ముత్యమంత పసుపుతో బోలెడన్ని ప్రయోజనాలు | Do you know health benefits of turmeric | Sakshi
Sakshi News home page

ముత్యమంత పసుపుతో బోలెడన్ని ప్రయోజనాలు

Published Sat, Dec 14 2024 3:47 PM | Last Updated on Sat, Dec 14 2024 4:39 PM

Do you know health benefits of turmeric

పసుపులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా పసుపు వాడకం చాలా ఎక్కువ అయింది. ముఖ్యంగా పచ్చిపసుపును విరివిగా వాడుతున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా పద్ధతి ప్రకారం పచ్చిపసుపును వాడటం వల్ల అధిక ప్రయోజనాలున్నాయని  పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

అవేమిటో చూద్దాం... 
పసుపును కొన్ని ఆయుర్వేద ఔషధాలలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. వంటలో కూడా ఉపయోగిస్తారు. గ్లాసుడు వేడి పాలలో చిటికడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, జలుబు, దగ్గు తగ్గుతాయి. శరీరంలో అధికంగా ఉన్న చెడు కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగని పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

ఇలా వాడాలి!
పచ్చి పసుపుతో ఆయుర్వేదిక్‌ టీలు, సూప్‌లు, స్మూతీస్‌ వంటివి తయారు చేసుకోవచ్చు. ఇది వంటకాలకు మంచి రంగు, రుచి, వాసనలను జత చేస్తుంది. అయితే పసుపు పొడిని మరిన్ని అవసరాలకు వాడొచ్చు. మారినేషన్, మసాలాలు, సాస్‌లు, డ్రింక్స్‌లో దీన్ని యాడ్‌ చేసుకోవచ్చు.

పసుపు టీ: రెండంగుళాల ΄ పొడవున్న తాజా పచ్చిపసుపు కొమ్మును తీసుకుని దాని మీదుండే   పొరను తీసేయాలి. దానిని సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్‌ మీద మరుగుతున్న గ్లాసున్నర నీటిలో ఆ ముక్కలు వేయాలి. దానికి చిటికెడు మిరియాల పొడి, కాస్తంత బెల్లం తరుగు జతచేయాలి. కాగిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ కలిపి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్‌ మీది నుంచి దించి వడపోసి గ్లాసులో పోసుకుని టీలాగే సిప్‌ చేయాలి.

స్మూతీస్‌లో కలపడం...
పైనాపిల్, మ్యాంగో, ఇతర రకాల పండ్ల ముక్కలతో పాటు సన్నగా తురుమిన పచ్చి పసుపు కొమ్ము, కొబ్బరినీళ్లు, బాదం  పాలు కలిపి చేసిన స్మూతీ తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగు తాయి. నిమ్మరసం, అల్లం రంసం, మిరియాల  పొడి, కొబ్బరి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లలో చిటికడు పచ్చిపసుపు కలిపి వడకట్టి తాగితే జలుబు, దగ్గు, ఒంట్లో వాపులు తగ్గుతాయి. 

వెటిజబుల్‌ సలాడ్‌తో... 
టమోటా, దోస, బీర, బెండ, క్యారట్, బీట్‌రూట్, ముల్లంగి, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ తదితర కూరగాయల ముక్కల మీద పసుపు, మిరియాలపొడి,చల్లుకుని తింటే మంచిది. 

పసుపు నీళ్లు... 
తేలికైన మార్గం ఏమిటంటే... తాజా పసుపు కొమ్మును పొట్టు తీసి ముక్కలుగా తరిగి వాటర్‌ బాటిల్‌లో వేయాలి. కొన్ని గంటల తర్వాత ఆ నీటిని తాగుతూ ఉంటే పసుపులో ఉన్న లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement