
చలికాలంలో బాధించే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, వయసుతో సంబంధం లేకుండా చాలామందిని చుండ్రు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి? అన్న విషయాలు తెలుసుకుందాం.
చుండ్రు ఎందుకు వస్తుంది?
చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచూ ప్రయాణాలు చేయడం, వాతావరణ మార్పు, నీళ్లు మారడం లాంటివి చుండ్రుకు కారణాలు.
ఏం చేయాలి?
► ఆపిల్ సీడర్ వెనిగర్‌తో చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు.
►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది.
►రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి, ఉదయం దానిని పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
► వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.
►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది..