ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స కోసం ఇప్పటికీ సంప్రదాయ మూలికలపైనే ఆధారపడుతున్నారు. ఇంటి తోటలో వీటిని పెంచడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి సృజనాత్మకమైన సంతృప్తి. మరోటి ఇంట్లో సంప్రదాయ వ్యాధుల చికిత్స. ఈసారి హోం గార్డెనింగ్‌లో భాగంగా ఇంటి తోటలోనే పెంచే ఔషధ మొక్కల గురించి తెలుసుకొని, వాటి పెంపకాన్ని ఆచరణలో పెట్టేయండి. ఈ మొక్కలకు ఎలాంటి మట్టి కావాలి, ఎంత నీరు పోయాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకోండి.
అనేక ఉపయోగాల అలోవెరా
కలబంద అనేక వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది. జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దోమ వంటి ఇతర కీటకాల కాటులో నొప్పి, మంటను తగ్గిస్తుంది. కలబందను కుండీలలో పెంచుకోవచ్చు. సూర్యకాంతి బాగుండాలి. తక్కువ నీరే అవసరం పడుతుంది. రెండు నెలలకు ఒకసారి కాస్తంత ఆవుపేడను ఎరువు గా వేస్తే సరిపోతుంది.
తిప్పతీగ
గిలోయ్ అనే ఈ తీగ ఆకు గంట ఆకారంలో ఉంటుంది. ఈ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాలేయం, మూత్రపిండాల సమస్యలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, మధుమేహానికి ఉపయోగపడుతుంది. దీనికి అమితమై శ్రద్ధ అవసరం లేదు. పెద్ద కుండీల్లో లేదా కుండలో మట్టి పోసి, నాటితే చాలు. సులభంగా పెరుగుతుంది.
నిమ్మగడ్డి
యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ మెరుగుకు సహాయపడుతుంది. ఈ గడ్డి మొక్కను వెడల్పాటి కుండీలలో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువ అవసరం. కుండీ మట్టిపై భాగంలో ఇసుక పోయాలి. అప్పుడు అదనంగా నీళ్లు ఉన్నా త్వరగా ఇంకిపోతాయి.
సరస్వతి ఆకు
మండుకాపర్ణి, బ్రాహ్మి మొక్కగానూ పేరున్న సరస్వతి ఆకు అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు, ఇతర మానసిక వ్యాధులను నయం చేయడానికి తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ మొక్కకు ఒక భాగం మట్టి, ఒక భాగం ఇసుక, రెండు భాగాలు సేంద్రీయ ఎరువుల మిశ్రమం ఉండాలి. రోజూ నీళ్లు పోయాలి.
అశ్వగంధ
శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులకు ప్రయోజనకారి. ఈ మొక్కలో ఆకులు, కాండం, వేళ్లు కూడా చికిత్సలో ఉపయోగపడతాయి. కుండీలలో సులభంగా పెంచగల చిన్న మొక్క. ఎక్కువ నీళ్లు అవసరం లేదు. వర్షాకాలం అసలే జలుబు కాలం. దాంతోపాటే దగ్గు, తుమ్ములు. కరోనా కాలం కూడా కావడం తో ఈ తరహా అనారోగ్యం మనల్ని భయపెడుతుంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి ఔషధ వరాలు గల మొక్కలు మన ఇంట్లోనే ఉంటే ఆందోళన కొంత తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment