’రెండేళ్లు గడిచిన తర్వాత’ ఫరో ఒక కల కన్నాడని బైబిల్ చెబుతోంది (ఆది 41:1). కాలం సరస్సు లాగా నిలకడగా ఉండదు, ఒక నది లాగా అది సాగిపోతూనే ఉంటుంది. హెబ్రీయుల మూలపితరుల్లో ఒకరైన యాకోబు ముద్దుల కుమారుడు యోసేపు, ఈజిప్ట్ దేశంలో అకారణంగా, చెయ్యని నేరానికి గాను అన్యాయంగా జైల్లో గడిపిన ’ren-de’ గడిచిపోయాయంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కేవలం 17 ఏళ్ళ యువకుడుగా యోసేపు కన్న ఒక కల అతని భవిష్యత్తును ఒక భయంకరమైన ’పీడకల’గా మార్చేసింది. అతని 11 మంది సోదరులనూ అతడే ఏలుతాడన్న భావం వచ్చే ఆ కలను బట్టి, సోదరులు పగబట్టి అతన్ని ఈజిప్ట్ వర్తకులకు ఒక బానిసగా అమ్మేసి, అడవిలో క్రూర మగం దాడి చేసి అతన్ని చంపేసిందని తండ్రికి అబద్ధం చెప్పారు. ఈజిప్తులో పోతీఫెరనే ఈజిప్ట్ సైన్యాధిపతి అతన్ని బానిసగా కొనుక్కోగా తన తెలివితేటలు, దేవుని అపారమైన కృపతో అతని ఇల్లంతటిలో అతి ముఖ్యుడుగా యోసేపు ఎదిగాడు. కానీ తన నీతివంతమైన, భక్తిపూర్వకమైన ప్రవర్తనను బట్టి చెయ్యని నేరానికి రెండేళ్లు జైలువాసాన్ని అనుభవించాడు.
ఆ రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో కన్న ఒక కల భావాన్ని తెలిపేందుకు అతను జైలునుండి విడుదల పొంది వచ్చి ఫరో చక్రవర్తి ముందు నిలబడ్డాడు. రాబోయే ఏడేళ్లు ఈజిప్తులో పుష్కలంగా పంటలు పండుతాయని, ఆ తర్వాత ఏడేళ్లపాటు భయంకరమైన కరువు నెలకొంటుందని దేవుడు ఆ కల ద్వారా ముందుగానే వెల్లడించిన వాస్తవాల్ని యోసేపు ఫరోకు తెలిపాడు. పంటలు పుష్కలంగా పండినపుడు ఆ అదనపు పంటంతా జాగ్రత్తగా కోట్లలో దాచి కరువులో అనేక దేశాల వారికి దాన్నే అమ్మడం ద్వారా ఈజిప్ట్ దేశాన్ని ఒక గొప్ప సంపన్న ఆర్ధికవ్యవస్థగా మార్చుకోవచ్చంటూ యోసేపు సూచిస్తే, ‘యోసేపు దేవుని ఆత్మ, జ్ఞానవివేకాలున్నవాడు’ అని గ్రహించి తన రాజ్యంలో తన తర్వాత రెండవ స్థానానికి హెచ్చించి తన దేశాన్నంతా అతనికి అప్పగిస్తే, యోసేపు ఈజిప్తును ఆ తర్వాతి 14 ఏళ్లలో యోసేపు ఒక మహా సంపన్నమైన, శక్తివంతమైన దేశంగా మార్చాడు.
లోకపరమైన ప్రలోభాలు, శోధనలకు అతీతంగా దైవభక్తితో, గొప్ప విశ్వాసంతో సాగే విశ్వాసి జీవితంలో వచ్చే సమస్యలు, ఆటంకాలు కేవలం, అతని జీవితంలో దేవుని శాశ్వతమైన ప్రణాళికల నెరవేర్పును అవి ఎంతమాత్రమూ అడ్డుకోలేవని రుజువు చేసే బైబిల్ ఉదంతమిది. దేవుడేర్పర్చుకున్న వారి మీద లోకంలోని అసమర్థులు వాడే ఆయుధాలే అబద్ధాలు, అసూయ!! జీవితంలో శక్తికి మించిన సమస్యలెదురైనపుడు, అకారణంగా నలిగిపోతున్నపుడు, తన 17 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ దాకా యోసేపు తలవంచుకొని బతికాడు. దానికి పరిష్కారంగానే దేవుడు ఫరోకే ఒక కలననుగ్రహిస్తే, దాని భావం తెలిపే స్థాయికి ఒక్క సారిగా దేవుడు అతన్ని ఎంతటి అనూహ్యమైన, అత్యున్నతమైన స్థితికి హెచ్చించాడంటే, అతనిపట్ల అసూయతో, పగతో రగిలిపోయినవాళ్లంతా ఇపుడతణ్ణి తలెత్తి ఆకాశంలో చూడాల్సి వస్తోంది. జీవితంలో కొన్నిసార్లు చితికిపోయి, వెనకబడ్డప్పుడు కంగిపోవడం దేవుని సంకల్పం కానే కాదు.
దేవుడు మనల్ని హెచ్చించే సమయం దాకా ఆయన బలమైన బాహువు కింద మనం దీనమనస్కులమై బతకాలన్నదే ఆయన సంకల్పం(1 పేతురు 4:6). దేవునికి తలవంచి దీనంగా బతకడంలో ఉన్న ఆశీర్వాదం, మిడిసిపాటుతో తలెగరేస్తూ, తనకు తిరుగులేదన్నట్టుగా విశృంఖలంగా బతికే అహంకారికి, అసూయాపరుడికి, అసమర్ధుడికి మిన్నువిరిగి మీద పడేదాకా అర్థం కాదు. ఎంతో బలమైన ఇనుప స్తంభాన్ని కూడా తుప్పు తినేసినట్టు, మేధావులను, మహా మహులను కూడా ‘అసూయ’ బలహీనులను చేస్తుంది. అందుకే ప్రేమించడాన్ని మించిన విజయం లేదు, అసూయను మించిన శాపం, శిక్షా లేదు. యోసేపు జీవితం లో పీడకల లాంటి జైలువాసపు రెండేళ్లు గడిచిపోయినట్టే, కోవిడ్ 19 అనే మహమ్మారితో సాగిన గత ఏడాది కూడా గడిచిపోయింది. కొత్త ఏడాదిలో ప్రేమ, శాంతి, సంతృప్తి వంటి దైవిక ఈవులతో పదిమందికీ ప్రయోజనకరం గా బతుకుదాం, ఈ వినూత్న విలువలతో లోకాన్ని వెలుగుమయం చేద్దాం.
– రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment