Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను.. | I provide jobs for the blind myself says Vision Empower Founder Vidhya Y | Sakshi
Sakshi News home page

Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..

Published Fri, Oct 29 2021 3:37 AM | Last Updated on Fri, Oct 29 2021 9:16 AM

I provide jobs for the blind myself says Vision Empower Founder Vidhya Y - Sakshi

ఎం.ఎస్‌.సి డిజిటల్‌ సొసైటీ కోర్స్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్‌ అందరికీ క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్‌లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా.

‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్‌ వంటివి తీసుకోవడానికి స్కూల్స్‌ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్‌ చదవకూడదు?’ అంటుంది విద్య.

బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్‌.సిలో గోల్డ్‌ మెడల్‌ సాధించి ఇప్పుడు ‘విజన్‌ ఎంపవర్‌’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్‌ చదవడంలో మెటీరియల్‌ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.  

ప్రిమెచ్యూర్‌ రెటినోపతి
విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్‌ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల  తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు.

‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్‌ వరకూ స్పెషల్‌ స్టూడెంట్‌గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య.

లెక్కల పిచ్చి
విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్‌ సింబల్స్‌ ఉంటాయి. డయాగ్రామ్స్‌ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను.

ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకుని కంప్యూటర్‌లో ఆడియో మెటీరియల్‌ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్‌ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్‌ సొసైటీ కోర్సును టాపర్‌గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్‌ ఐటి నుంచి మేథమేటిక్స్‌ ఆధారిత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన తొలి స్టూడెంట్‌ని నేనే’ అంటుంది విద్య.
 
అందరి కోసం
విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్‌ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్‌ ఎంపవర్‌’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది.

నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది.
 ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య.


చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్‌ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement