స్త్రీ టాయ్‌లెట్’ బస్సు
కర్ణాటక రాష్ట్రం మహిళల సౌకర్యం కోసం ఒక వినూత్న ప్రయోగం చేసింది. పాతబడిపోయిన ఆర్‌టీసీ బస్సులను వాష్‌రూములుగా మార్చింది. వీటికి ‘స్త్రీ టాయిలెట్’ పేరు పెట్టింది. ఒక్కో బస్సులో మూడు వెస్టర్న్, మూడు ఇండియన్ టాయిలెట్‌లు ఉంటాయి. ముఖం కడుక్కోవడానికి వీలుగా వాష్ బేసిన్‌లు కూడా ఉన్నాయి. చంటి పిల్లల తల్లులకు ఉపయోగకరంగా పిల్లలకు పాలివ్వడానికి, డయాపర్‌లు మార్చడానికి వీలుగా మరొక అమరిక కూడా ఉంది. వీటితోపాటు పీరియడ్స్ సమయంలో ఉన్న మహిళలకు నాప్‌కిన్ వెండింగ్ మెషీన్ (డబ్బులు వేస్తే నాప్‌కిన్ వస్తుంది), నాప్‌కిన్ ఇన్‌సినేటర్ (భస్మం చేసే మెషీన్) కూడా ఉంది. ఈ బస్సు నిర్వహణకు అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసం బస్సు పై భాగంగా సోలార్ ప్యానెల్ ఉంది.
బస్సులోపలికి వెళ్లినప్పుడు లైట్లు వేసి, బయటకు వచ్చేటప్పుడు ఆపకుండా మర్చిపోవడం వంటి ఇబ్బంది లేకుండా సెన్సార్‌లు ఏర్పాటు చేశారు. మనిషి లోపలికి వెళ్లినప్పుడు లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. మనిషి బయటకు రాగానే ఆరిపోతాయి. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ బస్సులను మొదట బెంగళూరు నగరంలోని మెజిస్టిక్ బస్‌స్టాండ్‌లో పెట్టింది. మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. బస్సుగా నడపడానికి వీల్లేని, తుక్కు ఇనుము కింద అమ్మేయాల్సిన పరిస్థితి లో ఉన్న బస్సులను ఇలా ఉపయుక్తంగా మలిచింది కర్ణాటక ప్రభుత్వం. బస్సు లోపల పై ఏర్పాట్ల కోసం ఒక్కో బస్సుకు పన్నెండు లక్షలు ఖర్చయింది.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీ యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతమై తీరుతుందని ఉద్యోగినులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాన్ని మన తెలుగమ్మాయి సుష్మ గత ఏడాది హైదరాబాద్‌లో చేపట్టింది. ఆమె ఆటోలో నమూనా మొబైల్ టాయిలెట్‌ను తయారు చేసి, పాతబడిన బస్సును ఉపయోగించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ రిపోర్టు కూడా అందచేసింది. సుష్మ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి, ఇండియాకు వచ్చిన తర్వాత సమాజానికి తనవంతుగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఈ రకంగా నిర్వర్తిస్తు్తన్నట్లు చెప్పింది.
కోఠీ వంటి మార్కెట్ ప్రదేశాల్లో టాయిలెట్‌లు లేక మహిళలు ఇబ్బంది పడడం తనకు అనుభవపూర్వకంగా తెలుసని, ఆ సమస్యకు పరిష్కారంగా మొబైల్ టాయిలెట్‌లకు రూపకల్పన చేశానని చెప్పిందామె. సుష్మ తన సొంతూరు కోదాడలో మొబైల్ టాయిలెట్ ఆటోను జనానికి పరిచయం చేసింది. సుష్మ ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించే లోపు కటక ఓ ముందడుగు వేసింది. అయితే ఇందులో తొలి రికార్డు మాత్రం తెలుగమ్మాయి సుష్మదే.
Comments
Please login to add a commentAdd a comment