జయము.. జయము.. మహారాణి! | Estonia is only country led by female PM and President | Sakshi
Sakshi News home page

జయము.. జయము.. మహారాణి!

Published Mon, Feb 1 2021 4:44 AM | Last Updated on Mon, Feb 1 2021 4:44 AM

Estonia is only country led by female PM and President - Sakshi

ఎస్టోనియా ప్రధాని కాజా కల్లాస్‌, అధ్యక్షురాలు కెర్‌స్తీ కల్‌జులైడ్‌

ప్రపంచంలో ఇద్దరూ మహిళలే ‘పెద్దలు’గా ఉన్న దేశంగా ఐరోపాలోని ఎస్టోనియా అవతరించింది.  అవును. ‘అవతరణ’ అనే అనాలి. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఏక కాలంలో ప్రధాని, ప్రెసిడెంట్‌ మహిళలుగా లేరు. ఈనెల 26 న 43 ఏళ్ల కాజా కల్లాస్‌ ఎస్టోనియా దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ దేశానికి ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపు వచ్చింది. అధ్యక్షురాలిగా కెర్‌స్తీ కల్‌జులైడ్‌ (51) అంతకుముందు నుంచే ఉన్నారు. వీళ్లిద్దరూ రాజకీయ నాయకులే అయినా, ప్రజలెన్నుకున్న మహారాణులు.

వైఫ్‌ క్యారీయింగ్‌ క్రీడకు ఎస్టోనియా ప్రసిద్ధి. భార్యల్ని వీపుౖÐð  మోస్తూ భర్తలు రన్నింగ్‌ రేస్‌ చేసే ఆట అది. ఇప్పుడు ఆ దేశ ప్రజల బాధ్యతల్ని మోస్తున్న ‘నాథులు’ ప్రధాని కాజా, అధ్యక్షురాలు కల్‌జులైడ్‌. ఏక కాలంలో దేశాధినేతలుగా ఇద్దరూ మహిళలే ఉండటం ప్రపంచంలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్, బార్బడోస్, డెన్మార్క్‌ దేశాలకు, గతంలో బ్రిటన్‌ వంటి మరి కొన్ని దేశాలకు ఏక కాలంలో మహిళా దేశాధినేతలు ఉన్నప్పటికి, ఆ దేశాల మహిళా ప్రధానులు మాత్రమే ప్రజల చేత ఎన్నికైనవారు. రెండోవారు వారసత్వంగా రాణులుగా ఉన్నవారు. అందుకే ఎస్టోనియాను ఇప్పుడు ప్రపంచంలోని ఏకైక మహిళా రాజ్యం అనడం.

పదిహేను మంది సభ్యులున్న ఎస్టోనియా కేబినెట్‌లో సగానికిపైగా మహిళలే మంత్రులుగా ఉండటం కూడా మరొక విశేషం. ఎస్టోనియాకు 1991లో స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశానికి ప్రధాని అయిన తొలి మహిళ కల్లాస్‌ అయితే, 2016 నుంచీ అధ్యక్షురాలిగా ఉన్నవారు కల్‌జులైడ్‌. ఈ ఏడాది సెప్టెంబరు తో ఆమె పదవీ కాలం ముగుస్తుంది. మళ్లీ కనుక ఎన్నికైతే మరో ఐదేళ్ల పాటు ‘మహిళా రాజ్యం’గా ఉంటుంది ఎస్టోనియా. ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకురాలిగా ఎన్నికైన కల్లాస్‌ చేత గత మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు కల్‌జులైడ్‌.

కల్లాస్‌ 2010 లో రాజకీయాల్లోకి వచ్చారు. ‘లా’ స్టూడెంట్‌గా దేశ రాజకీయాలను అధ్యయనం చేయడం రాజకీయాలపై ఆమెకు ఆసక్తిని కలుగజేసింది. ఎస్టోనియన్‌ రిఫార్మ్‌ పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగారు. ఎస్టోనియన్‌ భాషతో పాటు ఇంగ్లిష్, రష్యన్, ఫ్రెంచి భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ముగ్గురు పిల్లల తల్లి కల్లాస్‌.

ఇక అధ్యక్షురాలు కల్‌జులైడ్‌ 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. తొలినాళ్లలో  ‘ప్రోపాట్రియా యూనియన్‌ పార్టీ’లో ఉన్నారు. ప్రస్తుతం ‘సోషల్‌ డెమెక్రాటిక్‌ పార్టీ’ మద్దతుతో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కల్‌జులైడ్‌ ఎం.బి.ఎ. చదివారు. బిజినెస్‌ను కెరీర్‌ గా ఎంచుకుని కొన్నాళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కల్లాస్‌ లానే బహుభాషా ప్రవీణురాలు. నలుగురు పిల్లల తల్లి. ఇప్పుడీ ‘మహరాణులు’ ఇద్దరూ ప్రజల్ని తమ పిల్లలుగా పాలించబోతున్నారనే అనుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement