‘ఆకలిగొన్న సింహంలా ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నా’... సెమీస్‌లో విజయం తర్వాత అమిత్ పంఘాల్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య ఇది. ఒక బాక్సర్‌కు ఉండే సహజసిద్ధమైన దూకుడు అతని మాటల్లో కనిపించింది. తన స్వల్ప కెరీర్‌లోనే అతను ఇదే తరహా దూకుడు ప్రదర్శించి పతకాలు కొల్లగొట్టాడు. అయితే 2012లో అతని కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఒక టోర్నీ సమయంలో అనబాలిక్ స్టెరాయిడ్ వాడినందుకు అతనిపై రెండేళ్ల నిషేధం పడింది. చికెన్‌పాక్స్ రావడంతో సరైన సమాచారం లేకుం డా మందులు వాడటమే ఇందుకు కారణమంటూ అతను అప్పీల్ చేశాడు. దాంతో శిక్ష ఏడాది కాలానికి తగ్గినా... అంత తొందరగా ఆ మరక పోలేదు. గత ఏడాది అర్జున అవార్డులకు అతని పేరు నామినేట్ చేసిన సమయంలో కూడా ఇదే వివాదం ముందుకొచ్చి అవార్డును దూరం చేసింది.
అయితే నిషేధం తొలగిన అనంతరం పట్టుదలతో శ్రమించిన అమిత్ తన సత్తాను ప్రదర్శిస్తూ సాధించిన విజయాలు మాత్రం ప్రశంసార్హం. హరియాణా రాష్ట్రంలోని రోహ్‌టక్ సమీపంలోని మాయనా అమిత్ స్వస్థలం. రోహ్‌టక్ పరిసర గ్రామాల్లో భారీగా డ్రగ్ కేసులు నమోదవుతున్నా... సున్నా క్రైమ్ రేటింగ్ ఉన్న గ్రామం ఇది. తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆటల్లోనైనా బిజీగా ఉంచాలనేది అక్కడి చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన. అన్న ప్రోత్సాహంతో పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్ వైపు అడుగులు వేసిన అమిత్ 2009 నుంచి 2016 వరకు సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలలో విశేషంగా రాణించి పలు విజయాలు నమోదు చేశాడు. ఆ తర్వాత సీనియర్ స్థాయిలో అతని బాక్సింగ్ కెరీర్ చాలా జోరు గా దూసుకుపోయింది.
2017లో జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అతను రెండేళ్ల వ్యవధిలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణానికి చేరువ కావడం విశేషం. 2017 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అమిత్ ఆ తర్వాత వరుసగా పతకాలు సాధించి తన స్థాయిని పెంచుకున్నాడు. జాట్‌ల కుటుంబం నుంచి వచ్చిన అమిత్‌కు చాలా మందిలాగే హిందీ అగ్రశ్రేణి హీరో ధర్మేంద్ర కుటుంబం అంటే అమితాభిమానం. గత ఏడాది కామన్వెల్త్‌లో పతకం నెగ్గిన తర్వాత తన తొలి ట్వీట్‌లోనే అతను నాన్న, కోచ్‌లను గుర్తు చేసుకుంటూ ధర్మేంద్రను కలవాలని ఉందంటూ రాశాడు. అతని అభిమానానికి స్పందిస్తూ ఆ తర్వాత అమిత్‌కు కలిసే అవకాశం ఇచి్చన ధర్మేంద్ర... అప్పటి నుంచి ప్రతీసారి అతడిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు కూడా తన వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానికి సంబంధించి ట్వీట్‌లో కూడా ధర్మేంద్ర, సన్నీ డియోల్‌లను అమిత్ ట్యాగ్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment