తన తోటలో జయలక్ష్మి
ఇవాళ రేపు పదో తరగతి విద్యార్థులంటే ఆన్‌లైన్ చదువులు ముగిశాక స్నేహితులతో కబుర్లు, ఓటిటిలో సినిమాలు, ఫోన్‌లో కాలక్షేపం వీడియోలు.... కాని జయలక్ష్మి అవేం చేయదు. చదువు ముగిసిన వెంటనే ఇంటి వెనుక ఉన్న పెరటి తోటకు వెళుతుంది. అక్కడ తాను పెంచుతున్న కాయగూరల చెట్లను చూసుకుంటుంది. వాటి బాగోగులలో నిమగ్నమైపోతుంది. ‘పెద్దయ్యాక నువ్వేమవుతావు’ అనంటే ఇంజనీరో డాక్టరో అని చెప్పడం స్టీరియోటైప్ జవాబు. జయలక్ష్మి గొప్ప రైతుని కావాలని అనుకుంటోంది. మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు. (చదవండి: ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!)
పూల నుంచి పంట వరకు
కేరళలోని పథానంతిట్ట జిల్లాలోని పండలం అనే చిన్న పల్లె జయలక్ష్మిది. తండ్రి బెంగళూరులో ప్రయివేటు ఉద్యోగం చేస్తాడు. తల్లి పాలిటెక్నిక్ లెక్చరర్. వాళ్లది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కాని జయలక్ష్మికి చిన్నప్పటి నుంచి పూలంటే ఇష్టం. పూల మొక్కలు ఎక్కడ ఉన్నా ఆగి చూసేది. ఇంటికి తెచ్చి వేసేది. కాని పదో క్లాసు వచ్చేసరికి ఈ ఆసక్తి ఆమెకు సేంద్రియ పద్ధతిలో పెరటి సేద్యం చేసేలాగా పురిగొల్పింది. విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగించేందుకు కేరళ ప్రభుత్వం ‘కర్షక తిలక’ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అక్కడి ప్రభుత్వ బడులలో కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇవన్నీ జయలక్ష్మికి ఉత్సాహం ఇచ్చాయి. ఇంట్లో తన సొంత పంటను మొదలెట్టింది. అన్ని రకాల కాయగూరలను కేవలం సేంద్రీయ పద్థతిలో పండించసాగింది.
అన్నీ తెలుసు
అయితే అందరిలా ఏవో ఒక మొక్కలు ఏదో ఒక పద్ధతిలో జయలక్ష్మి పెంచలేదు. ఆమె వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో తనకు కావలసిన పరిజ్ఞానం పొందింది. ఏ కాయగూర ఎన్నాళ్లకు పూతకొస్తుందో ఏ ఆకుకూర ఏ సీజన్‌లో వేయాలో ఆమె దగ్గర కచ్చితమైన టైంటేబుల్ ఉంది. మట్టి, ఎరువు, నీరు... అన్నీ ఆమెకు ఏ పాళ్లో తెలుసు. అందుకే 2018లో ఆమె పెరటి పంటను మొదలుపెడితే రెండేళ్లలో ఆమె వల్ల ఇంటికి కావాల్సిన కూరగాయల బాధ తప్పడమే కాక బయటకు అమ్మి రాబడి సాధించేంతగా పంట ఎదిగింది. అంతే కాదు ‘కర్షక తిలక’ అవార్డు కూడా సొంతం చేసుకుంది. (చదవండి: లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!)
ప్రధాని మోదీకి లేఖ
జయలక్ష్మి ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసింది. ‘మన్ కీ బాత్’లో సేంద్రియ వ్యవసాయం పట్ల యువతకు పిలుపు ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ప్రకటించి రైతులను ఉత్సాహపరచాలని ఆ లేఖలో కోరింది. దానికి జవాబుగా మోదీ.. జయలక్ష్మి కృషిని ప్రశంసిస్తూ ఒక లేఖను కేరళ రాజ్యసభ సభ్యుడు, నటుడు సురేశ్‌గోపి ద్వారా పంపారు. ఇది ఒక్క పక్క జరిగితే మొన్నటి సోమవారం పథానం తిట్టకు వచ్చిన సురేశ్ గోపిని కలిసి జయలక్ష్మి తాను పెంచిన జామ మొక్కను బహూకరించింది. ‘అమ్మా.. ఇది నా దగ్గర కాదు.. ఏకంగా ప్రధాని నివాసంలోనే పెరగాలి. నేను దీనిని ప్రధానికి బహూకరిస్తాను’ అన్నాడు సురేశ్ గోపి. గురువారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో ప్రధానికి ఆ మొక్కను బహూకరించాడు కూడా. ఈ సంగతి తెలిసి జయలక్ష్మి ఎంతో సంతోషపడుతోంది. సాటి విద్యార్థులు కూడా ఆమెను చాలా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
చదువుతో పాటు ఈ దేశపు మట్టి గురించి, పంట గురించి, కనీసం నాలుగైదు మొక్కలు పెంచాల్సిన పరిజ్ఞానం గురించి కూడా నవతరం ఎరుక తెచ్చుకోవాల్సి ఉంది. అందుకు జయలక్ష్మి వంటి వారు ఒక కేటలిస్ట్ అవుతారు తప్పక. జయలక్ష్మీ జిందాబాద్.
Comments
Please login to add a commentAdd a comment