povertyline
-
ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్‌వర్క్ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్ హోంవర్క్ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు. కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్‌గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్గా పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. అలా ఈ సెంటర్లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు... పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్ క్యాంప్‌లు, టూర్లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్‌ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్‌ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. చదువునుంచి దృష్టి మరల్చకుండా... నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం ద్వారా వారి భవిష్యత్ మారుతుందని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’ – శివస్వామి, మహాలక్ష్మి -
యువత కలలకు రెక్కలు
‘జీవితంలో ఏం అవ్వాలో కలగన్నాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సాధన చేశాను. కల నెరవేరింది..’ అంటూ రిలాక్స్ అయ్యేవారికి ఓ కొత్త మార్గాన్ని సూచిస్తున్నారు ఐపీఎస్ అంకితా శర్మ. ఓ వైపు విధులను నిర్వర్తిస్తూనే సెలవురోజును కూడా ఉపయోగించుకోకుండా కోచింగ్‌లకు ఫీజులు కట్టుకోలేని యువతను యూపీఎస్సీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ చేస్తున్నారు. పేదరికపు యువత కలలకు కొత్త రెక్కలు కడుతున్నారు. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో సూపరింటెండెంట్ విధులను నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అంకితా శర్మ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోదు. విధి నిర్వహణలోనూ, లుక్స్‌లోనూ ఆమె తరచూ చర్చలోనే ఉంటుంటారు. అంకిత చేస్తున్న పనులతోపాటు తన స్టైలిష్ ఫొటోలను కూడా సోషల్‌మీడియా వేదిక గా పంచుకుంటారు. రచనలతో పాటు సమాజానికి బెస్ట్‌ని అందించాలనే తపన ఉన్న అంకితా శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ సోషల్‌మీడియాలో ఆమెకు ప్రశంసలు అందుతూనే ఉంటాయి. ఆదివారం అధ్యాపకురాలు అంకిత వారమంతా విధి నిర్వహణలో బిజీగా ఉంటుంది. ఆదివారం మాత్రం టీచర్ పాత్ర పోషిస్తుంది. ఆమె తన ఆఫీసునే తరగతి గదిగా మార్చి, పాతిక మంది యువతకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎగ్జామ్‌కు కోచింగ్ ఇస్తుంటారు. వారందరూ కోచింగ్‌కు ఫీజు చెల్లించలేనివారు. పేదరికం కారణంగా వారి కలలు ఆగిపోకూడదని ఆమె ఆలోచన. మరువలేని మార్గం అంకిత ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. కాలేజీ చదువు కూడా ప్రభుత్వ కాలేజీల్లోనే కొనసాగింది. యూపిఎస్సీ పరీక్షలో విజయం సాధించాలన్నదే ఆమె ఆశయం. రెండుసార్లు ప్రయత్నించినా సక్సెస్ దరిచేరలేదు. పట్టు వదలకుండా మూడవసారి 203వ ర్యాంక్ సాధించి, ఛత్తీస్‌గడ్‌కు మొదటి మహిళా ఐపీఎస్ అయ్యారు. ‘చిన్నప్పటి నుంచీ ఐపీఎస్ కావాలని కల ఉండేది. అయితే సరైన మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ స్థితికి చేరుకున్న మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కొందరికైనా నేను సాయపడాలనుకున్నాను. అందుకే ఈ కోచింగ్’ అని అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, ఐపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎంపిక విధానంలో తనకు ఎదురైన ఇబ్బందులు మరెవరూ ఎదుర్కోకూడదని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీకి సన్నద్ధమవుతున్న యువత ఏదైనా సహాయం అవసరమైతే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య అజాద్ చౌక్ పోలీస్ స్టేషన్లో తనని కలవవచ్చని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు. వదలని కల అంకిత దుర్గ్ నుండి పట్టా పొందిన తర్వాత ఎంబీయే చేసి యూపీఎస్సీకి సిద్ధం కావడానికి ఢిల్లీకి వెళ్లింది. కానీ, ఆమె అక్కడ కేవలం ఆరు నెలలు మాత్రమే చదువుకుంది. కానీ, పరిస్థితులు అనుకూలించక స్వయంగా చదువుకోవడానికి ఇంటికి తిరిగి వచ్చింది. యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఆర్మీలో మేజర్ అయిన వివేకానంద శుక్లాతో పెళ్లి అయ్యింది. అతనితో పాటు ఆమె కొన్నాళ్లు జమ్మూ కశ్మీర్లో నివసించింది. ఆ తర్వాత భర్తతో కలిసి ముంబయ్, ఝాన్సీ నగరాలలోనూ నివసించింది. ‘ఎలాంటి స్థితిలో ఉన్నా నా కలను వదల్లేదు’ అని తెలిపారు అంకిత. గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ ఆడటం అంటే అంకితా శర్మకు చాలా ఇష్టం. తరచుగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటారు ఆమె. పరేడ్ గ్రౌండ్లో కవాతు ఈ యేడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ట్రైనీ ఐíపీఎస్ గ్రూప్‌కు అంకితాశర్మ నాయకత్వం వహించారు. దీనితో రాష్ట్రచరిత్రలో గణతంత్ర దినోత్సవ కవాతు నిర్వహించిన మొదటి మహిళా పోలీసు అధికారి అయ్యారు. ‘మహిళలు ఎవరికన్నా తక్కువ కాదు. ప్రజలకు సేవ చేయడానికి వారు యూనిఫామ్ ధరించాలి’ అంటున్నారు ఈ పోలీస్ అధికారి. తన మార్గంలో మరెందరో ప్రయాణించి విజయతీరాలను చేరుకునేందుకు ముందడుగు అంకిత. నవీన సమాజపు యువత కలలకు ప్రతీక అంకిత. -
ధనికమైతే ఢిల్లీ వైపు చూపెందుకు?
బడ్జెట్‌పై సాధారణ చర్చలో బీజేపీ పక్షనేత కె.లక్ష్మణ్ పన్నుల వాటాలో రాష్ట్రాలక ఆర్థిక స్వేచ్ఛనిచ్చి కొత్త ఒరవడి సృష్టించిన కేంద్రం తప్పుపట్టిన ఈటెల, కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: డెబ్బై శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు(బీపీఎల్) ఉన్నప్పుడు.. రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రమని ఎలా అంటారని బీజేపీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ నిజంగా ధనిక రాష్ట్రమైతే కేంద్రంపై ఎందుకు ఆధారపడుతున్నారని, నిధుల కోసం ఢిల్లీ వైపు ఎందుకు చూస్తున్నారని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం రాష్ట్రంలో కేవలం మిగులు బడ్జెట్ ఉందని మాత్రమే తెలిపిందని, ముఖ్యమంత్రి మాత్రం ధనిక రాష్ట్రమని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. శనివారం బడ్జెట్‌పై సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ పూర్తిగా వాస్తవ విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ఉందని, ప్రభుత్వం గొప్పలకు పోయి లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఇదే సమయంలో పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి కేంద్రం కొత్త ఒరవడి సృష్టించిందని, ఇది రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు. 13వ ఆర్థిక కమిషన్ మేరకు రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు రావాల్సి వస్తే, కేంద్ర నిర్ణయంతో 14వ ఆర్థిక కమిషన్‌లో రూ.13 వేల కోట్ల నిధులు వస్తాయని పేర్కొన్నారు. శాఖలకు సరైన కేటాయింపులు ఎక్కడ..? రైతులకు ఉపశమనం కల్గించే, ఆత్మహత్యలను నివారించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రయత్నం జరగలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యకు కేటాయింపుల్లో ప్రతికూల పురోగతి(నెగెటివ్ గ్రోత్) ఉందని, యూనివర్సిటీలు ఖాళీలతో సతమతమవుతున్నాయని, రాష్ట్రాన్ని విత్తన భాంఢాగారంగా చేస్తామని ప్రకటించి ప్రభుత్వం దానికి నిధులను రూ.37 కోట్లకే పరిమితం చేసిందని అన్నారు. ఇక ప్రభుత్వం చెబుతున్న ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయలకు బయట కొందరు చెబుతున్నట్టుగా భారీగా నిధులేమీ కేటాయించలేదని, తన దృష్టిలో ఆ కేటాయింపులు చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. వాటర్ గ్రిడ్‌కు ఐదే ళ్లలో రూ.26 వేల కోట్లు అంచనా వేసి కేవలం రూ.4 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.20 వేల కోట్లు అని చెప్పి రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం బస్తీల్లో మరుగుదొడ్ల విషయాన్ని పట్టించుకోలేదన్నారు. అన్నింటికీ కేంద్రంపై ఆధారపడి, లేదంటే అప్పులు తెస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చొద్దని సూచించారు. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంపై మాట్లాడుతూ, ఈ విధానం సరైంది కాదని, అధికార పక్షం రాజకీయ విలువలు కాపాడాలని కోరారు. తప్పుపట్టిన మంత్రులు.. అంశాల వారీగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సీఎం కేవలం తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు. వెనక్కు నెట్టేయబడిన ప్రాంతం మాత్రమే. ఇప్పుడు ఆర్థిక సంఘం మిగులు ఉందని తేల్చడంతో అదే నిజమైందని మాత్రమే అన్నారు. అంతేతప్ప ధనిక రాష్ట్రమని అనలేదు’ అని ఆర్థిక మంత్రి ఈటెల తెలిపారు. అప్పులు తేకుండా, కేంద్రాన్ని కోరకుండా, పన్నులు వేయకుండా శాఖలకు కేటాయింపులు జరపాలంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇక కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటాను పెంచిందన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కేంద్రం ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుందని తెలిపారు.