Harago Founder The Instinctive Fashion Designer Harsh Agarwal Success Story In Telugu - Sakshi
Sakshi News home page

Harago Harsh Agarwal Success Story: స్టార్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌.. ఈయన బ్రాండ్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్‌

Published Fri, Jul 14 2023 12:40 AM | Last Updated on Fri, Jul 14 2023 4:42 PM

Harago founder Harsh Agarwal success story - Sakshi

ఫ్యాషన్‌ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ హర్ష్‌ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్‌ అగర్వాల్‌ ‘హరగో హ్యాండ్‌ ఎంబ్రాయిడ్‌ షర్ట్స్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు....

రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్‌ అగర్వాల్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌కు నోటిఫికేషన్‌ల వరద మొదలైంది. పాపులర్‌ ఇంగ్లిష్‌ సింగర్‌ హారీ స్టైల్స్‌ ‘హరగో హ్యాండ్‌ ఎంబ్రాయిడ్‌ షర్ట్స్‌’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.
‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్‌ చేయించేవాడు హర్ష్‌.

‘ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌’లో పట్టా పుచ్చుకున్న హర్ష్‌ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌’ ఇంటర్న్‌షిప్‌ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్‌’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్‌ డిజైనర్‌లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. 

ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్‌ నుంచి గుజరాత్‌ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్‌’ అనే మెన్స్‌వేర్‌ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్‌లు, జూనియర్‌ డిజైనర్‌లు, ప్రొడక్షన్‌ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు.

‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్‌ అగర్వాల్‌. ఒక డిజైన్‌ హిట్‌ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్‌లపై వర్క్‌ చేస్తుంటాడు హర్ష్‌. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్‌ రూపొందిస్తాడు.

105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్‌ కోసం సోషల్‌ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్‌ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్‌ కోసం ఇంటర్నేషనల్‌ బయర్స్‌ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్‌ క్లాతింగ్‌ రిటైలర్‌లలో మ్యాచెస్‌ ష్యాషన్‌–లండన్, సెసెన్స్‌(మాంట్రియల్‌), ఎల్‌ఎమ్‌డీఎస్‌–షాంఘై, బాయ్‌హుడ్‌–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్‌ పాయింట్‌గా మారింది.

బ్రాండ్‌ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్‌ హోస్ట్, ఫ్యాషన్‌ డిజైనర్‌ టాన్‌ ఫ్రాన్స్‌ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్‌ బ్రాండ్‌ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్‌ షో కోసం అతడు డిజైన్‌ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్‌ ఫ్రాన్స్‌. హర్ష్‌ కొత్త కలెక్షన్‌ డిజైన్‌ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్‌ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్‌ లుక్‌ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్‌టైల్‌ ఇనోవేషన్‌ ప్రాజెక్ట్‌ ‘అంబ’ ఫౌండర్‌ హేమ ష్రాఫ్‌ పటేల్‌.                                 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement