‘అసాధ్యం’ అనే మాటలో కొందరు ‘అ’ అనే అక్షరాన్ని ఎప్పటికీ పట్టించుకోరు. అజయ్ అక్షరాలా అలాంటి కుర్రాడే. ‘మనం అనుకోవాలేగానీ సాధ్యం కానిది అంటూ ఏముంది’ అనేది అతడి నమ్మకం. అంతులేని బలం.
చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాడు హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్. ఇరవై ఏళ్లు దాటే లోపే వైరల్ యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఔత్సాహిక యూట్యూబర్‌లకు రోల్‌మోడల్ అయ్యాడు.
చిన్నప్పుడు ఫుట్‌బాల్ ట్యుటోరియల్ వీడియోలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు అజయ్. ‘అడిక్టెడ్’ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్ ఆ తరువాత ‘క్యారీ డియోల్’గా పేరు మార్చుకుంది. కొత్త పేరే కాదు...కొత్త కంటెంట్ వచ్చింది. గేమ్‌ప్లే ఫుటేజిని అప్‌లోడ్ చేయడం నుంచి హీరో సన్నీ డియోల్‌ను అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. అజయ్ వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్’ ఆరు రోజుల్లోనే 72.2 మిలియన్‌ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది.
అజయ్ ఫాలోవర్స్ ఒక రేంజ్‌కు చేరుకునే సమయానికి చానల్ పేరు ‘క్యారీమినటీ’గా మారింది. ‘ఇంతకీ క్యారీమినటీ అంటే?’ అని అడిగితే ‘నాకు కూడా తెలియదు. ఇట్ జస్ట్ సౌండ్స్ కూల్ అని అలా డిసైడైపోయాను’ నవ్వుతూ అంటాడు అజయ్. ఒక వీడియో హిట్ అయిన తరువాత సంతోషం మాటేమిటోగానీ దాని ప్రభావం చేయబోయే వీడియో మీద పడుతుంది. ‘గత వీడియోను మించి వ్యూస్ రావాలి’ అనుకునే సమయంలో ఒత్తిడి వచ్చి తల మీద కూర్చుంటుంది. దాన్ని కిందికి దించడం కష్టమైన పని. మరి ఈ సమస్యను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు?
అతడి మాటల్లోనే...
‘వీడియోలు చేస్తుప్పుడు ఒత్తిడికి గురవుతుంటారా? అని నన్ను చాలామంది అడిగే వాళ్లు. ఒత్తిడి ఏమిటి! అని ఆశ్చర్యపడేవాడిని. అయితే అది ఒకప్పటి సంగతి. ఆ తరువాత నాలో కూడా మెల్లగా ఒత్తిడి మొదలైంది. ఎన్నో లక్షల మంది నా వీడియోలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. నెగెటివ్ కామెంట్స్ రావద్దు...అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. అయితే చివరి సమయంలో మాత్రం ఏదైతే అది అవుతుంది అనుకొని నా మనసుకు నచ్చినట్లు చేసేవాడిని. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’ఎవరి పిల్లలు వారికి ముద్దు అన్నట్లు ఎవరు చేసిన వీడియోలు వారికి మురిపెంగానే ఉంటాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని తన వీడియోలను యూట్యూబ్‌లోకి వదిలే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాడు. బయటి ప్రేక్షకుడు ఎవరో చూస్తున్నట్లుగా తన వీడియోను చూస్తాడు.జీవితం పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ అని రెండు ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో ఉన్నాం మనం. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే అజయ్ ఎక్కువ కాలం గడపడం వల్ల కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్‌తో సరదాలు లేవు. వినోదాలు లేవు. అయితే అజేయపథంలో దూసుకుపోతున్న అజయ్ నాగర్‌కు వాటి గురించి గుర్తు రావడం అరుదే.
‘అజయ్ నాగర్, క్యారీమినటీ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లేడు అనే బాధ నాకు లేదు’ అంటాడు అజయ్.‘చాలా కష్టసమయంలో మీ వీడియో ఒకటి చూశాను. ఉత్సాహం పుంజుకోవడానికి అది నాకు ఔషధంలా పనిచేసింది’ ఇలాంటి ఈమెయిల్స్ అజయ్‌కు వస్తుంటాయి. వాటిని చదివినప్పుడల్లా తన బలం రెట్టింపు కావడంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది.హార్డ్‌వర్క్, టాలెంట్‌తో అయిదు యూట్యూబ్ అవార్డ్‌లతో పాటు అజయ్ ఎన్నో అవార్డ్‌లు అందుకున్నాడు. ఆర్థిక కోణంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఔత్సాహిక యూట్యూబర్‌లకు రోల్‌మోడల్‌గా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment