తీపి వంటకాల్లో లడ్డూ.. తీపి వంటకాల్లో లడ్డూ మొదటి వరుసలో ఉంటుంది. ఏ శుభకార్యమైనా, ఏ శుభ సందర్భమైనా లడ్డూతోనే పరిపూర్ణమవుతుంది. స్వీట్స్ అన్నిట్లోకి అంతటి ప్రత్యేకత పొందింది లడ్డూ! అందులో బందురు తొక్కుడు లడ్డూకున్న రుచే వేరు! నాణ్యమైన నెయ్యి, బెల్లంతో తయారుచేసిన బందరు తొక్కుడు లడ్డూ పేరు చెబితే చాలు చవులూరుతాయి. ఈ తియ్యటి ఖ్యాతి బందరు దాటి ప్రపంచానికీ పాకింది. ఆ కమ్మదనంపై ప్రత్యేక కథనం...
ఈ లడ్డూ.. క్రీస్తుశకం 17వ శతాబ్దం చివరలో పాకానికి వచ్చినట్టు చెబుతారు. బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి బందరు (మచిలీపట్నం)కు వలస వచ్చిన మిఠాయి వ్యాపారులు బొందిలి రామ్‌సింగ్ సోదరులు బెల్లపు తొక్కుడు లడ్డూ, నల్ల హల్వాను ఈ ప్రాంతవాసులకు పరిచయం చేశారని చరిత్రకారుల మాట. వారి నుంచి ఈ మిఠాయి తయారీ విధానాన్ని అందిపుచ్చుకున్న బందరు వాసులు కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, శిర్విశెట్టి రామకృష్ణారావు (రాము), శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య తదితరులు లడ్డూ, హల్వాల ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చారు. మచిలీపట్నానికి ఉన్న మరో పేరు బందరు. ఆ లడ్డూ రుచి లోకమంతటికి తెలిసినా రెసిపీ బందురుకు మాత్రమే సొంతమవడంతో అది ‘బందరు లడ్డూ’గా పేరుపొందింది. దీన్ని రోకలితో బాగా దంచి, పొడిచేసి తయారు చేస్తుండటంతో ‘బందరు తొక్కుడు లడ్డూ’గా స్థిరపడింది.
ప్రత్యేకమైందీ తయారీ విధానం..
ఈ లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి, పటిక బెల్లం, బాదం పప్పు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పును వినియోగిస్తారు. ముందుగా శనగ పిండిని నీటితో కలిపి నేతి బాండీలో బూంది మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడిచేస్తారు. ఆ పొడిని బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి, మళ్లీ రోకలితో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, పటిక బెల్లం ముక్కలు, ఏలకుల పొడి కలుపుతారు. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఆరబెట్టి, చెక్క బల్లపై ఒత్తుతూ తగినంత సైజులో లడ్డూలు కడతారు. ఇవి 15 రోజులకు పైగా నిల్వ ఉంటాయి.
జీఐ గుర్తింపు.. విదేశాలకు ఎగుమతులు..
మొన్నటి వరకు దేశానికే పరిమితమైన ఈ టేస్టీ వంటకం ఇప్పుడు భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ, ఆహార విభాగంలో 2017లో బందరు బెల్లపు తొక్కుడు లడ్డూ పరిశ్రమకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) ఇచ్చింది. ఈ స్వీట్‌కు పేటెంట్ హక్కు (పార్ట్–బి) లభించింది. దీంతో ప్రపంచ దేశాలకు బందరు లడ్డూ ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు సహా దుబాయ్, ఇరాక్, కువైట్‌లకూ ఏటా వేల కిలోల లడ్డూ ఎగుమతి అవుతోందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఈ లడ్డూ తయారీదారులు, వ్యాపారస్థుల సంఖ్యా పెరుగుతోంది. మచిలీపట్నంలోని బృందావన మిఠాయి వర్తక సంఘంలో సభ్యత్వం కలిగిన 50 మందికి పైగా వ్యాపారులు బందరు తొక్కుడు లడ్డూ, హల్వాలను విక్రయిస్తున్నారు. వీరి వద్ద వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా, వారిలో 250 మందికి పైగా మహిళలు ఉన్నారు.
నోట్లో వేసుకోగానే కరిగే నేతి హల్వా..
బందరులో తయారయ్యే మరో తీపి వంటకం ‘నేతి హల్వా’కూ మంచి డిమాండ్ ఉంది. రాత్రంతా గోధుమలను నానబెట్టి, మరుసటి రోజు పిండిగా రుబ్బి, దాన్నుంచి పాలు తీస్తారు. ఆ పాలను బెల్లం పాకంలో పోస్తూ కలియ తిప్పుతారు. ఆ పాకాన్ని పొయ్యి మీద నుంచి దించే అరగంట ముందు అందులో తగినంత నెయ్యి వేస్తారు. ఆ తర్వాత సరిపడా జీడిపప్పును దట్టించి, ప్రత్యేక ట్రేలలో పోస్తారు. అలా 24 గంటల పాటు ఆరబెడతారు. ఈ హల్వా సుమారు నెల వరకు నిల్వ ఉంటుంది. నలుపు వన్నెతో ఉండే ఈ హల్వా కూడా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతోంది. – ఎస్.పి. యూసుఫ్, ఫొటోలు: కందుల చక్రపాణి, సాక్షి, విజయవాడ.
Comments
Please login to add a commentAdd a comment