మానా గ్రామం.. ఇది మన ఊరే! | How to Visit Last Indian Village Mana, Tour Complete Details in Telugu | Sakshi

మానా గ్రామం.. ఇది మన ఊరే!

Mar 1 2021 1:30 PM | Updated on Mar 1 2021 2:01 PM

How to Visit Last Indian Village Mana, Tour Complete Details in Telugu - Sakshi

ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా?
హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు.
సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్‌ను చూస్తూ...
టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు.
పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో...
తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే.
టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు.
సరస్వతి నది మీద ద్రౌపది కోసం...
భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు.
ఇంకా... ఇంకా... చూడాలంటే...
‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు.

మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. 

దారి చూపే బ్యాంకు
ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్‌ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్‌పూల్‌– సరస్వతి దర్శన్‌ 100మీటర్లు, కేశవ్‌ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. 

చాయ్‌ ప్రమోషన్‌
ప్రోడక్ట్‌ని ప్రమోట్‌ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్‌ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్‌ కీ అంతిమ దుకాన్‌’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్‌ బ్యాంకు బోర్టే. స్టేట్‌ బ్యాంకు జోషిమఠ్‌ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్‌ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్‌. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు.

మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని చిత్కుల్‌ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే.

చదవండి:
రంగులు మార్చే సూర్యుడు

భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్‌ సమాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement