ఆమె జీవితం ఒక జటిలమైన లెక్క | Special Story About Shakuntala Devi From Bangalore | Sakshi
Sakshi News home page

‘శకుంతలా దేవి’ మూవీ రివ్యూ

Published Mon, Aug 3 2020 2:45 AM | Last Updated on Mon, Aug 3 2020 8:01 AM

Special Story About Shakuntala Devi From Bangalore - Sakshi

‘నేను చెట్టును కాను... ఉన్న చోటునే ఉండిపోవడానికి’ ‘ఏ ఊళ్లో అయినా నాలుగు రోజులు దాటితే నాకు బోర్‌ కొట్టేస్తుంది’ ‘నాకు కాళ్లున్నాయి.. ప్రపంచమంతా చుట్టేయాలని ఉంది’ శకుంతలా దేవిని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. జటిలమైన లెక్కల్ని సెకన్లలో తేల్చేసిన ఈ ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ జీవితం కూడా జటిలమైన లెక్క లాంటిదే. కూతురిగా, తల్లిగా, భార్యగా, జీనియస్‌గా ఆమె తన భావోద్వేగాలనే తాను విశ్వసించింది. ఎదుటివారితో ఇది ఘర్షణకు కారణమైంది. ఆమె బయోపిక్‌ ‘శకుంతలా దేవి’ ఆమె కథను చెబుతోంది. ‘రెండు జడలతో లెక్కలు చేసే’ ఒక భారతీయ జీనియస్‌ను పున:పరిచయం చేస్తుంది.

కుటుంబం కూడా భలే స్వార్థపూరితమైనది. ఎవరికైనా ఇంట్లో రెక్కలు మొలిచాయని గ్రహించిన వెంటనే ఇక అన్ని పనులు పక్కన పెట్టి అన్ని బరువులను ఆ మనిషి మీద వేయడానికి చూస్తుంది. ‘శకుంతలా దేవి’ జీవితంలో జరిగింది అదే. కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన మేధ ఆమెకు వచ్చింది. ఆమె మెదడులో గణితానికి సంబంధించిన అద్భుతమైన శక్తి ఏదో నిక్షిప్తమై ఉంది. అది ఆమె ఐదో ఏటనే బయట పడింది. ఆ క్షణం నుంచి ఆమె కుటుంబానికి ఒక ‘సంపాదించే లెక్క’ అయ్యిందే తప్ప ప్రేమను పొందాల్సిన సభ్యురాలు కాకపోయింది.

బెంగళూరు పసి మేధావి
శకుంతలా దేవి బెంగళూరులోని ఒక సనాతన ఆచారాల కన్నడ కుటుంబంలో పుట్టింది (1929). వాళ్ల నాన్న సర్కస్‌లో పని చేసేవాడు. ట్రిక్స్‌ చేసేవాడు. శకుంతలా దేవి మూడేళ్ల వయసులో కార్డ్‌ ట్రిక్స్‌ను గమనించేది. ఐదేళ్ల వయసు వచ్చేసరికి అర్థ్‌మెటిక్స్‌లో అనూహ్యమైన ప్రతిభను కనపరచడం మొదలెట్టింది. రెండు రూపాయల ఫీజు కట్టలేక డ్రాపవుట్‌ అయిన ఈ పసిపాప ఆ క్షణం నుంచి కుటుంబానికి జీవనాధారం అయ్యింది. తండ్రి ఆ చిన్నారిని వెంట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇప్పించి ఫీజు వసూలు చేసి కుటుంబాన్ని నడిపేవాడు. ఆమెను అతడు మరి స్కూలుకే పంపలేదు. శకుంతలాదేవికి స్కూల్‌ చదువు ఉండి ఉంటే ఆమె ఏయే సిద్ధాంతాలు కనిపెట్టేదో. కాని ఆమె సాటివారిని అబ్బురపరిచే గణిత యంత్రంగా ఆ మేరకు కుదింపుకు లోనయ్యింది.

తోబుట్టువు మరణం
తమ ఇళ్లల్లో స్త్రీలు ముఖ్యంగా తన తల్లి బానిసలా పడి ఉండటం, తండ్రిని ఎదిరించి తనను, తన తోబుట్టువులను బాగా చూసుకోలేకపోవడం గురించి శకుంతలాదేవికి జీవితాంతం కంప్లయింట్‌లు ఉన్నాయి. వికలాంగురాలైన తన పెద్దక్క సరైన వైద్యం చేయించకపోవడం వల్ల మరణించిందనీ, ఇందుకు తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని ఆమెకు ఆజన్మాంత ఆగ్రహం కలిగింది. ఆ అక్కతో శకుంతలాదేవికి చాలా అటాచ్‌మెంట్‌. ఆ అటాచ్‌మెంట్‌ పోవడంతో తల్లిదండ్రులతో మానసికంగా ఆమె తెగిపోయింది. అప్పటికే దేశంలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందిన శకుంతలా దేవి తన పదిహేనవ ఏట 1944లో లండన్‌ చేరుకుంది. 
లండన్‌ జీవితం
శకుంతలా దేవికి ఇంగ్లిష్‌ రాదు. చదువు లేదు. ఉన్నదల్లా గణిత విద్య. దాంతో ఆమె సర్కసుల్లో పని చేసి డబ్బు సంపాదించవచ్చు అనుకుంది. కాని రెండు జడలు వేసుకున్న ఒక స్త్రీ లెక్కలు చేయడం ఏమిటని, ఒక వేళ చేసినా అదేదో మేజిక్‌ లాంటిదే తప్ప మేధస్సు అయి ఉండదని చాలామంది నిరాకరిస్తారు. అప్పుడు పరిచయమైన ఒక స్పానిష్‌ మిత్రుడు శకుంతలా దేవిని అక్కడి పరిసరాలకు అవసరమైనట్టుగా గ్రూమ్‌ చేస్తాడు. అక్కడి యూనివర్సిటీలు ఆమెను పరీక్షిస్తాయి. అక్కడి సాధారణ ప్రజలు ఆమెను గుర్తిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా భారతీయ ఆహార్యాన్ని వదలకుండానే చీరలో పొడవైన కురులలో గణిత విద్యలు ప్రదర్శిస్తూ ఆమె విజేతగా నిలిచింది.

అనూహ్య ప్రతిభ
95,443,993 క్యూబ్‌రూట్‌ను 457గా ఆమె రెండు సెకన్లలో జవాబు చెప్పింది. 33 అంకెల సంఖ్యను ఇచ్చి దాని సెవెన్త్‌ రూట్‌ను చెప్పమంటే 40 సెకన్లలో జవాబు చెప్పి చకితులను చేసింది. ఇక 1980 జూన్‌లో ఆమె గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఆమెకు రెండు 13 అంకెల సంఖ్యల గుణకారం ఇస్తే 28 సెకెన్లలో జవాబు చెప్పి రికార్డు సాధించింది. గడిచిన శతాబ్దంలోని తేదీలు చెప్తే ఒక్క సెకనులో ఆమె ఆ తేదీన ఆ ఏ వారం వస్తుందో చెప్పేది. కొందరు సైంటిస్ట్‌లు ఉత్సాహం కొద్దీ ఆమె మెదడును పరిశీలించారుగాని ఏమీ కనిపెట్టలేకపోయారు. ఆ మేధ ఆమెకు మాత్రమే సొంతం.

బంధాల జటిలత్వం
సినిమాలో చూపిన కథ ప్రకారం ఆమెను గ్రూప్‌ చేసిన స్పానిష్‌ మిత్రుడు ఆమె లండన్‌లో గుర్తింపు పొందాక ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె కలకత్తాకు చెందిన ఒక ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ను 1960లో పెళ్లి చేసుకుంది. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె జన్మించింది. తన ప్రదర్శనలు, పర్యటనలు ఆపేసి కొంతకాలం శకుంతలాదేవి కలకత్తాలో ఉండిపోయినా ఆమెకు అలా ఉండిపోవడం తీవ్ర అశాంతి కలిగిస్తుంది. భర్త అనుమతితో తిరిగి ప్రపంచ పర్యటన ప్రారంభిస్తుంది గాని కూతురికి దూరమయ్యాననే గిల్ట్‌ ఉంటుంది. ఆ తర్వాత తనే కూతురిని తీసుకుని భర్తను వదిలి తన వద్దే ఉంచుకుంటుంది. తన తండ్రి తనతో ఎలా వ్యవహరించాడో తాను కూడా కూతురి చదువు వదిలిపెట్టి తనతో పాటు తిప్పుకోవడం భర్త సహించలేకపోతాడు.

క్రమంగా ఇది వారి విడాకులకు కారణమవుతుంది. కూతురిని ఎక్కడ కోల్పోతానోనని శకుంతలా దేవి ఆ అమ్మాయిని తండ్రికే చూపక పదేళ్ల పాటు దూరం చేసేస్తుంది. ఇవన్నీ తల్లీకూతుళ్ల మధ్య ఘర్షణకు కారణమవుతాయి. భర్తతో విడాకులు అవుతాయి. ఎన్ని జరిగినా శకుంతలా దేవి రెంటిని గట్టిగా పట్టుకోవడం కనిపిస్తుంది. ఒకటి లెక్కలు. రెండు కూతురు. లెక్కలకు ప్రాణం ఉండదు. ప్రాణం ఉన్న కూతురు ఆమెతో తీవ్ర పెనుగులాటకు దిగుతుంది. ‘నన్ను నా కూతురు ఎప్పుడూ తల్లిలానే చూసింది. నన్నో జీనియస్‌గా చూసి ఉంటే సరిగా అర్థం చేసుకునేది’ అని శకుంతలా దేవి అంటుంది. మరణించే సమయానికి కూతురితో ఆమెకు సయోధ్య కుదరడం ప్రేక్షకులకు ఊరట కలుగుతుంది.
శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్‌

గొప్ప ప్రయత్నం
ఈ గొప్ప స్త్రీ జీవితాన్ని ఒక స్త్రీ అయిన విద్యా బాలన్‌ గొప్పగా అభినయిస్తే మరో స్త్రీ అయిన అంజు మీనన్‌ గొప్పగా దర్శకత్వం వహించింది. భారత్‌లో, లండన్‌లో ముందు వెనుకలుగా కథ నడుస్తూ శకుంతలా దేవి జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా విద్యా బాలన్‌ పరిపూర్ణంగా రూపాంతరం చెందింది. ఆమె కాకుండా మరొకరు ఆ పాత్ర అంత బాగా చేయలేరేమో. కొన్ని జీవితాలు రిపీట్‌ కావు. కాని వాటి నుంచి కొంత నేర్చుకోవచ్చు. శకుంతలా దేవి సినిమాను చూసి స్త్రీలు, పురుషులు విద్యార్థులు తప్పక నేర్చుకుంటారు. అదేమిటనేది వారి వారి వివేచనను బట్టి ఆధారపడి ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా లభ్యం. 
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement