పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా? | When You Take Turmeric Every Day This Is What Happens | Sakshi
Sakshi News home page

పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Published Mon, Jul 1 2024 4:58 PM | Last Updated on Mon, Jul 1 2024 8:01 PM

When You Take Turmeric Every Day This Is What Happens

పసుపుని వంటల్లో తప్పనిసరిగా వాడుతుంటాం. ఇది యాంటీ బయాటిక్‌లా పనిచేస్తుందని, దీని వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవనేది అందరి నమ్మకం. ఇది మంచిదని తెలసుగానీ ఎంతలా ఆరోగ్యంపై ప్రభావవంతంగా పనిచేస్తుందనేది కచ్చితంగా తెలియదు. కానీ నిపుణులు ఈ పసుపుతో ఎన్ని రోగాలు నివారించొచ్చు అని నిర్థారించి మరి చెప్పుకొచ్చారు. ముఖ సౌందర్యం నుంచి వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడం వరకు ఎంతలా ప్రభావవంతంగా ఉంటుందో వివరంగా తెలిపారు. అదెలోగో సవివరంగా నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!

చైనీస్‌, మధ్య ప్రాచ్య వంటకాల్లో పసుపుకి సుదీర్ఘమైన చరిత్రను కలిగి ఉంది. దీన్ని ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమంటే..

మంటను నివారిస్తుంది...
పసుపులో కర్కుమిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణుడు అనుపమ కిజక్కేవీట్టిల్‌ చెబుతున్నారు. ఎన్‌ఎఫ్‌-కే8 అనే అణువు శరీరంలోని వ్యక్తిగత కణాలలోని కేంద్రకం లేదా మెదడులోకి ప్రవేశించకుండా చేస్తుంది. తద్వారా మంటను ప్రేరేపించే జన్యువులు స్పందించకుండా నిరోధిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్‌లు, గాయాలు ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ లేదా టాక్సిన్స్‌ వంటి వాటి వల్ల వచ్చే మంటను ఇది తగ్గిస్తుంది. 

కేన్సర్‌కి చెక్‌..
​కేన్సర్‌ని పసుపు ప్రభావవంతంగా నిరోధించగలదని న్యూట్రియంట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు పరిశోధకులు. అందుకోసం దాదాపు 12 వేల మందిపై పరిశోధన చేయగా 37% సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఇది ప్రభావవంతమైన యాంటీ కేన్సర్‌ మందుగా పనిచేస్తుందని నిర్థారించారు. ముఖ్యంగా రోమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే ఆయా రోగులకు చేసే కీమోథెరపీ మెరుగ్గా పనిచేసేలా ఈ పసుపులో ఉండే కర్కుమిన్‌ సహాయపడుతుందని చెబుతున్నారు. 

డిప్రెషన్‌ని నివారిస్తుంది..
పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తీవ్రమైన బాధ మెదడు మధ్య పరస్పర చర్యల కారణంగా మాంద్యంకి దారితీసి యాంటిడిప్రెసెంట్‌ థెరపీలకు స్పందిచలేని స్థితికి చేరుకునే విధంగా చేస్తుందని వెల్లడయ్యింది. అయితే పసుపులోని కర్కుమిన్‌ నిరాశను నిర్మూలించే శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. అందుకోసం 60 మంది రోగులపై అధ్యయనం చేయగా..వారంతా డిప్రెషన్‌ ప్రభావం నుంచి మెరుగుపడినట్లు తేలింది. ఇక్కడ వారికి డిప్రెషన్‌కి సంబంధించిన మందులతో తోపాటు వెయ్యి మిల్లిగ్రాముల చొప్పున పసుపుని కూడా అందించారు. అందువల్లే సత్ఫలితాలను పొందగలిగారనేది గ్రహించాలి. 

మెదడు ఆరోగ్యానికి మంచిది..
అల్జీమర్స్‌ వ్యాదిని నివారించడంలో పసుపు పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అందుకోసం పరిశోధకులు జంతువులపై జరిపిన అధ్యయనంలో తేలింది. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడినట్లు తెలిపారు. 

ఆర్థరైటిస్‌ సమస్యలను తగ్గిస్తుంది..
కీళ్ల వ్యాధులకు సంబంధించి 100 రకాలు ఉన్నాయి. ఇవన్నీ నొప్పి, వాపు, ధృఢత్వం, చలనశీలత కోల్పోవడం వంటి వాటికి దాతితీస్తాయి. పసుపు ఇలాంటి సమస్యలకు సమర్థవంతంగా చెక్‌పెడుతుంది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో రోజుకు మూడు సార్లు పసుపు సారం తీసుకుంటే..ఆర్థరైటిస్‌ లక్షణాలు తగ్గినట్లు గుర్తించారు. నొప్పులపై పసుపు చాల ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. 

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
దీన్ని రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పసుపు క్రమ రహిత హృదయస్పందనలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఆస్పిరిన్‌ మాదిరిగా పసుపు రక్తాన్ని పలుచబరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

వర్కౌట్‌ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది..
వ్యాయామాలు, పలు వర్కౌట్‌లు చేసేటప్పుడూ విపరీతమైన నొప్పులు వస్తాయి. వాటిని నివారించడంలో పసుపు బేషుగ్గా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు విపరీతమైన వర్కౌట్‌లు చేసే 59 మంది వ్యక్తులకు ఈ పసుపుని ఇవ్వగా ఎనిమిది వారాల తర్వాత వారిలో వ్యాయామం తర్వాత నొప్పులు తగ్గినట్లు తేలింది. 

ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను కంట్రోల్‌ చేస్తుంది..
ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (పీఎంఎస్‌) అనేది ఒక మృగంలా ప్రవర్తించడం లేదా విచక్షణ రహితంగా ప్రవర్తించడం. ముఖ్యంగా మహిళలు ఋతుస్రావం సమయంలో ఈ లక్షణాలు తలెత్తుతుంటాయి. అలాంటి వారికి ఋతుస్రావం వచ్చే ఏడు రోజుల ముందు, ఆ తర్వాత వరకు ఈ పసుపుని సప్లిమెంట్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వారిలో తీవ్ర కోపంతో ప్రవర్తించే లక్షణాలు కంట్రోల్‌ అయ్యినట్లు గుర్తించారు పరిశోధకులు. 

కొలస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది..
శరీరంలోని కొలస్ట్రాల్‌ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ప్రతిరోజూ 500 మిల్లిగ్రాముల మోతాదులో పసుపు తీసుకుంటే హెచ్‌డీఎల్‌ కొలస్ట్రాల్‌లో 33% పెరుగుదల, సీరం కొలస్ట్రాల్‌  దాదాపు 12% తగ్గినట్లు తేలింది. 

ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌ లక్షణాలను తగ్గిస్తుంది..
పెద్ద ప్రేగులను ప్రభావితం చేసే వ్యాధి. దీనికారణంగా కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వారికి ఈ పసుపు మాత్రలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి..
మైగ్రేన్‌ తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నిపుణుల సలహా మేరకు తగు మోతాదులో తీసుకంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు.

స్కిన్‌ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది..
మొటిమలు, మచ్చలను వంటి నివారిస్తుంది. చర్మ సంరక్షణలో పసుపు చాల కీలకపాత్ర పోషిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. 

బరువు అదుపులో ఉంటుంది..
బరువుని తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. నాన్‌వెజ్‌, అన్నం, కూరల్లో ఈ పసుపుని ఉయోగించడం వల్ల బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024: టీమ్‌ ఇండియా దుస్తులను డిజైన్‌ చేసేదేవరంటే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement