
ప్రతీకాత్మక చిత్రం
ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి..
International Day for the Elimination of Violence against Women: ఒకరోజు వెనక్కి వెళితే... కేరళలోని ఎర్నాకుళంలో పర్వీన్ అనే లా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిరాతతో కూడిన ఒక సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో దొరికింది. భర్త, అత్తమామలు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోతున్నానని రాసింది.
రెండు రోజులు వెనక్కి వెళితే...
కెన్యాలో అకియో అనే పేరుగల స్త్రీ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు... భర్తే. అనుమాన పీడితుడైన భర్త అకియోను తరచు హింసించేవాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి అందరూ చూస్తుండగానే భార్యను హత్య చేశాడు.
కేరళ నుంచి కెన్యా వరకు, అమెరికా నుంచి చైనా వరకు...దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉండొచ్చుగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో మాత్రం ఎలాంటి దూరాలు లేవు. ఇక్కడెంతో అక్కడంతే! అక్కడెంతో ఇక్కడ అంతే!!
బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, వర్ణవివక్షతతో కూడిన హింస, లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు... ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం స్త్రీ హింసా వ్యతిరేక దినం (నవంబర్ 25) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది, ఈ సంవత్సరం ‘ఆరేంజ్ ది వరల్డ్: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్’ గ్లోబల్ థీమ్‌తో నేటి నుంచి డిసెంబర్ 10 (మానవ హక్కుల దినోత్సవం) వరకు 16 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, 180 దేశాల ప్రతినిధులు, మరెంతో మంది స్త్రీ ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారు.
చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..!
కన్నీటిని కన్నీటితోనే తుడవలేం...కార్యాచరణ కావాలి...ప్రణాళిక కావాలి. ఆచరణ వైపు వడివడిగా అడుగులు పడాలి. ఈ సమావేశాలు అలాంటి పనే చేస్తున్నాయి. లోకల్, కంట్రీ, గ్లోబల్ నేపథ్యంలో ఆలోచనలు, ఆచరణలను సమన్వయం చేస్తున్నాయి.
‘ఇదిగో మా దగ్గర ఇలా చేశాం. మీ దగ్గర మాత్రం ఎందుకు చేయరు’ అని ఒక సూచన ఇస్తాయి.
హింసకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ యోధురాళ్ల ఉపన్యాసాలు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి.
‘ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి’ అని దేశ దేశాలకు ఉపదేశం ఇస్తాయి.
కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి. కొత్తగా ‘డిజిటల్ వయొలెన్స్’ వచ్చింది... ఇలాంటి ఎన్నో వికృతరూపాల గురించి ఈ సమావేశాలు లోతుగా చర్చిస్తాయి. నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలు ఆలోచిస్తాయి.
‘ఎండ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ నౌ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం ఇచ్చేలా చేస్తాయి.
చదవండి: Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!!