లబెడితే తిరిగి సారవంతమవుతుంది). అదే పొలాన్ని.. మరోసారి 6 అంగుళాల లోతున దున్ని, ఆ మట్టినీ పక్కకు తీసి మరో కట్టగా వేసుకోవాలి (ఇది లోపలి పొరలోని మట్ట్టి -సబ్ సాయిల్- కాబట్టి, సహజంగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి). 60 రోజులు ఎండాకాలంలో ఎండిన తర్వాత వర్షాకాలం ముందు కట్టగా పోయాలి. లోపలి మట్టి పైకి తీసిన తర్వాత కనీసం 1, 2 సంవత్సరాలు ఎండకు ఎండి, వర్షానికి తడిస్తే.. ఆ మట్టిలోని పోషక విలువలు ఇంకా వృద్ధి చెందుతాయి. ఎండు మట్టి గాలిలోని నత్రజనితోపాటు ఇతర పోషకాలను స్థిరీకరించుకొని మొక్కలకు అందిస్తుంది. పంటలకు వాడేటప్పుడు మాత్రం మట్టి పొడిగా ఉండాలి.
 
 ఇలా పొలంలోని మోళ్లతోపాటు సేకరించిన పైమట్టిని, లోపలి మట్టిని వేర్వేరుగా సేకరించి పెట్టుకున్నాక.. తిరిగి నాట్లు వేసుకున్న తర్వాత సాగు నీటిలో మట్టిని కలుపుతూ ఒండ్రు నీటిని పారించేందుకు వాడుకోవాలి. మొదట సేకరించి ఎండబెట్టిన పైమట్టిని పంట పూత దశకు ముందు వాడాలి. తర్వాత సేకరించి ఎండబెట్టిన మట్టిని పంట పూత దశకు వచ్చిన తర్వాత నీటి తడుల్లో వాడాలి.
 
 వరి సాగు పద్ధతి: దమ్ము చేసి నాట్లు వేసిన తర్వాత నుంచి పది రోజులకోసారి మట్టి కలిపిన నీటి తడులు ఇవ్వాలి. మధ్యలో అవసరమైతే మామూలు తడులు ఇచ్చుకోవచ్చు. ప్రతిసారీ ఎకరానికి 2 టన్నుల (2 ఎడ్ల బండ్లు) చొప్పున ఎండిన మట్టిని బోరు/ కాలువ నీటిని కలుపుతూ పొలానికి పారించాలి. పూతకు వచ్చేవరకు పొలంలో అంగుళం ఎత్తున నీటిని నిల్వగట్టాలి.
 
  పూతకు వచ్చిన తర్వాత నుంచి నీటిని నిల్వగట్టక్కర్లేదు. ఆరుతడులు ఇస్తే చాలు. తడి పెట్టిన ఒకటి, రెండు గంటల్లో నీళ్లు ఇంకిపోయేలా పెడితే చాలు. పంట పూతకొచ్చిన తర్వాత ఇచ్చే 3 నీటితడులు పోషకాలను సంతరించుకోవడంలో చాలా కీలకమైనవి. రెండో విడత సేకరించి ఎండబెట్టి ఉంచుకున్న మట్టిని ఈ దశలో తడుల్లో ఎకరానికి 2 టన్నుల చొప్పున వాడాలి. కాలువలో నీరు పారుతున్నప్పుడు ఈ పొడి మట్టిని కలుపుతూ మట్టి కలిపిన ఒండ్రు నీటిని పొలానికి పారించాలి.
 
 అయినా, పంట చిరుపొట్ట లేదా ఈనే దశలో నత్రజని లోపం కనిపిస్తే.. ఎకరానికి 500 కిలోల వర్మీ కంపోస్టు లేదా 200 కిలోల ఆముదం పిండి లేదా 200 కిలోల వేపపిండిని వేసుకోవాలి. ఇలా పండించిన బియ్యం, గోధుమల్లోనే విటమిన్ ఏ, సీ భారీగా ఉన్నట్లు తేలింది. ఇంకా మనకు తెలియని ఏ యే పోషకాలు ఉన్నదీ లోతైన అధ్యయనాలు చేస్తేగానీ తెలియదు.
 గోధుమ సాగు: గోధుమ సాగుకు నీటిని అసలు నిల్వగట్టాల్సిన పని లేదు. 10-15 ఆరుతడులు ఇస్తే చాలు.
 
 కూరగాయలు, పూలమొక్కల సాగు: డ్రిప్ కింద సాగు చేస్తుంటే.. ప్రతి మొక్కకు పది రోజులకోసారి 200 గ్రాముల చొప్పున ఎండిన మట్టిని ఎరువుగా వేసుకోవచ్చు. నీటిని పారగట్టే పద్ధతిలో పైన పంటల మాదిరిగానే చేయవచ్చు. బిందు సేద్యం ద్వారా సాగు చేసే ద్రాక్ష తదితర పంటలకు డ్రిప్ పాయింట్ వద్ద కిలో ఎండిన మట్టిని పది రోజులకోసారి వేసుకోవాలి. పంట వరుసల మధ్యలో ఎండిన మట్టిని తీసి ఒకసారి, లోపలి మట్టిని ఒకసారి మార్చి మార్చి వేసుకోవాలి. లోపలి మట్టిని నీటిలో కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.
 
 మొదటి పద్ధతి: కందకం లోతుగా తవ్వి లోపలి మట్టిని తీసి.. పొలం అంతా పరిచి పంటలు పండించడం: పొలంలో ఒక వైపు కందకం తవ్వి తీసిన లోపలి మట్టి(సబ్‌సాయిల్- సారవంతమైన మట్టి)ని పొలం అంతటా పరవాలి. కొత్త, పాత మట్టిని కలియదున్నాలి. సేంద్రియ ఎరువులు (వర్మీ కంపోస్టు, ఆముదం/వేప పిండి) వేసి.. వరి నాట్లు వేసుకొని మామూలుగానే అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. అయితే, పైరు పూత దశకు ఎదిగిన తర్వాత.. గింజ కట్టే దశ వరకు.. 2, 3 తడుల్లో.. ముందుగా సేకరించి పెట్టుకున్న ఎండిన మట్టిని సాగు నీటితోపాటు కాలువలో కలుపుతూ బురద నీటిని పారించాలి. మొదట్లో కందకం తవ్వినప్పుడే సేకరించి, ఎండబెట్టి, నిల్వ చేసుకున్న మట్టిని ఈ విధంగా వినియోగించాలి. ఎకరానికి ఒక ట్రాక్టర్ మట్టి సరిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement