Time Travel: Mysterious Zanetti Train Disappeared With 104 Passengers In Italy - Sakshi
Sakshi News home page

Zanetti Train Mystery Story: వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..

Published Sun, Dec 5 2021 7:31 PM | Last Updated on Mon, Dec 6 2021 3:39 PM

Italys Mysterious Train Disappeared With Passengers - Sakshi

మనిషి మేధస్సుకి అందని ఈ సృష్టి.. ఓ అస్పష్టమైన అధ్యాయం. గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటూ ప్రయాణించడమే మనకి తెలిసిన తర్కం. అయితే ఊహలను సైతం వణికించే కొన్ని విషయాలను విశ్లేషించే కంటే విస్మరించడమే మేలంటారు అనుభవజ్ఞులు. ఏలియన్స్, టైమ్‌ ట్రావెల్, పునర్జన్మలు, ఆత్మలు ఇవన్నీ అలాంటివే. ‘గ్రహాంతరవాసుల రాక, చనిపోయినవారు తిరిగి జన్మించడం, ఆత్మకు మరణం లేదనుకోవడం వంటివాటికి అంతో ఇంతో ఆధారాలు కనిపించినా టైమ్‌ ట్రావెల్‌ మాత్రం కంప్లీట్‌గా íఫిక్షన్‌కి, సినిమాలకు మాత్రమే పరిమితం’ అనుకుంటే పొరబాటే.

ఎందుకంటే దాన్ని నిర్ధారించే కొన్నిపేజీలను నూటా డెబ్భై ఆరేళ్ల కిందటే చరిత్ర భద్రపరచింది. ‘ఆదిత్య 369’ సినిమా చూసే ఉంటారుగా? ప్రస్తుతం నుంచి గతానికి, గతం నుంచి భవిష్యత్‌కి వెళ్లడమే ఆ కథసారాంశం. అలాంటిదే ఇటలీలో సరిగ్గా నూట పదేళ్ల కిందట జరిగింది. అది కథ కాదు నిజం! ఇంతకుముందే నూట డెబ్భైఆరేళ్లు అని, ఇప్పుడు నూట పదేళ్లు అంటారేంటీ? అని డౌటనుమానం వద్దు. ఈ కథనాన్ని పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది.

ట్రైన్‌ మిస్సింగ్‌
నూట పదేళ్ల కిందట అంటే 1911లో ఇటలీలోని జనెటి అనే కంపెనీ.. మూడు బోగీల న్యూ మోడల్‌ ట్రైన్‌ను ప్రవేశపెట్టి, ‘ఉచిత ప్రయాణం చేసేవాళ్లకు ఇదే అరుదైన అవకాశం’ అంటూ ప్రకటించింది. ఉత్సాహవంతులు ఎగబడ్డారు. వంద మంది ప్రయాణికులు.. ఆరుగురు రైల్వే సిబ్బందితో మొత్తం నూటారు మంది రోమ్‌ నగరం నుంచి ఆ ట్రైన్‌లో బయలుదేరారు. దారిలో ఓ పర్వత ప్రాంతం మీదుగా పోతున్న ఆ ట్రైన్‌.. ఒక కిలోమీటరు పొడవున్న సొరంగంలోకి ప్రవేశించింది.

అంతే, ఆ తర్వాత ఆ ట్రైన్‌ మరో స్టేషన్‌ని చేరుకోలేదు. కనీసం ఆ సొరంగాన్ని కూడా దాటలేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన రైల్వే అధికారులు సొరంగాన్ని చేరి, కిలోమీటరు పొడవునా అణువణువూ గాలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు.

పోనీ ఆ సొరంగానికి మరో మార్గం ఉందా అంటే, అదీ లేదు. ‘అయినా ఏదో కుక్కపిల్ల మిస్‌ అయినట్లు నూటారు మంది ఉన్న ట్రైన్‌ ఎలా మిస్‌ అవుతుంది? కనిపించకుండా పోవడానికి చిన్న వస్తువేం కాదు కదా?’ ఇవే ప్రశ్నలు నాటి పత్రికలను, అక్కడి మహా మహా మేధావులను, ఉన్నతాధికారులను తలలు పట్టుకునేలా చేశాయి.

సరిగ్గా అప్పుడే ఆ ట్రైన్‌ నుంచి బయటపడిన ఇద్దరు ప్రయాణికుల సమాచారం తెలిసింది. ఆ ఇద్దరూ భయంతో రైలు నుంచి దూకేశారని తేలింది. మరి మిగిలిన నూట నాలుగు మంది ఏమయ్యారు? మూడు బోగీల ట్రైన్‌ ఎక్కడికి వెళ్లింది?

రైలు నుంచి దూకిన  ఆ ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆసుపత్రిలో చేరారు. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చికిత్స అనంతరం ఆ ఇద్దరిలో ఒకతను నోరు విప్పాడు. అసలు విషయం బయటపెట్టాడు. ఆ రోజు రైలు సొరంగంలోకి ప్రవేశించగానే తెల్లని పొగ కమ్మేసిందని, రైల్లో ఉన్నవాళ్లంతా పెద్దపెద్దగా అరవడం విని భయంతో బయటకు దూకేశామని, ఆ తర్వాత రైలు ఏమైందో తెలియదని చెప్పాడు. అతడు చెప్పింది విని చిన్నపాటి ఆశతో మరోసారి ఆ సొరంగాన్ని శోధించారు అధికారులు. ఫలితం లేదు.

అరవై ఆరేళ్లు వెనక్కి..
1911లో మిస్సయిన నూట నాలుగు మంది ప్రయాణికులు.. 1845 సంవత్సరానికి చేరుకున్నారనే ఓ రిపోర్ట్‌ 1926లో అంటే ట్రైన్‌ మిస్‌ అయిన పదిహేనేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది విన్న యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి మెక్సికో అధికారిక సమాచారం ప్రకారం 1845 సంవత్సరంలో ఆ నూట నాలుగు మంది ప్రయాణికులు.. ‘మేమంతా ఇటలీలోని రోమ్‌ నుంచి జనెటి ట్రైన్‌లో ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు.

అయితే పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో–ఇటలీల మధ్య రైల్వే మార్గం లేదు. సముద్రయానం తప్ప మరో దారే లేదు. అలాంటిది.. ‘మేమంతా ఇటలీ నుంచి రైల్లో వచ్చాం’ అని చెప్పడంతో అక్కడ అధికారులు వాళ్లని పిచ్చివాళ్లుగా భావించి మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఆ తర్వాత కూడా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మెక్సికో అధికారులు.. ఇటలీ అధికారులని సంప్రదించారు.

అయితే, అది 1845వ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ‘1911 ట్రైన్‌ మిస్సింగ్‌’ ఘటన ఇటలీలో చోటుచేసుకోలేదు. దాంతో ఆ నూట నాలుగు మంది తమ దేశం వాళ్లు కాదని, అలాంటి ట్రైన్‌ తమ వద్ద లేనే లేదని తేల్చేసింది ఇటలీ. ఆ నూట నాలుగు మందిలో ఒక వ్యక్తి దగ్గర ‘డన్హిల్‌’ కంపెనీకి చెందిన సిగార్‌ పెట్టె దొరికింది. దాని మీద ‘1907’ సంవత్సరం ప్రింట్‌ అయ్యి ఉండటం ఆశ్చర్యం.

అయితే ఈ ట్రైన్‌ రష్యా, జర్మనీ, రుమేనియా, ఇటలీతో పాటు ఇండియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ మాయమవుతూ ఉందని, 1991లో ఉక్రేయి¯Œ లోని పోల్టావాలోనూ ఈ రైలు కనిపించిందని, ఆత్మలపై పరిశోధనలు చేసే ఓ వ్యక్తి ఈ రైలులోకి దూకాడని, ఆ తర్వాత మళ్లీ అతడు కనిపించలేదని, ఇదో ఘోస్ట్‌ ట్రైన్‌ అని హడలెత్తించే పలు కథనాలు పుకారులుగా నేటికీ షికార్లు చేస్తున్నాయి.

అయితే 1911లో ఇటలీలో ట్రైన్‌తో సహా మిస్‌ అయిన నూట నాలుగు మంది.. అరవై ఆరేళ్లు వెనక్కి వెళ్లి, 1845లో మెక్సికోలో ప్రత్యక్షం కావడమేంటీ? పైగా వారి దగ్గర 1907 సంవత్సరం నాటి సిగార్‌ ప్యాకెట్‌ దొరకడమేంటి? అనేది నేటికీ మిస్టరీనే.

సంహిత నిమ్మన
జనెటి ట్రైన్‌ని మాయం చేసిన ఆ సొరంగం.. ప్రపంచయుద్ధ సమయంలోని వైమానిక దాడుల్లో నాశనం అయింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో నేటికీ ఆ ట్రైన్‌ మోడల్‌ ప్రదర్శనకు ఉంది. ఇక ఆ ట్రైన్‌లో లభించిన 1907 నాటి సిగార్‌ ప్యాకెట్‌ని ఇప్పటికీ మెక్సికోలోనే భద్రపరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement