వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.
వేడి-నీరు అకాల వృద్ధాప్యం
వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.
నేచురల్ ఆయిల్స్‌కు నష్టం
వేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్‌ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి.
ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి.
ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.
కెమికల్స్‌తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్‌ను అస్సలు వాడకూడదు.
అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్‌ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది.
అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.
మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.
ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment