ఉత్తరాల ‘లంకె’బిందెలు | Famous Bollywood Film Stars Replied For Meharunnisa Najma Letters | Sakshi
Sakshi News home page

ఉత్తరాల ‘లంకె’బిందెలు

Published Sun, Feb 28 2021 11:17 PM | Last Updated on Mon, Mar 1 2021 2:35 AM

Famous Bollywood Film Stars Replied For Meharunnisa Najma Letters - Sakshi

ఇంట్లో పెద్దవాళ్లు, ‘అప్పటి రోజులే వేరు. మళ్లీ రావు, బంగారం లాంటి రోజులు’ అని తరచు అంటే వినటం అందరికీ అనుభవమే. నిజమే. ఆ రోజులు అలాంటివే మరి. మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్‌ మీడియా, ఆధునిక గ్యాడ్జెట్లు, సకల సదుపాయాలు... జీవితాన్ని సులభం చేసుకునే సాధనాలేవీ లేని రోజులు. ఉత్తరాల ద్వారా మాత్రమే క్షేమసమాచారాలు అందుకున్న రోజులు. ముఖ్యంగా సినీ నటులు అభిమానులు రాసిన ఉత్తరాలకు వారి సంతకం తో ఉన్న ఫొటోలు పోస్టులో పంపిన రోజులు. అటువంటి ఒక చిన్న సంఘటన ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది. అది చూసిన విదేశీయులు, భారతీయులకు పాత జ్ఞాపకాలంటే అభిమానమే అనుకుంటున్నారు. ఎఎల్‌టి అనే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ వెబ్‌సైట్‌ కోఫౌండర్‌గా పని చేస్తున్నారు శామ్‌జావేద్‌. పదిహేను సంవత్సరాల క్రితం కన్నుమూసిన తన ఆంటీకి సంబంధించిన చిన్న అంశాన్ని ట్విటర్‌లో ఉంచారు శామ్‌. ఈ ట్వీట్‌ వారం రోజులుగా ట్రెండింగ్‌ అవుతోంది. 

అసలు కథ...
మెహరున్నీసా నజ్మా పదిహేను సంవత్సరాల క్రితం అంటే 2006లో కన్నుమూశాక, ఆవిడకు సంబంధించిన కొన్ని వస్తువులను మేనకోడలు శామ్‌జావేద్ భద్రపరిచారు. ఇటీవలే అక్కడ ఉన్న సామానులను బయటకు తీస్తుంటే అందులో ఒక ఆల్బమ్‌ కనిపించింది. ఆ ఆల్బమ్‌ ను చాలా ఆసక్తితో పరిశీలించారు శామ్‌. అందులో ప్రముఖ సినీతారల స్వదస్తూరితో ఉన్న ఉత్తరాలు శామ్‌ను ఆకర్షించాయి. ఒకసారి తన మేనత్తను జ్ఞాపకం చేసుకున్నారు శామ్‌.


శామ్‌జావేద్

సినిమాలంటే ఇష్టం...
నజ్మాకు భారతీయ చిత్రాలంటే ప్రాణం. సినిమాలు చూసి ఊరుకోకుండా, ఆ తారలకు ఉత్తరాలు రాసేవారు. ఇది తల్లికి నచ్చేది కాదు. అయినా నజ్మా ఎవ్వరికీ తెలియకుండా ఉత్తరాలు రాస్తూ. తనకు వచ్చిన సమాధానాలను భద్రంగా ఆల్బమ్‌లో భద్రపరిచారు. ఆల్బమ్‌ అంతా సినిమా తారలు తమ సంతకాలతో ఆమె ఉత్తరాలకు రాసిన సమాధానాలతో నిండిపోయింది. ఎల్విస్‌ ప్రెస్లీ ఆఫ్‌ ఇండియాగా పేరు తెచ్చుకున్న షమ్మీ కపూర్‌ ఇంగ్లీషులో, ‘‘మీరు నా అభిమాని అని తెలిసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఉత్తరం రాశారు. ధర్మేంద్ర, సునీల్‌ దత్త్‌.. చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది నజ్మాకు ఉత్తరాలు రాశారు. అప్పట్లో పెద్ద పెద్ద తారలైన కామినీ కౌశల్, సాధన, ఆశాపరేఖ్, సైరాబాను, తబస్సుమ్, సురయ్యా, రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్‌... లెక్కలేనంతమంది.

ఇంతమంది నుంచి ఉత్తరాలు అందుకున్న నజ్మా జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంది. నజ్మా 1930 లో ఢిల్లీలో పుట్టారు. తండ్రి పంజాబీ, తల్లిది బర్మా. నజ్మాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నజ్మా చిన్నతనంలోనే తండ్రి కన్నుమూయటంతో, మేనత్త ఈ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. తమ్ముడు, చెల్లాయి.. పెరిగి పెద్దయ్యాక, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో పై చదువులు చదువుకున్నారు. నజ్మాకు చదువు మీద ఆసక్తి లేదు. సినిమాలంటేనే ఇష్టం. సిలోన్‌ రేడియోలో పాటలు వినేవారు. తన అభిమాన నటులకి ఉత్తరాలు రాసేవారు. 20 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇలాగే గడిపారు నజ్మా.

ఆ తరవాత వివాహం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరాలు రాయటం ఆపేసి ఉంటారంటారు. నజ్మాకి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకే ఆమె భర్త గతించారు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నజ్మాకు పిల్లలు లేరు. చెల్లెళ్లు, తమ్ముడి పిల్లలతో చాలా చనువుగా ఉండేవారు. తనకు ఇష్టమైన సినిమాలను జీవితాంతం హాయిగా చూశారు నజ్మా. ‘‘మా ఆంటీ చాలా అందంగా ఉండేవారు. సినిమాల మీద, సినీ తారలకు ఉత్తరాలు రాయటం మీద ఆవిడకున్న అభిమానం అప్పట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు నా ట్వీట్‌ చూసి అందరూ మా ఆంటీని ప్రశంసిస్తున్నారు. నా దగ్గర లంకెబిందెల్లాంటి చాలా విలువైన సంపద ఉంది అంటున్నారు’’ అంటూ ట్వీట్‌  చేశారు శామ్‌జావేద్‌.

పాత బంగారం కోసం...
ఇప్పుడు బాలీవుడ్‌ తారలంతా ఆ ఉత్తరాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రియాంక చోప్రా జొనాస్‌.. ఈ ఉత్తరాలను ట్వీట్‌ చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘ఇవి చాలా ప్రత్యేకమైన ఉత్తరాలు. అన్ని ఉత్తరాలు నా మనసును హత్తుకున్నాయి. వీటిని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు’ అన్నారు ప్రియాంక. ఇవి ట్విటర్‌లో బాగా వైరల్‌ కావటంతో, నేషనల్‌ ఫిల్మ్‌ అర్కైవ్‌ వారు నజ్మా ఉత్తరాలను సేకరించి భద్రపరచాలనుకుంటున్నారు. సరదా గా దాచుకున్న ఉత్తరాలకు ఇప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని ఆ రోజు నజ్మా ఊహించి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉత్తరాలు ఒకరినొకరు కలిపే ‘లంకె’బిందె ల్లాంటివేనంటూ వీటిని విలువైనవిగా గుర్తిస్తోంది సినీ పరిశ్రమ.

సునీల్‌ దత్త్‌ ఒకటో రెండో వాక్యాలు కాదు, స్వదస్తూరితో పెద్ద ఉత్తరమే రాశారు. ‘ఆ ఉత్తరం చూస్తుంటే ఆయన బహుశ మా అత్తయ్యను చిన్న అమ్మాయి అనుకుని ఉంటారనిపిస్తుంది. ఆయన ఎంతో జాగ్రత్తగా సిస్టర్‌ అని సంబోధిస్తూ ఉత్తరం రాశారు. అది కూడా ఒకసారి కాదు, పదేపదే అదే పదం ఉపయోగించారు’’ అంటారు శామ్‌జావేద్‌. ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాసిన ఉర్దూ ఉత్తరం అది. ధర్మేంద్ర కూడా స్వదస్తూరితో హిందీలో రాశారు. ఆ ఉత్తరం చదివితే, నజ్మా... ధర్మేంద్ర పుట్టినరోజుకి రాసిన ఉత్తరానికి సమాధానమని అర్థం అవుతుంది. ‘‘నా పుట్టినరోజుకి మీరు పంపిన శుభాకాంక్షలు అందుకున్నాను. మీ ఉత్తరం చూసిన నా హృదయం ఎంతో సంతోషంతో నాట్యం చేసింది. నా ఆటోగ్రాఫ్‌తో ఉన్న నా ఫొటో మీకు పంపుతున్నాను, మీకు నా అభినందనలు’’ అంటూ ధర్మేంద్ర జవాబు రాశారు. ఈ సమాధానం చదివిన నజ్మా ఆంటీ మనసు ఎలా ఉండి ఉంటుందో చెప్పక్కర్లేదు’ అంటారు శామ్‌జావేద్‌. తబస్సుమ్‌ రాసిన ఉత్తరాలు చూస్తే, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement