‘చెట్టును కొట్టి గోడ కట్టకూడదు’ మనిషి తన మనుగడ కోసం ప్రకృతి బీభత్సాన్ని సృష్టించకుండా ఉండడానికి చెప్పిన సూక్తి ఇది. ఇల్లు కట్టుకోవడానికి చెట్లు లేని నేలను చూసుకోవాలి తప్ప పచ్చగా ఎదిగిన చెట్లను మొదలు వరకు నరికేసి, వేళ్లను పెకలించి వేసి నేలను చదును చేసి ఇల్లు కట్టుకునే అరాచకత్వాన్ని అరికట్టడానికి చెప్పిన మంచిమాటే గోడ కట్టడానికి చెట్టును కొట్టకూడదు అనేది. మనిషి నాగరికుడయ్యే కొద్దీ ప్రకృతిని విచక్షణ రహితంగా వాడడం కూడా పెరిగిపోయింది. కాగితం తయారు కావడం మనిషి పరిణామక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పుడు ఆ కాగితమే మనిషి మనుగడను ప్రశ్నార్థకంలో పడేయడానికి ఒక హేతువు కానుంది. ఒక దేశం రోజుకు ఎంత పేపర్ వాడుతోంది, ఆ కాగితం తయారీకి ఎన్ని చెట్లు ప్రాణాలర్పిస్తున్నాయి, చెట్టు గుజ్జు నుంచి కాగితం తయారు కావడానికి ఎంత నీరు ఖర్చవుతోంది... వంటివన్నీ లెక్కవేసింది కావ్య. ఆ కాగితాల్లో గ్రంథాలుగా మారి బీరువాల్లో భద్రంగా ఉండే కాగితాలెన్ని? చిత్తు లెక్క రాసి నలిపి పారేసేవెన్ని? గ్రంథానికి మంచి కాగితం కావాల్సిందే. చిత్తు లెక్క, అట్టముక్క కోసం కూడా చెట్టును నరకడం ఏమిటి? అనుకుందామె. చెట్లను కాపాడుకోవాలి, కాగితమూ కావాలి. అందుకే పచ్చదనానికి హాని కలగకుండా కాగితం తయారు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.
ప్రకృతి ప్రేమ
కావ్య మాదప్ప బెంగళూరు, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. నెదర్లాండ్ ఆధారిత అంతర్జాతీయ బ్యాంకులో ఉద్యోగం చేసింది. పారిశ్రామిక వేత్తగా ఎదగాలనే తన ఆకాంక్షను నిజం చేసుకోవడానికి 2005లో ఇండియాకి వచ్చేసింది. రాగానే సొంతూరు కూర్గ్‌లో ‘ఆమన్‌వన’ పేరుతో స్పా రిసార్ట్‌ను ప్రారంభించింది. ఆమె ప్రయత్నం విజయవంతమైంది. స్పా ప్రచారం కోసం తయారు చేస్తున్న బ్రోచర్‌లను చూసినప్పుడు వచ్చిన ఆలోచనే చెట్టు లేని కాగితం. నిజానికి ట్రీ ఫ్రీ పేపర్ ప్రయోగం కావ్యతో మొదలు కాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం కావ్య ఈ టెక్నాలజీని జైపూర్ నుంచి బెంగళూరుకు తెచ్చింది. ఇందుకోసం ఆమె 15 రోజుల పాటు జైపూర్‌లోని కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్‌స్టిట్యూట్‌లో పేపర్ తయారీని అధ్యయనం చేసింది. ‘‘కూర్గ్ అడవుల్లో పచ్చని ప్రకృతి మధ్య పెరిగిన దానిని, కాగితం కోసం పది– ఇరవై ఏళ్ల పాటు పెరిగిన చెట్టును అమాంతం నరికిపారేయడాన్ని తలుచుకుంటేనే ఆ గొడ్డలి నా గుండెల మీద పడినట్లు అనిపిస్తుంది. అందుకే ఈ ప్రయత్నం’’ అంటోంది కావ్య. ఆమె తన బ్లూ క్యాట్ పేపర్ పరిశ్రమలో రోజుకు ఐదువేల పేపర్ షీట్‌లను తయారు చేస్తోంది. కాగితం తయారీకి కలప గుజ్జునే వాడాల్సిన పని లేదనే సంగతిని పిల్లలకు తెలియచేయడానికి స్కూలు పిల్లలను ఫీల్డ్ విజిట్‌కు తన పరిశ్రమకు ఆహ్వానిస్తోంది.
కలప లేని కాగితం
కావ్య మాదప్ప కాగితం కోసం కలపకు బదులు... వస్త్ర పరిశ్రమలో పత్తిని దారం కోసం ఉపయోగించిన తర్వాత పనికి రాని వేస్ట్ మెటీరియల్‌ను సేకరిస్తోంది. వాటితోపాటు అవిసె గింజల పొట్టు, మల్బరీ ఆకుల ఈనెలు (పట్టు పురుగుల పెంపకంలో పురుగులకు ఆహారంగా మల్బరీ ఆకులను వేస్తారు. పురుగులు ఆకులను మాత్రమే తింటాయి. ఆ ఈనెలను సేకరిస్తోంది కావ్య), కొబ్బరి పీచు, మొక్కజొన్న కండెల పొట్టు, ధాన్యపు గడ్డి, నిమ్మగడ్డి, కాఫీ గింజల పొట్టు, అరటి గెల కాండం ఈ కాగితానికి ముడిసరుకు. ఈ కాగితంతో నోట్‌బుక్స్, క్యారీ బ్యాగ్‌లు, ఫోల్డర్‌లు, గిఫ్ట్ బాక్సులు, ఫొటో ఫ్రేములు, టేబుల్ మ్యాట్‌లు, కవర్లు, గ్రీటింగ్ కార్డులు, పెళ్లి కార్డులు, ల్యాంప్ షేడ్‌లు తయారు చేస్తారు.
ట్రీ ఫ్రీ పేపర్ ప్రయోగం చేసిన కావ్య... స్కూలు పిల్లలకు కాగితం తయారీని చూపిస్తూ...
Comments
Please login to add a commentAdd a comment