పాజిటివ్.. నెగటివ్‌గా వినిపిస్తున్న వేళ
‘పాజిటివ్’ అన్నది ఇప్పుడు ఓ శాపంలా వినపడుతోంది. దీని మీద ఎన్ని హాస్యోక్తులో. ఠాగూర్ సినిమాలోని ‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట ‘క్షమించడం’ అనే డైలాగ్‌కు పేరడీగా ‘ఇంగ్లిష్‌లో ఇప్పుడు నాకు నచ్చని ఒకే ఒక్క మాట పాజిటివ్’ అనేది పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ నటుడు నానాపటేకార్ ఫొటోను వాడుకుంటూ ‘ఏక్ ఖూబ్‌సూరత్ వర్డ్ థా పాజిటివ్.. వో భీ బద్‌నామ్ హో గయా (‘పాజిటివ్’ అనే చక్కటి పదం కూడా ఇప్పుడు నెగటివ్ కీర్తిని మూటగట్టుకుంటోంది)’ అంటూ కరోనా మీద వచ్చిన వ్యంగ్యోక్తి నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఎవరినీ ‘బీ పాజిటివ్’ అని విష్ చేసే పరిస్థితి లేదు.
వర్క్ ఫ్రమ్ హోమ్..
కరోనా క్రియేటివిటీకి అర్హతపొందని సందర్భం లేదు. ఈ చిట్టాలో వర్క్‌ఫ్రమ్ హోమ్ ఫస్ట్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని జొమాటో, స్విగ్గి వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రకటనలనూ తయారు చేశాయి. మీమ్స్, జోక్స్‌కైతే చెప్పే పనేలేదు. వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్లు ఆన్‌లైన్ మీటింగ్‌లో కెమెరాలో కనిపించేంత మేరకే ఫార్మల్స్ (ఆఫీస్ వేర్)లో అప్పియర్ అవుతూండడంపై బోలెడు హాస్యోక్తులు పుట్టాయి. కింద అండర్‌వేర్ మీద మాత్రమే ఉండి పైన సూట్, టైతో ‘వర్క్‌ఫ్రమ్ హోమ్ ఫ్యాషన్ కలెక్షన్స్ ఫర్ మెన్’ వంటి వైరల్ పోస్ట్‌లు వాట్సప్ అకౌంట్లున్న అందరూ చూసే ఉంటారు.
ఇలవేలుపు
కరోనా వచ్చినప్పటి నుంచి పనిమనుషులు ఇంటి ఇలవేల్పులే అయ్యారు. ఈ సిట్యుయేషన్ మీద వచ్చిన స్పూఫ్స్‌కి లెక్కేలేదు. వీటికి టీవీ సీరియల్స్ ఆధారం. ఇంటి కోడలు దేవుడి గదిలో విగ్రహం ముందు నిలబడి హారతి ఇస్తూ ఉంటుంది. డోర్ బెల్ మోగుతుంది. అది గుడిగంటలా ప్రతిధ్వనిస్తుంది. ఆ చప్పుడికి ఇంట్లో వాళ్లందరి కళ్లల్లో మెరుపు.. మొహంలో సంతోషం.. ఒక్కొక్కరిగా అందరూ ‘ఆగయీ (వచ్చింది)’ అంటూంటారు. దేవుడికి హారతి ఇస్తున్న కోడలు కూడా ఒక్కసారిగా అప్రతిభురాలవుతుంది... దేవుడే ప్రత్యక్షమైనంతగా. హారతి పళ్లెం పట్టుకునే స్లో మోషన్‌లో ఇంటి ప్రధాన ముఖ ద్వారం వైపు వస్తూంటుంది. కొన్ని సెకన్ల ఆ స్లోమోషన్ తర్వాత తలుపు తీస్తుంది.. ఎదురుగా నిలబడ్డ పనిమనిషిని దేవతే తమ ఇంటికి దయతలిచినంత సంభ్రమాశ్చర్యాలతో లోపలికి ఆహ్వానిస్తుంది ఆ కోడలు హారతితో. ఇంకా ఇలాంటివెన్నో .
ప్లవనామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం అది..
కరోనా ఎఫెక్ట్ జాతకం అది. అవతల ఆ వైరస్ గడగడలాడిస్తుంటే దాంతో జోకులేంటి? అని ముక్కుపుటాలు అదిరిస్తున్నా మాస్క్ ఆ కోపాన్ని కప్పేస్తుంది. చలికాలంలో ఐస్‌క్రీమ్ తినడం ఎంత హీరోయిజమో..నవ్వుతో దిగులును దిగమింగడమూ అంతే సాహసోపేతం. నరనరానా కరోనా భయం నిండి ఉన్న నేపథ్యంలో మనసును కాస్త ఉల్లాస పరిచి జీవితం మీద ఆసక్తిని పెంచడానికే ఈ ప్రయత్నం. ఇప్పుడు తిట్టుకున్నా సబ్జెక్ట్ కరోనానే.. జోకులేసుకున్నా ఆబ్జెక్ట్ కరోనానే. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ డిసీజ్ మీద వచ్చినన్ని జోక్స్, మీమ్స్ రాజకీయ వివాదాలు, ఆర్థిక కుంభకోణాలు మొదలు ప్రపంచంలోని ఇంకే పరిణామాల మీదా వచ్చి ఉండవు. కరోనా నివారణ మీద దృష్టి పెడుతూనే దాన్నల్లుకున్న హాస్యాన్నీ మనసుకు పట్టించుకోండి.
Comments
Please login to add a commentAdd a comment