ఉత్తరాఖండ్... దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకుల మదిని పులకింపజేస్తాయి. వేసవిలో ఇక్కడికి వచ్చి, జలపాతాల్లో జలకాలాటలు ఆడినవారు వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రుతుపవనాలు ఉత్తరాఖండ్‌ను తాకాయి. వేసవిలో ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, దాని పరిసర ప్రాంతాలకు వచ్చి, ఇక్కడి జలపాతాలలో స్నానం చేసినవారు ఇకపై ఈ జలపాతాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ధోకనే జలపాతం నైనిటాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు అత్యధిక స్థాయిలో జాలువారుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్నానం చేయకూడదు. ఒడ్డున కూర్చుని స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఉడ్‌ల్యాండ్ జలపాతం నైనిటాల్-కలాధుంగి రోడ్డులో ఉంది. స్థానికులు దీనిని మిల్కీ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ జలపాతం ఒక వాలులో ఉన్నందున పర్యాటకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జలపాతం కిందకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్థానికులు చెబుతుంటారు.
జిమ్ కార్బెట్ జలపాతం కలదుంగి-రామ్‌నగర్ రహదారిలో ఉంది. ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. వర్షాకాలంలో ఇక్కడ నీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. జలపాతం సమీపంలోకి వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.
భాలుగాడ్ జలపాతం నైనిటాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. వేసవిలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.
దట్టమైన అడవుల మధ్య హిడెన్ జలపాతం ఉంది. వేసవిలో ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం అసాధారణ నీటిమట్టంతో ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటువైపు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment