మెంతి ఆకులు, గింజలు వంటింటి నేస్తాలని మనకు తెలిసిందే! కుండీల్లో పెరిగే ఆకులు కూరకు రుచినిస్తాయి. జీలకర్రతో దోస్తీ చేసే మెంతులు. ఘుమఘుమలతో మదిని దోచేస్తాయి. ఆరోగ్యప్రదాయినిగా పేరొందిన మెంతి. వేపుడుకైనా, గ్రేవీకైనా రెడీ అంటూ ముందుంటుంది. వెజ్, నాన్‌వెజ్ వంటకాలకు ఇంత అనేది లేకుండా
ఎంతెంత మెంతి వేస్తే అంతంత రుచిని జత చేరుస్తుంది.
ఖీమా సోయా మెంతి
కావలసినవి: నూనె – పావు కప్పు; ఉల్లిపాయ – 2 (మీడియం సైజువి); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్లు; ఖీమా– పావు కేజీ; జీలకర్ర – టీ స్పూన్ (వేయించి, పొడి చేయాలి); ఎర్ర మిరపకాయలు – 2; పసుపు పొడి – పావు టీస్పూన్; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – 8–10; యాలకులు – 2; లవంగాలు – 4; సోంపు – అర టీ స్పూన్; టమోటా – 1 (సన్నగా తరగాలి); నీళ్లు – కప్పు; మెంతి ఆకులు – అర కప్పు; సోయా – పావు కప్పు; జావత్రి, జాజికాయ పొడులు – చిటికెడు; పచ్చిమిర్చి – 3; కొత్తిమీర – తగినంత.
తయారీ: ∙బాణలిలో నూనె, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ∙అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ∙పచ్చిమిర్చి వేగాక, ఖీమా వేసి, రంగు మారే వరకు బాగా వేయించాలి. 8–10 నిమిషాలు లేదా నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ∙నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, సోంపు వేసి కలపాలి. ∙టొమాటోలు వేసి 2–3 నిమిషాలు ఉడికించాలి. ∙టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. దీంట్లో సోయా వేసి, మూత పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. ∙మెంతి ఆకులు, మెంతులు వేసి బాగా కలపాలి. ∙నూనె విడిపోయే వరకు మూతపెట్టి, తక్కువ మంటపై ఉడికించాలి. ∙జాపత్రి, జాజికాయ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ∙కొత్తిమీర తరుగు వేసి, మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచి, తర్వాత సర్వ్ చేయాలి.
మెంతి ఫిష్ కర్రీ
కావలసినవి: చేప ముక్కలు – 4; తాజా మెంతి ఆకులు – 4 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు – అర కప్పు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పెద్ద టమోటా – 1 (సన్నగా తరగాలి); కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్.
తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పురాసి, రుద్ది, పక్కన పెట్టి, ఓ ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, మెంతులు వేసి ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అప్పుడు నూనె నుండి గింజలను బయటకు తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి, వేయించాలి. ∙అల్లం– వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, మిశ్రమం సాస్ లాగా మారే వరకు ఉడికించాలి. తర్వాత మెంతి ఆకులను వేసి, కలపాలి. ∙ చేప ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీరు (కావాలనుకుంటే) వేసి నెమ్మదిగా మంట మీద ఉడికించాలి. ∙వడ్డించే ముందు కొంచెం నిమ్మరసం పిండాలి.
మెంతి కార్న్ మలాయ్
కావలసినవి: మెంతి ఆకులు – 2 కప్పులు; మొక్కజొన్న గింజలు – అర కప్పు; టొమాటోలు – 4; జీడిపప్పు – 15; పాలు – కప్పు; క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; పంచదార – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వంట నూనె – 2 టేబుల్ స్పూన్లు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు.
తయారీ: ∙ఒక గిన్నెలో మెంతి ఆకులు, టీ స్పూన్ స్పూన్ ఉప్పు వేసి, మూతపెట్టి, 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ∙తర్వాత మెంతి ఆకులను మంచినీటితో బాగా కడగాలి.∙మొక్కజొన్న గింజలను ప్రెషర్ కుకర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, పక్కన పెట్టుకోవాలి. ∙జీడిపప్పును తరిగి 3 టేబుల్‌స్పూన్ల పాలలో 15 నిమిషాలు నానబెట్టాలి.∙నానబెట్టిన జీడిపప్పును గ్రైండ్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ∙తరిగిన టొమాటోను ప్రెజర్ కుకర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నీళ్లు కలపద్దు. ∙బాణలిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, యాలకుల పొడిని కలపాలి. ∙ ఇప్పుడు తరిగిన మెంతి ఆకులు వేసి, నిమిషం సేపు వేయించాలి. ∙ఇప్పుడు టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ∙టొమాటో, మసాలా నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి నిమిషం సేపు ఉడికించాలి. ∙దీంట్లో క్రీమ్ కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద నిమిషం సేపు ఉడికించాలి. ∙ఈ మలాయ్ కర్రీని నాన్ లేదా రోటీ లేదా పరాఠాతో వేడి వేడిగా వడ్డించాలి.
ఓట్స్ మెంతి
కావలసినవి: ఓట్స్ – ముప్పావు కప్పు (గ్రైండ్ చేసి, పక్కనుంచాలి); మెంతి ఆకులు – 2 కప్పులు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; కారం – ఒకటిన్నర టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; నువ్వులు – అర టీ స్పూన్.
తయారీ: ∙ఒక పాత్రలో ఓట్స్, మెంతి ఆకులు, రవ్వ, పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి, బాగా కలపాలి. ∙కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, ఒత్తి పక్కనుంచాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న ముట్టీలను నూనె వేసి లేదా వేయకుండానే వేయించుకోవాలి. ∙విడిగా ఒక మూకుడును స్టౌ మీద పెట్టి వేడయ్యాక రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో ఆవాలు, నువ్వులు వేసి చిటపటలాడాక వేయించిన ముట్టీలను వేసి, మరోసారి వేయించాలి. వీటిని వేడి వేడిగా ఏదైనా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment