Dasara holidays: తెలిసిన ఊరే. దసరా సెలవుల్లో కొత్తగా హుషారుగా అనిపిస్తుంది. మేనమామ కొడుకు మనం ఎప్పుడొస్తామా... ఊరంతా తిప్పి ఎప్పుడు చూపుదామా అని ఉంటాడు. మేనత్త కూతురి దగ్గర బోలెడన్ని బొమ్మలు. ఒకరోజు అందరూ కూడి బొమ్మల పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న ఊరే. కాని మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్లి మిఠాయి కొనుక్కోవడం... పాత సినిమా హాల్లో ఆడే పాత సినిమాను చూడటం... వీధిలోని కుర్రాళ్లను పిలవనవసరం లేకుండా మన బంధుగణంలోని పిల్లలే సరిపోయే విధంగా క్రికెట్ ఆడటం... సరే... ఓటీటీలో సినిమాలు చూడటం.
సెలవులొచ్చేది మనవాళ్లను కలవడానికి. కలిసి ఆటలు ఆడటానికి. పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి. పూర్వం దసరా కోసం పిల్లలు కాచుకుని కూచునేవారు. ఇవాళ రేపు సెలవులొచ్చినా మంచి ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ‘ఎక్కడికీ కదిలేది లేదని’ అదిలిస్తున్నారు. మరికొందరికి పిల్లల్ని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లడానికి తీరికే ఉండటం లేదు. కొందరికసలు బంధువులే లేరు. అంటే లేరని కాదు. ఉన్నా లేనట్టుగా వీరుంటారు. లేదా వారుంటారు. నడుమ అనుబంధాలు తెగేది పిల్లల మధ్య.
పెద్దయ్యాక జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కావు. జ్ఞాపకాలంటే బాల్యమే. బాల్యంలో ఇష్టంగా గడిపే రోజులు సెలవులు. పిన్ని ఇల్లు, పెద్దమ్మ ఊరు, బాబాయి మిద్దె, పెదనాన్న వాళ్ల తోట, తాతయ్య వాళ్ల చేను, సొంతపల్లెలోని చెరువు గట్టు... ఇవన్నీ కజిన్స్‌తో... దగ్గరి బంధువులతో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.
ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ ఈ బాల్యాన్నే చూపుతుంది. సత్యం అనే పేరుండే అరవింద స్వామి ఇంటికి సుందరం అనే కార్తీ చిన్నప్పుడు సెలవుల్లో వస్తాడు. ఆ సెలవుల్లో చిన్న అరవింద స్వామి, చిన్న కార్తీ కలిసి ఎన్నో ఆటలు ఆడతారు. సినిమాలు చూస్తారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఆ అభిమానమే కార్తీని పెద్దయ్యాక కూడా అరవింద స్వామి అంటే ప్రాణం ఇచ్చేలా చేస్తుంది. ప్రేమ పంచేలా చూస్తుంది.
చిన్నప్పుడు వీళ్లు ఆడుకున్న ఆట ఏమిటో తెలుసా? చిన్న అరవింద స్వామిని కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్తే పిల్లలనందరినీ తీసుకొని బయలుదేరుతాడు. ఒకడి పేరు బెండకాయ అని పెడతాడు. ఎన్ని కిలోల బెండకాయలు తేవాలో పట్టిక అవసరం లేకుండా ఆ బెండకాయ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకొకడి పేరు వంకాయ అని పెడతాడు. ఒకమ్మాయి పేరు కాకర. మరి కార్తీకి ఏం పేరు పెడతాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.
‘చిన్నప్పుడు ఎంత బాగుండేది’ అని ఏ కాలంలో అయినా పిల్లలు అనుకునేలా వారి ఆటపాటలు సాగేలా పెద్దలు చూడాలి. ఆ ఆట΄ాటలన్నీ అయినవాళ్లతో జరగాలి. దసరా సెలవులు బంగారు గనులు. ఆ గనుల్లోకి పిల్లల్ని పంపండి. మర్చిపోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment