కలల రోజు కళ్ల ముందు నిలిచే సమయం అత్యంత వైభవంగా మారిపోవాలనుకుంటారు. అందుకు తగినట్టుగానే ప్రతి అలంకరణలోనూ ప్రత్యేకత చూపుతారు. ఆ పెళ్లి కళకు పరిపూర్ణత రావాలంటే మాత్రం కేశాలంకరణదే అత్యంత కీలకమైన పాత్ర. సాధారణ డిజైన్స్ నుంచి ఆధునికపు హెయిర్ స్టైల్స్ ఎలా రూపు మార్చుకున్నాయో తెలుసుకుంటే మీదైన ప్రత్యేకమైన రోజుకు మరింత అందంగా ముస్తాబు అవ్వచ్చు.
పెళ్లికూతురు ఆకర్షణీయ రూపానికి జీవం పోసేది కేశాలంకరణే. పెళ్లి దుస్తులను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటారో జడను కూడా అంతే స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటారు. సాధారణ పూల జడల నుంచి వజ్రాలతోనూ, బంగారంతోనూ మెరిసే అందమైన పొడవాటి జడలను నవ వధువుల ఎంపికలో ఉంటాయి.
అలాగే, పెళ్లికూతురి దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా వీటి ఎంపికలో పోటీ పడుతుంటారు. ఇందుకు ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు ఇతర ఫ్యాన్సీ జడలు కూడా రకరకాల డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. లక్షల రూపాయల నుంచి వందల రూపాయల వరకు ఉన్న ఈ డిజైన్స్‌లో ఇవి కొన్ని.
సంప్రదాయ వేడుకలలో వేసే హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంటాయి. ఈ బ్రైడల్ హెయిర్ స్టైల్స్‌లో మార్పులు చూస్తే ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకోసం ఉపయోగిస్తున్న లాంగ్ రిబ్బన్, మిర్రర్, టాజిల్స్‌తోనూ జడలు ప్రధాన ఆకర్షణగా డిజైనర్ల చేతుల్లో రూపు దిద్దుకుంటున్నాయి.
సొంతంగా తయారీ
ఆసక్తి గల వారు పూసలు, ముత్యాలు, స్టోన్స్, రంగు దారాలను ఉపయోగించి మల్టీకలర్ లాంగ్ జడలను సొంతంగా తయారు చేసుకోవచ్చు. దారాలకు పూసలు గుచ్చి, గమ్‌తో స్టోన్స్ లేదా అద్దాలను అతికించి పొడవాటి దండలుగా (జడ అంత పొడవులో) తయారు చేసుకోవాలి. వాటిని డ్రెస్‌తో మ్యాచ్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఎలాంటి అలంకరణ బాగుంటుందో చూసుకొని, ఆ జడను అలంకరించుకోవాలి.
ఫ్యాన్సీ అలంకరణ
సాధారణ కేశాలంకరణలో మల్లె, గులాబీ పూల జడలు పెళ్లికూతురు అలంకరణలో భాగంగా ఉంటాయి. కొందరు తమ చీర రంగుతో మ్యాచ్ అయ్యే పూల జడలను ఎంపిక చేసుకుంటారు. ఇవే కాకుండా స్వరోస్కి స్టోన్స్ ఉన్న పొడవాటి వరుసల క్లిప్స్‌ను పెట్టేసి కేశాలంకరణ పూర్తి చేసుకోవచ్చు.
ఇవి, రిసెప్షన్ వంటి వేడుకల్లో అందంగా ఉంటాయి. పెళ్లికి ఎంచుకోగల ఆధునిక కేశాలంకరణలో ఇవి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డిజైన్ బట్టి ఈ జడల ధరలు అందుబాటులో ఉన్నాయి.
మెరిసే.. మెరిసే
కేశాలంకరణ ప్రత్యేక సందర్భాల్లోనే కాదు ప్రతిరోజూ స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారికి డే హెయిర్ జ్యువెలరీ (హెయిర్ క్లిప్స్) అందుబాటులో ఉన్నాయి. వీటిని గెట్ టు గెదర్ వంటి పార్టీలకు వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సులకూ అందంగా నప్పుతాయి.
పెళ్లి కూతురి లేదా అతిథుల తమ కేశాలంకరణలో వివిధ స్టైల్స్‌ను అనుకరించాలంటే అందుకు తగిన ఆన్‌లైన్ ట్యుటోరియల్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి ఎలాంటి స్టైల్ బాగుంటుందో ఎంపిక చేసుకునే వీలుంటుంది.
మీదైన గొప్ప రోజు కోసం మీ జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల పెళ్లికి వచ్చే మొత్తం అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తుంది. పెళ్లిరోజును మరింతగా వెలిగిపోయేలా మార్చేస్తుంది.
చదవండి: Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో..
Comments
Please login to add a commentAdd a comment