రోడ్డు పక్కన వేడివేడి పకోడీ, మిరపకాయ బజ్జీ, సమోసా మొదలుకుని మంట కింద మసాలా దాకా. ఇలా బయట ఏం తిన్నా మనలో చాలామందికి కాస్త ఉప్పు గట్టిగా పడాల్సిందే. ఇంట్లో కూడా కూరలు మొదలుకుని తెలుగు వారికే ప్రత్యేకమైన నానా రకాల పచ్చళ్ల దాకా అన్నింట్లోనూ ఉప్పు కాస్త ఎక్కువగా వేయనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా సగటు భారతీయుడు రోజూ ఎడాపెడా ఉప్పు తినేస్తున్నాడట.
ఈ క్రమంలో నిర్ధారిత మోతాదును ఎప్పుడో దాటేశాడని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది...ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఆహారంలో రోజుకు 5 గ్రాములు, అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారతీయులు మాత్రం రోజుకు ఏకంగా 8 గ్రాములు లాగించేస్తున్నారు! జర్నల్ నేచర్ పోర్టుఫోలియో తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది.
ఇలా చేశారు...
- జాతీయ అంటేతర వ్యాధుల పర్యవేక్షణ సర్వేకు సేకరించిన శాంపిల్‌నే ఈ సర్వేకు ఆధారంగా తీసుకున్నారు.
- వారిలో 3,000 మంది వయోజనులను రాండమ్‌గా ఎంచుకున్నారు.
- ఉప్పులో కీలకంగా ఉండే సోడియం మోతాదు వారి మూత్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించారు.
- అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని పోల్చి చూశారు.
- వారందరూ మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది!
సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...
- అన్ని సామాజిక వర్గాల వారూ ఉప్పు చాలా ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులదే పైచేయి.
- మహిళలు రోజుకు 7.9 గ్రాముల ఉప్పు తింటుంటే పురుషులు 8.9 గ్రాములు లాగిస్తున్నారు!
- ఉద్యోగులు 8.6 గ్రాములు, పొగ తాగేవారు 8.3 గ్రాములు, హై బీపీ ఉన్నవారు 8.5 గ్రాముల ఉప్పు తింటున్నారని తేలింది.
- ఇక ఊబకాయులైతే ఏకంగా రోజుకు 9.3 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు.
- వీరితో పోలిస్తే నిరుద్యోగులు, పొగ తాగని వారు, బీపీ, ఊబకాయం లేనివారు ఉప్పు తక్కువ తీసుకుంటున్నట్టు తేలడం విశేషం!
సోడియం కథా కమామిషు...
- నరాలు, కండరాల పనితీరుకు సోడియం చాలా అవసరం. అలాగని ఒంట్లో దాని స్థాయి మితిమీరకూడదు కూడా.
- ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి.
- అంతకంటే ఎక్కువైతే హైబీపీ, హైపర్ టెన్షన్
- వంటివాటికి దారితీస్తుంది.
- సోడియం పరిమాణం తక్కువగా ఉన్న ఉప్పు తినడం ఆరోగ్యవంతులకు మంచిదే. కానీ షుగర్ పేషెంట్లు,
- హృద్రోగులు తదితరులకు రక్తంలో హెచ్చు పొటాషియం హైపర్ కలేమియాకు దారి తీస్తుంది. దానివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేగాక పల్స్, గుండె కొట్టుకునే వేగం కూడా పడిపోతాయి!
- సోడియం ఎక్కువగా ఉండే తిండి హై బీపీ, హైపర్ టెన్షన్ రిస్కును బాగా పెంచుతుందని ఈ అధ్యయనం మరోసారి తేల్చింది.
- అవి చివరికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి దారితీసి ప్రాణాంతకంగా మారతాయి.
- అందుకే ఆరోగ్యవంతులైనా, మరొకరైనా ఆహారంలో ఉప్పు మోతాదు వీలైనంత తగ్గించడమే మంచిది.ళీ ‘మనమంతా ఆహారంలో ఉప్పును రోజుకు కనీసం 1.2 గ్రాముల మేరకు తగ్గిస్తే చాలు. హైబీపీ కేసులు సగానికి సగం తగ్గిపోతాయి! కనుక ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై అందరిలోనూ, ముఖ్యంగా భారతీయుల్లో అవగాహన పెరిగేలా ప్రచార తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది’
– డాక్టర్ ప్రశాంత్ మాథుర్, అధ్యయనకర్త, డైరెక్టర్,
ఐసీఎంఆర్– నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment