స్వీటీ... ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘ఉమెన్స్ ఫిల్మ్ యూనిట్’లో కొన్నేళ్లపాటు పాటు పనిచేసింది. లైంగిక దాడిపై కథను రాసి ‘ఆఫ్టర్ అవర్స్’ సినిమాను తీసింది. ఒకపక్క సినిమాలు తీస్తూనే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. డ్యాన్సింగ్ డేజ్ అనే షో, ఎపిసోడ్ డైరెక్టర్‌గానూ, ఇతర షోల సీరీస్‌లను విజయవంతంగా నడిపించింది. జెయిన్ సినిమాల్లో మహిళ కేంద్రబింధువుగా ఉంటుంది. 1989లో తొలిసారి ‘స్వీటీ’ అనే ఫీచర్ ఫిల్మ్ తీసింది. ఈ సినిమా ఆద్యంతం మంచి కామెడీతో సాగడంతో ప్రేక్షకాదరణ పొంది అనేక అవార్డులను గెలుచుకుంది.
బాల్యంలో దాదాపు చిన్నారులంతా అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల దగ్గర కథలు వింటూ పెరుగుతారు. వయసు పెరిగే కొద్దీ చదువులు, ఆటల్లో పడిపోయి విన్న కథలను మర్చిపోతారు. పెద్దయ్యాక కెరీర్‌ను అందంగా మలుచుకోవడంలో మునిగిపోయి పూర్తిగా కథలను వదిలేస్తారు. అందరిలా చిన్నారి జెయిన్ చిన్నప్పుడు విన్న కథలను వదల్లేదు. అందరికంటే భిన్నంగా ఆలోచించే జెయిన్ తను విన్న కథలు, చదివిన కథలను మరింత లోతుగా ఊహించుకుంటూ పెరిగింది. పెద్దయ్యాక ఆ కథలకు తన ఊహా శక్తిని జోడించి ఏకంగా అవార్డు తెచ్చిపెట్టే సినిమాలు తీసి మంచి దర్శకురాలిగా ఎదిగింది. జెయిన్ మరెవరో కాదు.. రెండు సార్లు ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా నామినేట్ అయ్యి.. ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న మూడో మహిళా దర్శకురాలే 67 ఏళ్ల జెయిన్ క్యాంపియన్.
న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో 1954 ఏప్రిల్ 30న రిచర్డ్ క్యాంపియన్, ఎడిత్ ఆర్మ్‌స్ట్రాంగ్ దంపతులకు జెయిన్ క్యాంపియన్ జన్మించింది. రిచర్డ్ థియేటర్ డైరెక్టర్, ఎడిత్ నటి. వీరికి ముగ్గురు సంతానం. రెండో కూమార్తె జెయిన్ క్యాంపియన్ పూర్తిపేరు ఎలిజిబెత్ జెయిన్ క్యాంపియన్. చిన్నప్పుడు అందరిలా కథలు వింటూ పెరిగింది జెయిన్. స్కూల్లో ఉండగా అనేక కథల పుస్తకాలను చదివేది. ఇంట్లో సినిమా, నటనా వాతావరణం ఉండడంతో సహజంగానే నటన వైపు ఆకర్షితురాలైంది జెయిన్. కానీ నటనను కెరీర్‌గా ఎంచుకోలేదు. విక్టోరియా యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఆంథ్రోపాలజీలో డిగ్రీ పూర్తిచేసిన తరువాత పెయింటింగ్ ప్రధాన సబ్జెక్టుగా మరో డిగ్రీ చేసింది.
డిగ్రీ చేసిన తరువాత తన ఆసక్తి దర్శకత్వంవైపు మళ్లింది. దీంతో వెనిస్ వెళ్లి ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. తర్వాత లండన్‌లోని డాక్యుమెంటరీలు, కమర్షియల్ సినిమాలు తీసే ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. అసిస్టెంట్‌గా పనిచేస్తూనే చెల్సియా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివింది. తరువాత సిడ్నీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఈ డిప్లొమా అయ్యాక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 1980లో తొలిసారి ‘టిష్యూస్’ పేరిట ఓ లఘు చిత్రం తీసింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో మరుసటి ఏడాది ఆస్ట్రేలియన్ ఫిల్మ్ టెలివిజన్, రేడియో స్కూల్లో చేరి రచయిత, దర్శకురాలు, ఎడిటర్‌గా అన్నీ తానై తండ్రి కొడుకుపై చూపించే క్రమశిక్షణ, బాధ్యతల్లో ఇద్దరు పడే సంఘర్షణను ‘పీల్’(1982) పేరిట సినిమా తీసింది. దీని తరువాత అమ్మాయిల ఫ్యాషన్‌పై రెండో సినిమా, అన్నా చెల్లెళ్ల బంధంపై మూడో సినిమాను నిర్మించింది. పీల్ సినిమాకు 1986లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘పామ్ డి ఓర్’ అవార్డు వచ్చింది.
తొలిఆస్కార్ నామినేషన్
1993లో ‘ద పియానో’ సినిమా తీసింది జెయిన్. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌ల్లో ‘పామ్ డీఓర్’ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి మహిళగా జెయిన్ నిలిచింది. ఈ అవార్డుతోపాటు ‘బెస్ట్ యాక్టర్, బెస్ట్ సహాయ నటి’ అకాడమీ అవార్డులను ఈ సినిమా గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాకు జెయిన్ ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి నామినేట్ అయినప్పటికీ, స్పీల్‌బర్గ్ బెస్ట్ డైరెక్టర్‌గా నిలవడంతో జెయిన్‌కు అవార్డు రాలేదు. కానీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డు దక్కించుకుంది జెయిన్. జెయిన్ దర్శకత్వం వహించిన టాప్ ఫైవ్ సినిమాలలో.. ద పియానో, యాన్ ఏంజిల్ ఎట్ మై టేబుల్, బ్రైట్ స్టార్, స్వీటీ, ద పోర్టరేట్ ఆఫ్ ఏ లేడీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండోసారి 94వ ఆస్కార్ అవార్డులకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు నామినేట్ అయ్యి ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకుంది.
తొలిసారి 2010లో క్యాథరిన్ బిగెలో ‘హర్ట్ లాకర్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుని తొలి మహిళా డైరెక్టర్‌గా రికార్డు సృష్టించింది. గతేడాది ‘నోమాడ్ ల్యాండ్’ సినిమాకు గాను క్లో జావో ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకోని రెండో మహిళగా నిలిచింది. ఇప్పుడు జెయిన్ మూడో బెస్ట్ డైరెక్టర్‌గా నిలిచారు.
ఆస్కార్‌ను జయించింది
Published Tue, Mar 29 2022 3:39 AM | Last Updated on Tue, Mar 29 2022 5:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment