తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత. నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రం లో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుడిని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా వెళ్లి సంహరించిన పర్వదినమే నరక చతుర్దశి. ఆ మరునాడు దీపావళి పండుగ. నేడు దీపావళి సందర్భంగా ఈ వ్యాస దీపం.
నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి.మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు.
వీరూ వారన్న విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీ కృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీ కృష్ణుడు క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతణ్ణి కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత కృష్ణుడు మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, అతడి కంఠాన్ని దునుమాడి, వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది.
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షంతో మాత్రమే దూరం అవ్వడమే దీపావళి.
చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగు లో ఏది యేదో గుర్తించే మనం, చీకటిలో ఆ శక్తిని కోల్పోవడం జరుగుతున్నది. అలాటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైన సూర్య–చంద్ర–తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి ప్రకాశాలే తప్ప మరొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి, వేడుకగా పండుగ జరుపుకుంటారు.
ఈ పర్వదినాన..
ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభిముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యముణ్ణి పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాలుస్తారు.
ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఈ సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం. ఆ మరునాడు దీపావళి అమావాస్య. దీపావళి అమావాస్యనాడు పగలు పిండివంటలతో కూడిన విందు భోజనం చేయడం, సాయంత్రం వేళ ఇల్లంతా దీపాలతో అలంకరించడం, లక్ష్మీపూజ చేయడం ఆ తర్వాత బాణాసంచా కాల్చి నోరు తీపి చేసుకోవడం ముఖ్య కృత్యాలు. అర్ధరాత్రివేళ లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇవ్వడం శుభప్రదం.
–డి.కృష్ణకార్తీక
Comments
Please login to add a commentAdd a comment