మిల్క్ పౌడర్ లడ్డూ
కావలసినవి: మిల్క్ పౌడర్ – 1 కప్పు, చిక్కటి పాలు – పావు కప్పు (కాచి చల్లార్చినవి), పంచదార – పావు కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పంచదార, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని.. పంచదార కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ స్టవ్ మీద పెట్టి.. చిన్న మంట మీద ఉంచి.. కొద్దికొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా ముద్దలా అయిపోయిన తర్వాత రెండు భాగాలుగా చేసుకుని, ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టుకుని.. మరో భాగాన్ని పాన్‌లోనే ఉంచి మిగిలిన నెయ్యి వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలిపి.. పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిగా తీసి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న బాల్స్ చేసుకుని.. వాటిపైన ఫుడ్ కలర్ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక్కోబాల్ చుట్టూ పెట్టుకుని.. నిమ్మకాయ సైజ్‌లో లడ్డూలు చేసుకోవాలి.
క్యారెట్ పనియారం
కావలసినవి: దోసెల పిండి – 1 కప్పు, ఉల్లిపాయలు – 3 (స్మాల్ సైజ్, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 1(చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి), అల్లం పేస్ట్ – పావు టీ స్పూన్, క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప్పప్పు – పావు టీ స్పూన్, కరివేపాకు – 1 లేదా 2 రెమ్మలు, ఇంగువ – చిటికెడు, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్లు
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. దోసెల పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, క్యారెట్ తురుము, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కలుపు కోవాలి. ఇప్పుడు అందులో ఇంగువ, పసుపు, ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలుపుకుని.. పొంగనాల పాన్‌లో అడుగున నూనె రాసుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం వేసుకొని, కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో ఉడికించుకోవాలి.
బీట్‌రూట్ పకోడా
కావలసినవి: బీట్‌రూట్ 2 (మీడియం సైజ్, సన్నగా తురుముకోవాలి), అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బీట్ రూట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని.. పకోడాలు వేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment