
ఎనభై ఏళ్లు దాటిన తరువాత పుస్తకాలు చదవడానికే ఇబ్బంది పడతాం. కేరళకు చెందిన మారీస్ మాత్రం 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం రాసింది. ఇప్పుడు ఆమె వయసు 88. రాసిన పుస్తకాల సంఖ్య 12. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కలం పట్టింది మారీస్.
సందర్భం ఏమిటంటే, స్కూల్లో కవితల పోటీ నిర్వహించారు. అందులో తనకు బహుమతి వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలో ఎన్నో కవితలు రాసింది. అయితే చదువుల ఒత్తిడి, ఆ తరువాత ఉద్యోగం కోసం సన్నాహం, తీరిక లేని ఉద్యోగ బాధ్యతలు, పెళ్లి, కుటుంబ బాధ్యతలు... తనను రచనలకు దూరం చేశాయి.
కక్కనాడ్(కేరళ)లో ట్రెజరీ ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేసింది మారీస్. వృత్తిరీత్యా ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మారీస్‌ను రిటైరయ్యాక ఒక్కసారిగా శూన్యం ఆవరించింది.
చురుకుదనం దూరం అయింది.
ఆ సమయంలోనే తనను ఇంట్లో షెల్ఫ్‌లలోని పుస్తకాలు పలకరించాయి. అందులో చాలా పుస్తకాలు ‘టైమ్ దొరికితే చదవాలి’ అనుకున్నావే. ఆ టైమ్ తనకు ఇప్పుడు వచ్చింది. అలా అక్షరప్రయాణం మొదలైంది. షెల్ఫ్‌లోని పుస్తకాలన్ని ఖాళీ అయ్యాయి. కొత్త పుస్తకాలు వచ్చి చేరుతున్నాయి. ఫిక్షన్ నుంచి వ్వక్తిత్వ వికాసం వరకు ఎన్నో పుస్తకాలు చదివింది.
ఆ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో 82 ఏళ్ల వయసులో కలం పట్టింది మారీస్. ‘కడలింటే మక్కాల్’ పేరుతో తొలి పుస్తకం రాసింది. అనూహ్యమైన స్పందన వచ్చింది.
‘ఈ వయసులోనూ ఎంత బాగా రాసిందో. మొదటి పుస్తకం అంటే ఎవరూ నమ్మరు’ అనేవాళ్లతో పాటు–
‘ఇక్కడితో మీ రచన ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో పుస్తకాలు రావాలి’ అని ప్రోత్సహించిన వాళ్లు ఉన్నారు. వారి సలహాతో ఆమె తన కలానికి ఇక విశ్రాంతి ఇవ్వలేదు.
ఇప్పుడు మారీస్ వయసు 88 సంవత్సరాలు.
ఇప్పటి వరకు 12 పుస్తకాలు రాసింది. వాటిలో ఇంగ్లీష్‌లో రాసినవి కూడా ఉన్నాయి. కలం బలం ఉండాలేగానీ వస్తువుకు కొరతా? తన విస్తృతజీవిత అనుభవాలలో నుంచి రచనకు అవసరమైన ముడిసరుకును ఎంచుకుంది. వ్యక్తిగత జీవితం నుంచి ట్రెజరీ ఆఫీస్ వరకు ఎన్నెన్నో అనుభవాలు తన రచనల్లోకి వచ్చి పాఠకులను మెప్పించాయి.
విశేషం ఏమిటంటే మారీస్ స్ఫూర్తితో మనవలు, మనవరాళ్లు కూడా కలం పట్టుకున్నారు. చిన్న చిన్న రచనలు చేస్తున్నారు. ఇంటినిండా ఓ సృజనాత్మక వాతావరణం ఏర్పడింది.
‘రచన అంటే అక్షరాలు కూర్చడం కాదు. అది ఒకలాంటి ధ్యానం’ అనే సత్యాన్ని నమ్మిన మారీస్ ఇప్పుడు పదమూడో పుస్తకం రాయడానికి సిద్ధం అయింది. ఆమె పుస్తకాలకు ఎందరో విద్యావేత్తలు, సృజనకారులు ముందుమాటలు రాశారు. వారిలో ప్రొఫెసర్ ఎంకే సను ఒకరు. ‘సృజనకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు మారీస్. వేగంగా చదివించే శైలి ఆమె ప్రత్యేకం’ అంటున్నారు సను.
చదవండి: Tanisa Dhingra: ఆమె మరణించీ... జీవిస్తోంది! కూతురి కోసం ఆ తల్లి..