
సాధారణంగా సీజనల్ వ్యాధులను నివారించుకోవడానికి మన ఇళ్లలోనే ఎన్నో చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ వ్యాధులకు ఇంట్లోని పెద్దవాళ్లు వంటింటి వస్తువులతోనే చిటికెలో ఉపశమనం కలిగించే ఔషధాన్ని తయారు చేసి ఇస్తుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు తరచూ చెబుతుంటారు. కానీ వాటిపై ఈ తరం వారు అంతగా నమ్మకం ఉంచరు. అయితే పెద్దలు చెప్పినట్లుగానే వంటింటి పదార్థాలలో తక్షణ ఉపశమనం పొందే ఎన్నో గుణాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి కూడా ఉంది.
అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట. అంతేగాక ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు కూడా అమూల్యమైన వనరుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కప్పు టీని మీ రోజువారి ఆహారపు అలవాట్లలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ టీని ఉల్లిపాయతో లేదా వాటి తొక్కలతో కూడా చేసుకోవచ్చు.
ఉల్లిపాయ టీ:
ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి.
ఉల్లిపాయ పీల్ టీ:
టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి. వేడి వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు పాటు ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.
Comments
Please login to add a commentAdd a comment