ధనికమైతే ఢిల్లీ వైపు చూపెందుకు?
బడ్జెట్‌పై సాధారణ చర్చలో బీజేపీ పక్షనేత కె.లక్ష్మణ్
పన్నుల వాటాలో రాష్ట్రాలక ఆర్థిక స్వేచ్ఛనిచ్చి కొత్త ఒరవడి సృష్టించిన కేంద్రం
తప్పుపట్టిన ఈటెల, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డెబ్బై శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు(బీపీఎల్) ఉన్నప్పుడు.. రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రమని ఎలా అంటారని బీజేపీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ నిజంగా ధనిక రాష్ట్రమైతే కేంద్రంపై ఎందుకు ఆధారపడుతున్నారని, నిధుల కోసం ఢిల్లీ వైపు ఎందుకు చూస్తున్నారని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం రాష్ట్రంలో కేవలం మిగులు బడ్జెట్ ఉందని మాత్రమే తెలిపిందని, ముఖ్యమంత్రి మాత్రం ధనిక రాష్ట్రమని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు.
శనివారం బడ్జెట్‌పై సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ పూర్తిగా వాస్తవ విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ఉందని, ప్రభుత్వం గొప్పలకు పోయి లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఇదే సమయంలో పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి కేంద్రం కొత్త ఒరవడి సృష్టించిందని, ఇది రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు. 13వ ఆర్థిక కమిషన్ మేరకు రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు రావాల్సి వస్తే, కేంద్ర నిర్ణయంతో 14వ ఆర్థిక కమిషన్‌లో రూ.13 వేల కోట్ల నిధులు వస్తాయని పేర్కొన్నారు.
శాఖలకు సరైన కేటాయింపులు ఎక్కడ..?
రైతులకు ఉపశమనం కల్గించే, ఆత్మహత్యలను నివారించేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రయత్నం జరగలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యకు కేటాయింపుల్లో ప్రతికూల పురోగతి(నెగెటివ్ గ్రోత్) ఉందని, యూనివర్సిటీలు ఖాళీలతో సతమతమవుతున్నాయని, రాష్ట్రాన్ని విత్తన భాంఢాగారంగా చేస్తామని ప్రకటించి ప్రభుత్వం దానికి నిధులను రూ.37 కోట్లకే పరిమితం చేసిందని అన్నారు. ఇక ప్రభుత్వం చెబుతున్న ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయలకు బయట కొందరు చెబుతున్నట్టుగా భారీగా నిధులేమీ కేటాయించలేదని, తన దృష్టిలో ఆ కేటాయింపులు చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు.
వాటర్ గ్రిడ్‌కు ఐదే ళ్లలో రూ.26 వేల కోట్లు అంచనా వేసి కేవలం రూ.4 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.20 వేల కోట్లు అని చెప్పి రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం బస్తీల్లో మరుగుదొడ్ల విషయాన్ని పట్టించుకోలేదన్నారు. అన్నింటికీ కేంద్రంపై ఆధారపడి, లేదంటే అప్పులు తెస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చొద్దని సూచించారు. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంపై మాట్లాడుతూ, ఈ విధానం సరైంది కాదని, అధికార పక్షం రాజకీయ విలువలు కాపాడాలని కోరారు.
తప్పుపట్టిన మంత్రులు..
అంశాల వారీగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సీఎం కేవలం తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు. వెనక్కు నెట్టేయబడిన ప్రాంతం మాత్రమే. ఇప్పుడు ఆర్థిక సంఘం మిగులు ఉందని తేల్చడంతో అదే నిజమైందని మాత్రమే అన్నారు. అంతేతప్ప ధనిక రాష్ట్రమని అనలేదు’ అని ఆర్థిక మంత్రి ఈటెల తెలిపారు. అప్పులు తేకుండా, కేంద్రాన్ని కోరకుండా, పన్నులు వేయకుండా శాఖలకు కేటాయింపులు జరపాలంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇక కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటాను పెంచిందన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కేంద్రం ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుందని తెలిపారు.