Health Tips In Telugu: Best Sitting Postures To Reduce Back Pain - Sakshi
Sakshi News home page

Sitting Postures For Back Pain: ఇష్టం వచ్చినట్లు కూర్చుంటా.. ఏముందిలే అంటే కుదరదు..!

Published Sun, Dec 26 2021 10:03 AM | Last Updated on Sun, Dec 26 2021 11:04 AM

Health Tips: Best Sitting Postures Avoid Back Pain - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Best Sitting Postures: ‘సిట్‌ రైట్‌... సిట్‌ ప్రాపర్లీ’ ఈ మాటలు వినని బాల్యం ఉండదు. ఈ మాటలు అనిపించుకోకుండా స్కూలు జీవితం గడిచిన వాళ్లెవరూ ఉండకపోవచ్చు. తెలుగు మీడియం ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్లకు వచ్చే తొలి ఇంగ్లిష్‌ పదం కూడా బహుశా ఇదే కావచ్చు. స్కూల్లో టీచరు చేత, ఇంట్లో అమ్మానాన్నల చేత ఎన్నిసార్లు చెప్పించుకున్నప్పటికీ తీరుగా ఒంటపట్టని లక్షణం కూడా ఇదే.

తీరుగా కూర్చోవడం చేతకాక చేతులారా తెచ్చుకునే అనారోగ్యాలెన్నో. తీరుగా కూర్చోవడం చేతకాక అనడం కంటే ‘తీరుగా కూర్చోవడం పట్ల శ్రద్ధ లేక’ అనడమే కరెక్ట్‌. ఇప్పుడు ఎక్కువ భాగం వృత్తిఉద్యోగాలు గంటలసేపు ఒకే పట్టున కూర్చుని పని చేసేవే అయి ఉంటున్నాయి. అందుకే చేసే పనిలో కచ్చితత్వం కోసం పాటుపడినట్లే కూర్చునే భంగిమ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. 

ఇలా చేద్దాం!
కుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్‌ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్‌ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్‌ అమర్చుకోవడం మంచిది. అదీ కాక పోతే మెయిన్‌ ఫొటోలో ఉన్నట్లు చిన్న టవల్‌ను రోల్‌ చేసి వెన్నుకు ఆసరాగా అమర్చుకోవాలి. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి.

అరగంట, ఒక గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్‌ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్‌. ∙ఎక్కువ గంటలు కూర్చుని పని చేసే వాళ్లు అబ్డామినల్‌ స్ట్రెంగ్త్‌ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్‌సైజ్‌ చేయాలి. ఇందుకోసం ఒక ఫొటోలో చూపించిన పెద్ద బాల్‌ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి.

ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవ సారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడి చేత్తో చేయాలి. ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి.

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఆన్‌లైన్‌ క్లాసుల రూపంలో ఆఫీసు, స్కూలు ఇంటికే వచ్చేశాయి. కిచెన్‌ ప్లాట్‌ఫామ్, డైనింగ్‌ టేబుల్, డ్రాయింగ్‌ రూమ్‌లోని సెంటర్‌ టేబుల్, బెడ్‌రూమ్‌లోని ఫోమ్‌ బెడ్‌ కూడా వర్క్‌ప్లేస్‌లుగా మారిపోయాయి. ఫలితంగా కూర్చునే భంగిమలు మారిపోయాయి.

బ్యాడ్‌ సిట్టింగ్‌ పోశ్చర్స్‌ కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. లైఫ్‌ స్టయిల్‌ లో వచ్చే మార్పులకు అనుగుణంగా దేహం కూడా ప్రతిస్పందిస్తుంటుంది మరి. అందుకే నిపుణులు అధ్యయనం చేసి చెప్పిన సూచనలను తెలుసుకుందాం. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌ తాను అధ్యయనం చేసిన గుడ్‌ పోశ్చర్స్‌ గురించి కొన్ని వివరాలను వెలువరించింది.

చదవండి: Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్‌నట్స్‌ ఎక్కువగా తినిపిస్తున్నారా... అయితే

‘ఆ.. ఏముందిలే’ అనుకుంటే కుదరదు!
ఇటీవల డాక్టర్‌ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్‌ బ్యాక్‌) నొప్పి కేసులను నిశితంగా పరిశీలించినస్పైన్‌ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్ను నొప్పులకు కారణం బ్యాడ్‌ సిట్టింగ్‌ పోశ్చర్‌లేనని చెబుతున్నారు. బ్యాడ్‌ సిట్టింగ్‌ పోశ్చర్‌ పై సమస్యలతో సరిపెట్టదు.

ఈ నొప్పుల కారణంగా అసంకల్పితంగా దేహ భంగిమలో మరికొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. భుజాలను వంచడం, నొప్పి లేని భంగిమ కోసం మెడను ముందుకు చాచినట్లు సాగదీయడం, తలను కిందికి వంచడం కూడా జరుగుతాయి. ఇవన్నీ కలిసి ఒత్తిడితో కూడిన తలనొప్పికి దారి తీస్తాయి. విశ్రాంతి కోసం పడుకున్న తర్వాత కూడా చాలా సమయం వరకు దేహం పూర్తిగా సాంత్వన పొందలేదు. పడుకున్న తర్వాత నిద్రపట్టడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం జరిగిపోతుంది. దీంతో బ్యాక్‌పెయిన్‌కి నిద్రలేమి కూడా తోడవుతుంది.

నిద్రలేమి ప్రభావం జీర్ణక్రియ మీద కూడా చూపిస్తుంది. తినాలనే ఆసక్తి లోపిస్తుంది. పని చేయాలనే ధ్యాస కలగదు. పని చేయడానికి కూర్చున్నప్పటికీ ఏకాగ్రత సాధ్యం కాదు. పైగా తరచుగా మర్చిపోవడం కూడా మొదలవుతుంది. పెద్దవాళ్లయితే తమకు తాముగా ‘మర్చిపోయాం’ అనుకుని సరిపెట్టుకుందారు. కానీ అదే పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ ‘విన్న పాఠం ఎలా మర్చిపోయావ్‌? శ్రద్ధగా వినాలనే ధ్యాస ఉంటేగా’ అని మందలిస్తారు.

నిజానికి ‘ఈ మర్చిపోవడం’ వెనుక పిల్లలను కూర్చోబెట్టిన భంగిమ కూడా కారణమే. అలాగే పెద్దవాళ్ల విషయానికి వస్తే... నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్‌ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం. ‘సిట్‌ రైట్‌’ అని చెప్పడానికి టీచర్‌ ఉండరు, స్కూలు వదిలిన తర్వాత కాలేజ్‌ రోజుల్లో అమ్మానాన్నలు చెబుతారు. ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి వాళ్లే టీచర్‌.

చదవండి: Health Tips: షుగర్‌, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement