- నేడు ప్రస్తావిస్తానన్న ప్రతిపక్ష నేత
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంపై టీడీఎల్‌పీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికార పక్షం నియంతృత్వంగా వ్యవహరిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రధా న ప్రతిపక్షం ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డితో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల అంశం, ఎమ్మెల్సీల విలీనంతో పాటు మాల, మాదిగ, మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే అంశాలను తెరపైకి తెచ్చినందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.
ఈ అంశాలపై స్పీకర్, మండలి చైర్మన్, గవర్నర్‌ను కలసి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. స్పందించిన జానారెడ్డి మంగళవారం టీడీపీ సభ్యుల సస్పెన్షన్ విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ పక్ష నాయకుడు లక్ష్మణ్‌నూ కలవాలని జానారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు.