యువత కలలకు రెక్కలు | IPS Ankita Sharma is helping a student studying in UPSC | Sakshi
Sakshi News home page

యువత కలలకు రెక్కలు

Published Mon, Dec 7 2020 12:38 AM | Last Updated on Mon, Dec 7 2020 4:23 AM

IPS Ankita Sharma is helping a student studying in UPSC - Sakshi

ఐపీఎస్ అంకితా శర్మ

‘జీవితంలో ఏం అవ్వాలో కలగన్నాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సాధన చేశాను. కల నెరవేరింది..’ అంటూ రిలాక్స్‌ అయ్యేవారికి ఓ కొత్త మార్గాన్ని సూచిస్తున్నారు ఐపీఎస్‌ అంకితా శర్మ. ఓ వైపు విధులను నిర్వర్తిస్తూనే సెలవురోజును కూడా ఉపయోగించుకోకుండా కోచింగ్‌లకు ఫీజులు కట్టుకోలేని యువతను యూపీఎస్సీ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ చేస్తున్నారు. పేదరికపు యువత కలలకు కొత్త రెక్కలు కడుతున్నారు.

ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో సూపరింటెండెంట్‌ విధులను నిర్వర్తిస్తున్న ఐపీఎస్‌ అంకితా శర్మ బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోదు. విధి నిర్వహణలోనూ, లుక్స్‌లోనూ ఆమె తరచూ చర్చలోనే ఉంటుంటారు. అంకిత చేస్తున్న పనులతోపాటు తన స్టైలిష్‌ ఫొటోలను కూడా సోషల్‌మీడియా వేదిక గా పంచుకుంటారు. రచనలతో పాటు సమాజానికి బెస్ట్‌ని అందించాలనే తపన ఉన్న అంకితా శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ సోషల్‌మీడియాలో ఆమెకు ప్రశంసలు అందుతూనే ఉంటాయి.  

ఆదివారం అధ్యాపకురాలు
అంకిత వారమంతా విధి నిర్వహణలో బిజీగా ఉంటుంది. ఆదివారం మాత్రం టీచర్‌ పాత్ర పోషిస్తుంది. ఆమె తన ఆఫీసునే తరగతి గదిగా మార్చి, పాతిక మంది యువతకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఎగ్జామ్‌కు కోచింగ్‌ ఇస్తుంటారు. వారందరూ కోచింగ్‌కు ఫీజు చెల్లించలేనివారు. పేదరికం కారణంగా వారి కలలు ఆగిపోకూడదని ఆమె ఆలోచన.

మరువలేని మార్గం
అంకిత ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. కాలేజీ చదువు కూడా ప్రభుత్వ కాలేజీల్లోనే కొనసాగింది. యూపిఎస్సీ పరీక్షలో విజయం సాధించాలన్నదే ఆమె ఆశయం. రెండుసార్లు ప్రయత్నించినా సక్సెస్‌ దరిచేరలేదు. పట్టు వదలకుండా మూడవసారి 203వ ర్యాంక్‌ సాధించి, ఛత్తీస్‌గడ్‌కు మొదటి మహిళా ఐపీఎస్‌ అయ్యారు. ‘చిన్నప్పటి నుంచీ ఐపీఎస్‌ కావాలని కల ఉండేది. అయితే సరైన మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడ్డాను.

ఈ స్థితికి చేరుకున్న మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కొందరికైనా నేను సాయపడాలనుకున్నాను. అందుకే ఈ కోచింగ్‌’ అని అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, ఐపీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎంపిక విధానంలో తనకు ఎదురైన ఇబ్బందులు మరెవరూ ఎదుర్కోకూడదని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీకి సన్నద్ధమవుతున్న యువత ఏదైనా సహాయం అవసరమైతే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య అజాద్‌ చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనని కలవవచ్చని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలియజేశారు.

వదలని కల
అంకిత దుర్గ్‌ నుండి పట్టా పొందిన తర్వాత ఎంబీయే చేసి యూపీఎస్సీకి సిద్ధం కావడానికి ఢిల్లీకి వెళ్లింది. కానీ, ఆమె అక్కడ కేవలం ఆరు నెలలు మాత్రమే చదువుకుంది. కానీ, పరిస్థితులు అనుకూలించక స్వయంగా చదువుకోవడానికి ఇంటికి తిరిగి వచ్చింది. యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న సమయంలోనే ఆర్మీలో మేజర్‌ అయిన వివేకానంద శుక్లాతో పెళ్లి అయ్యింది. అతనితో పాటు ఆమె  కొన్నాళ్లు జమ్మూ కశ్మీర్‌లో నివసించింది. ఆ తర్వాత భర్తతో కలిసి ముంబయ్, ఝాన్సీ నగరాలలోనూ నివసించింది. ‘ఎలాంటి స్థితిలో ఉన్నా నా కలను వదల్లేదు’ అని తెలిపారు అంకిత. గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్‌ ఆడటం అంటే అంకితా శర్మకు చాలా ఇష్టం. తరచుగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటారు ఆమె.

పరేడ్‌ గ్రౌండ్‌లో కవాతు
ఈ యేడాది రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ట్రైనీ ఐíపీఎస్‌ గ్రూప్‌కు అంకితాశర్మ నాయకత్వం వహించారు. దీనితో రాష్ట్రచరిత్రలో గణతంత్ర దినోత్సవ కవాతు నిర్వహించిన మొదటి మహిళా పోలీసు అధికారి అయ్యారు. ‘మహిళలు ఎవరికన్నా తక్కువ కాదు. ప్రజలకు సేవ చేయడానికి వారు యూనిఫామ్‌ ధరించాలి’ అంటున్నారు ఈ పోలీస్‌ అధికారి.

తన మార్గంలో మరెందరో ప్రయాణించి విజయతీరాలను చేరుకునేందుకు ముందడుగు అంకిత. నవీన సమాజపు యువత కలలకు ప్రతీక అంకిత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement