డిగ్రీ పట్టా చేతిలో పడగానే ఉద్యోగం వెదుక్కుంటారు చాలామంది. జావెద్ అలా చేసి ఉంటే...అందరిలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడేమో. కాని ఈ కుర్రాడు కంపెనీ మొదలుపెట్టాడు. బంపర్‌హిట్ కొట్టి ‘భలే’ అనిపించుకున్నాడు... ముంబైలోని మురికివాడలో పుట్టి పెరిగాడు జావెద్ ఉస్మాన్ ఖాత్రీ.
నాన్న కార్పెంటర్. అమ్మ గృహిణి. జావెద్ కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్న రోజు ఆ ఇంటివాళ్ల ఆనందం అంబరాన్ని తాకింది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది...కస్టర్డ్. చదువు పూర్తయిన తరువాత జావెద్ తన స్కూల్‌ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ముంబై కేంద్రంగా ‘కస్టర్డ్’ పేరుతో ప్రాడక్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ కంపెనీ మొదలు పెట్టాడు.
దీనికి తానే సీయివో. ఈ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, వెబ్‌అప్లికేషన్ డెవలప్‌మెంట్, మొబైల్ డిజైన్, ఏఆర్,వీఆర్,యుఎక్స్ డిజైన్....మొదలైన విభాగాల్లో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుంది. ‘పుస్తకం హస్తభూషణం’ అంటారు.
బెన్ హరోవిజ్ రాసిన ‘ది హర్డ్ థింగ్స్ ఎబౌట్ హార్డ్‌థింగ్స్’ పుస్తకం తన చేతికి ‘భూషణం’ అయిందో లేదోగానీ తనను చేయిపట్టి నడిపించింది. ఈ పుస్తకంలో ఎన్నో మాటలు తనకు సక్సెస్‌రూట్‌ని చూపించాయి. వాటిలో కొన్ని... ‘వ్యాపారంలో అతి ముఖ్యమైన పాఠం....పోరాటానికి భయపడి పారిపోవడం కాదు. దాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం’
‘ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉత్సాహం కంటే, అది ఏ టైమ్‌లో ఎప్పుడు స్టార్ట్ చేయాలనే ఆలోచన ముఖ్యం’ ‘నీకు రెండు రకాల స్నేహితులు అవసరం. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఆ సంతోషం తమదే అనుకునేవారు. రెండోరకం...నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్‌కాల్‌తో నీ ముందు ఉండేవారు’ ‘కొన్ని సమయాల్లో సంస్థలకు కావాల్సింది సమస్యకు పరిష్కారం కాదు. ఆ సమస్య పట్ల స్పష్టత’
‘మీరు చేయగలిగిన వాటిపై జీరో సమయాన్ని కేటాయించండి. మీరు చేయదలిచిన వాటిపై ఎక్కువ సమయం కేటాయించండి’
‘మనల్ని మనం ప్రశ్నించుకునేది ఒకటే...నేను ఏంచేయకూడదు అని’
∙∙∙
ఎలక్ట్రిక్ టూ–వీలర్ మోబిలిటీ ప్లాట్‌పామ్ ‘ఇ–బైక్ గో’ కస్టర్డ్ కంపెనీని 14.7 కోట్లతో సొంతం చేసుకుంది. దీని ద్వారా డెలివరీ దిగ్గజాలు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్...మొదలైన వాటితో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎంఎస్(ఫ్లిట్ మేనెజ్‌మెంట్ సిస్టమ్) నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇ– బైక్‌గో.
పెట్రోల్ ఆధారిత టూ–వీలర్స్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ అమ్మకం కావడానికి గల కారణాలలో ఒకటి...అవి ఐఓపీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)తో కనెక్ట్ కాకపోవడం. ‘కస్టర్డ్’ అందించిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇ–బైక్‌గో తమ ఎలక్ట్రిక్ వాహనాలను స్మార్ట్ కనెక్టింగ్ వెహికిల్స్‌గా మారుస్తుంది. ఈ టెక్నాజీతో వాహనాల బాగోగులు (వెహికిల్ హెల్త్)ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలవుతుంది.
భవిష్యత్‌లో పర్యావరణహితమైన సాంకేతిక పరికరాలపై దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడు జావెద్. ‘భూగోళాన్ని రక్షించుకుందాం...నినాదంతో అడుగులు వేస్తున్న బృందం మాది. మేము రాసే ప్రతి కోడ్, మేము డిజైన్ చేసే ప్రతి పిక్సెల్, ఫీచర్....గ్రీన్‌ఫ్యూచర్ కోసమే’ అంటున్నాడు 28 సంవత్సరాల జావెద్ ఖాత్రీ.
చదవండి: Thati Munjalu Health Benefits: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా!
Comments
Please login to add a commentAdd a comment