‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’... | India At Human Rights Council Asks Pakistan To Put Its House In Order | Sakshi
Sakshi News home page

‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...

Published Fri, Feb 26 2021 12:27 AM | Last Updated on Fri, Feb 26 2021 2:07 PM

India At Human Rights Council Asks Pakistan To Put Its House In Order - Sakshi

సీమా పూజాని, ఐక్యరాజ్యసమితి భారత్‌ దౌత్యాధికారి

జెనీవాలో బుధవారం మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మండలి అది. అత్యంత కీలకమైన సమావేశం. దేశాలన్నీ బాధ్యతగా హాజరవుతాయి. మానవ హక్కుల గురించి మాట్లాడతాయి. మనమూ వెళ్లాం. మన పొరుగున ఉండే పాకిస్తాన్‌ కూడా వచ్చింది. ఎప్పటిలా జమ్మూ–కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టింది! మాట్లాడినంతా మాట్లాడనిచ్చి, మన దౌత్య అధికారి సీమా పూజాని మైక్‌ అందుకున్నారు.

‘నీకు సంబంధం లేని విషయం లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. ‘ఆగస్టులో జరిగిన సదస్సులో కూడా ఇలాగే ఎక్కువ చేశావు’ అని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు. ఆ దేశం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో మండలి సభ్యులందరి దృష్టికి తెచ్చారు. ఆ యువ ఐ.ఎఫ్‌.ఎస్‌. ఇచ్చిన ‘రైట్‌ ఆఫ్‌ రిప్లయ్‌’కి దేశంలో ఇప్పుడు ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
∙∙
సీమా పూజాని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ తరఫున మాట్లాడే హక్కు కలిగిన సెకెండ్‌ సెక్రెటరీ. దౌత్య అధికారి. ఆమె ఇచ్చిన సమాధానం గానీ, చేసిన ప్రకటన గానీ భారత్‌ తరఫున అధికారికం అవుతుంది. అందుకే హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్‌ ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన విధానానికి దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని ఆ దేశానికి చెప్పడమే. సీమను తగిన పోస్ట్‌లోనే నియమించుకుంది భారత్‌. 2014 సివిల్స్‌లో ఆలిండియా ర్యాంకర్‌ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసును ఎంచుకున్నారు. అప్పటికి ఆమె ‘లా’ పూర్తయింది. ‘లా’ లోనే పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక బ్యూసెరియస్‌ లా స్కూల్‌ చేరుదామని అనుకుని కూడా.. సివిల్స్‌ సాధించాలనే తన కలలోకి మళ్లీ వెళ్లిపోయారు.

రెండో అటెంప్ట్‌తో ఆమె కల నిజమైంది. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్‌లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్‌నాథ్‌ పూజానీ రిటైర్డ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌. తల్లి గృహిణి. సీమ మొదట ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నారు. ఇంటర్‌లో సైన్స్‌ తీసుకున్నారు. ఇంటర్‌ తర్వాత మాత్రం ఇంజనీరింగ్‌ చేయలేదు. ‘లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్‌ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. మరీ చిన్నప్పుడైతే ఆమెకు వెటరినరీ డాక్టర్‌ అవాలని ఉండేదట. చివరికి ఆరోగ్యకరమైన దౌత్య సంబంధాలను నెరిపే బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అవసరమైతే మాటకు మాటతో చికిత్స కూడా. సమితి మానవ హక్కుల మండలిలో మొన్న పాకిస్తాన్‌కు ఆమె చేసిన చికిత్స అటువంటిదే.

సమితి హక్కుల ‘మండలి’లో సీమ మాటకు మాట

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement