ఇదో ప్రకృతి కళాఖండం. ఉత్తర ఆఫ్రికాలో ఇథియోపియా ఈశాన్య ప్రాంతంలోని దీన్ని దానకిల్ డిప్రెషన్ అంటారు. 1,36,956 చదరపు కిలోమీటర్ల మేర కళ్లు చెదిరేంత అందంతో రంగులీనుతుంది ఈ ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే వేరే గ్రహం మీద అడుగుపెట్టినట్లుంటుంది. ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ భూమి నుంచి నిత్యం నిప్పులు ఎగసిపడతాయి. ఇక్కడ నీళ్లు కుతకుతా మరుగుతాయి.
అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఆమ్లవర్షం కురుస్తుంటుంది. మనిషి మనుగడకు అనుకూలం కాని ఈ ఎడారిలో చూడతగ్గ అందాలెన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా నీడలా పొంచే ఉంటాయి. భూమి లోపల అల్లకల్లోలం ఏర్పడినప్పుడల్లా నిప్పులుచిమ్మే లావా ఎగసిపడుతుంది. అది ధారలా పొంగి, కనుచూపు మేర రంగురంగుల కథలెన్నో చెబుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ భూభాగం ఎన్నో మార్పులకు గురైంది. దీనిలోని వైవిధ్యభరితమైన మార్పులను గుర్తించి, దీనికి ‘దానకిల్ డిప్రెషన్’ అని పేరు పెట్టారు.
దానకిల్ చుట్టుపక్కల పెద్దపెద్ద లోయలు, ఎతై న పర్వతాలు, ఉప్పు గోపురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడికి వెళ్లే పర్యాటకులంతా స్థానిక గైడ్ అడుగుజాడల్లోనే నడుచుకోవాలని సూచిస్తుంటారు. సురక్షితమైన పాదరక్షలు ధరించి మాత్రమే నడవాలంటారు. చేతులతో ఏదిపడితే అది తాకి చూడటం ప్రమాదమని హెచ్చరిస్తారు. గ్రహాంతర ప్రదేశంలా ఉండే ఈ దానకిల్‌లో వేడి నీటి బుగ్గలు, ఆమ్ల కొలనులు, సరస్సులు మైమరిపిస్తుంటాయి. అయితే ఈ ఎడారి ఎందుకు ఇంత వేడిగా ఉంటుంది? భూమి లోపల ఏం జరుగుతూ ఉంటుంది? లాంటి వివరాలను శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోయారు. దాంతో భూమి మీద ఈ ప్రదేశం మిస్టీరియస్‌గానే మిగిలిపోయింది.
ఇథియోపియాలో కొన్ని శతాబ్దాల క్రితం ఉప్పును కూడా కరెన్సీగా ఉపయోగించేవారట. అందుకోసం ఉప్పును సేకరించేందుకు ఈ ప్రదేశానికి వెళ్లేవారట. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎర్ర సముద్రంలో భాగంగా ఉండేది. కాలక్రమేణా అగ్నిపర్వతాల విస్ఫోటాల కారణంగా.. కొంతభాగం సల్ఫ్యూరిక్ సరస్సులా మారింది. మరికొంత భాగం లావాతో బీటలువారి ఎడారిని తలపిస్తుంది. శిలాద్రవంలోని ఖనిజాలు, సముద్రపు ఉప్పు నీరు, ఆమ్ల వర్షపు నీరు కలసి పసుపు, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులతో ఈ ప్రాంతమంతా మెరుస్తుంది. ఇక్కడ కొంత సురక్షితమైన భూభూగానికి పర్యాటకులు తరచుగా వెళుతుంటారు. చూడటానికి ఈ పరిసర ప్రాంతాలన్నీ చాలా వింతగా ఉంటాయి. ఒక చోట వేడి నీరు.. పొగలు కక్కుతుంటే, పక్కనే మరో చోట చల్లటి నీటి కొలను సేదతీరుస్తుంది. మనుషులను మునిగిపోనివ్వకుండా తేలియాడిస్తూ ఆటలాడిస్తుంది.
--సంహిత నిమ్మన
(చదవండి: కాదేది రికార్డుకనర్హం! అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..!)
Comments
Please login to add a commentAdd a comment