డిస్ మార్ఫియా
అందంగా లేనా? అస్సలేం బాలేనా?
ప్రసిద్ధ దర్శకుడు కరణ్ జోహార్ తాను ‘డిస్‌మార్ఫియా డిజార్డర్’తో బాధపడుతున్నానని తెలిపాడు. శరీరంలోని ఏదో ఒక అవయవం పట్ల వ్యక్తిలో తీవ్రమైన అసంతృప్తి ఉండి అది సరిగా లేదని పదే పదే బాధపడటమే ఈ డిజార్డర్. యువతీ యువకుల్లో టీనేజీ కాలంలో ఇదిపాదుకుంటే మున్ముందు వారు సామాజిక జీవితంలో ఇబ్బందిపడాల్సి ఉంటుంది. తగిన కౌన్సెలింగ్‌తో దీని నుంచి బయటపడొచ్చు.
ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒక టీనేజ్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి అందరూ భావించేటట్టుగా ‘అందం’గా ఉంది. చర్మం రంగు, రూపం, హైట్ అన్నీ బాగున్నాయి. కాని ఆ అమ్మాయికి ‘నా ముక్కు బాగా లేదు’ అని సందేహం, అనుమానం, అదే నిజం అనిపించే అబ్సెషన్. ఆ ముక్కును ఎలా అందంగా చేయించాలి అనేదే ఆమె సమస్య. ‘కాదు నీ ముక్కు చక్కగా ఉంది. నువ్వు అనుకున్నంత లోపం ఏ మాత్రం లేదు’ అని వీరికి చెప్తే ఒక నిమిషం తెరిపిన పడతారు.
మరో నిమిషంలోనే ఆ అనుమానం పెనుభూతంలా ముందుకొస్తుంది. ఈ రుగ్మతను ‘బాడీ డిస్‌మార్ఫియా డిజార్డర్’ అంటారు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌లో ఒక కోవ కిందకు వస్తుంది. ఇది ఉన్నట్టుగా చాలామందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కరణ్ జోహార్ దీని గురించి మాట్లాడి తాను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు చెప్పాడు. అందుకే నేను లూజ్ బట్టలు ధరిస్తాను’ అని తెలిపాడు.
మైఖేల్ జాక్సన్ కూడా
డిస్‌మార్ఫియా డిజార్డర్‌తో బాధపడిన వాళ్లలో మైఖేల్ జాక్సన్ ఒకడు. అతనికి తన ముక్కు నచ్చలేదు. దాని వల్ల లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేసి చివరకు ప్లాస్టిక్ ముక్కు అంటించాల్సి వచ్చింది. మగవారికి తమ జుట్టు, కళ్లు, భుజాలు, పురుషాంగం, పిరుదులు... వీటిలో ఏదో ఒకటి అస్సలు బాగలేదనే భావన బాల్యంలోనో టీనేజీలోనో స్థిరపడి΄ోతుంది. ఆడవాళ్లకు తమ కళ్లు, ముక్కు, పెదవులు, ఒంటి రంగు... వీటిలో ఏదో ఒక అవయవం గురించి అసంతృప్తి ఏర్పడుతుంది. నిజానికి లోకంలో ఎవరూ చెక్కినట్టుగా ఉండరు.
ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నా తమదైన రూపంతో బాగానే ఉంటారు. అయితే డిస్‌మార్ఫియా డిజార్డర్‌లో చూడటానికి మెరుగ్గా ఉన్నా, అంతపెద్ద లోపం ఏదీ లేక΄ోయినా వారి మైండ్ ‘నీ ఫలానా అంగం ఏం బాగ లేదు బాగలేదు’ అని చెప్తూ ఉంటుంది.
మిర్రర్ చెకింగ్
ఈ డిజార్డర్‌తో బాధపడేవాళ్లు తమకు లోపం ఉందని భావిస్తూ బట్టలతో, ఆభరణాలతో దానిని కవర్ చేసుకుంటున్నామని అనుకుంటూనే పదే పదే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. లేదా ఎదుటివారిని ‘బాగున్నానా బాగలేనా?’ అని అడుగుతూ విసిగిస్తూ ఉంటారు. ‘బాగున్నావ్’ అన్నా నమ్మరు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మటిక్ సర్జరీలు చేయించుకున్నా వీరికి సంతృప్తి కలగదు. ఎందుకు? సమస్య మైండ్‌లో ఉంది కాబట్టి. ఈ సమస్య ఉన్నవారు కాలక్రమంలో నలుగురినీ కలవని స్థితికి చేరుకుంటారు.
కౌన్సెలింగ్
డిస్‌మార్ఫియా డిజార్డర్‌తో బాధ పడేవారు ముందు చేయవలసిన పని తమ యథాతథ రూపాన్ని యాక్సెప్ట్ చేయడం. ‘నేను నా రూపాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను’ అని పదే పదే చెప్పుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదా సైకియాట్రిస్ట్‌లను కలిస్తే వారు కౌన్సెలింగ్‌తో సమస్యను దూరం చేస్తారు. లేదా మరీ పదే పదే అందుకు సంబంధించి నెగెటివ్ థాట్స్ వస్తుంటే మందులతో చికిత్స చేస్తారు. ప్రకృతిలో ప్రతి ప్రాణి భిన్నమైన రూపాలతో ఉంటారని తెలుసుకుంటే శారీరక లోపాకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలు దరి చేరవు.
Comments
Please login to add a commentAdd a comment