Saplings
-
పర్యావరణ పరిరక్షణకు వీమార్ట్ శ్రీకారం
ముంబై: ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ దేశవ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికత రూపంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. సీఎస్ఆర్ కార్యక్రమం కింద పర్యావరణ పరిరక్షణ, సామాజికాభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించామని పేర్కొంది. వాతావరణ మార్పుల సమస్యలకు దీర్ఘకాలం పాటు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం పరిష్కారమని కంపెనీ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. -
హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా
సాక్షి, భూదాన్ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు. కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా? చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ -
మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు.. మోదీకి లేఖ
ఇవాళ రేపు పదో తరగతి విద్యార్థులంటే ఆన్లైన్ చదువులు ముగిశాక స్నేహితులతో కబుర్లు, ఓటిటిలో సినిమాలు, ఫోన్లో కాలక్షేపం వీడియోలు.... కాని జయలక్ష్మి అవేం చేయదు. చదువు ముగిసిన వెంటనే ఇంటి వెనుక ఉన్న పెరటి తోటకు వెళుతుంది. అక్కడ తాను పెంచుతున్న కాయగూరల చెట్లను చూసుకుంటుంది. వాటి బాగోగులలో నిమగ్నమైపోతుంది. ‘పెద్దయ్యాక నువ్వేమవుతావు’ అనంటే ఇంజనీరో డాక్టరో అని చెప్పడం స్టీరియోటైప్ జవాబు. జయలక్ష్మి గొప్ప రైతుని కావాలని అనుకుంటోంది. మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు. (చదవండి: ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!) పూల నుంచి పంట వరకు కేరళలోని పథానంతిట్ట జిల్లాలోని పండలం అనే చిన్న పల్లె జయలక్ష్మిది. తండ్రి బెంగళూరులో ప్రయివేటు ఉద్యోగం చేస్తాడు. తల్లి పాలిటెక్నిక్ లెక్చరర్. వాళ్లది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కాని జయలక్ష్మికి చిన్నప్పటి నుంచి పూలంటే ఇష్టం. పూల మొక్కలు ఎక్కడ ఉన్నా ఆగి చూసేది. ఇంటికి తెచ్చి వేసేది. కాని పదో క్లాసు వచ్చేసరికి ఈ ఆసక్తి ఆమెకు సేంద్రియ పద్ధతిలో పెరటి సేద్యం చేసేలాగా పురిగొల్పింది. విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగించేందుకు కేరళ ప్రభుత్వం ‘కర్షక తిలక’ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అక్కడి ప్రభుత్వ బడులలో కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇవన్నీ జయలక్ష్మికి ఉత్సాహం ఇచ్చాయి. ఇంట్లో తన సొంత పంటను మొదలెట్టింది. అన్ని రకాల కాయగూరలను కేవలం సేంద్రీయ పద్థతిలో పండించసాగింది. అన్నీ తెలుసు అయితే అందరిలా ఏవో ఒక మొక్కలు ఏదో ఒక పద్ధతిలో జయలక్ష్మి పెంచలేదు. ఆమె వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో తనకు కావలసిన పరిజ్ఞానం పొందింది. ఏ కాయగూర ఎన్నాళ్లకు పూతకొస్తుందో ఏ ఆకుకూర ఏ సీజన్లో వేయాలో ఆమె దగ్గర కచ్చితమైన టైంటేబుల్ ఉంది. మట్టి, ఎరువు, నీరు... అన్నీ ఆమెకు ఏ పాళ్లో తెలుసు. అందుకే 2018లో ఆమె పెరటి పంటను మొదలుపెడితే రెండేళ్లలో ఆమె వల్ల ఇంటికి కావాల్సిన కూరగాయల బాధ తప్పడమే కాక బయటకు అమ్మి రాబడి సాధించేంతగా పంట ఎదిగింది. అంతే కాదు ‘కర్షక తిలక’ అవార్డు కూడా సొంతం చేసుకుంది. (చదవండి: లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!) ప్రధాని మోదీకి లేఖ జయలక్ష్మి ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసింది. ‘మన్ కీ బాత్’లో సేంద్రియ వ్యవసాయం పట్ల యువతకు పిలుపు ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ప్రకటించి రైతులను ఉత్సాహపరచాలని ఆ లేఖలో కోరింది. దానికి జవాబుగా మోదీ.. జయలక్ష్మి కృషిని ప్రశంసిస్తూ ఒక లేఖను కేరళ రాజ్యసభ సభ్యుడు, నటుడు సురేశ్‌గోపి ద్వారా పంపారు. ఇది ఒక్క పక్క జరిగితే మొన్నటి సోమవారం పథానం తిట్టకు వచ్చిన సురేశ్ గోపిని కలిసి జయలక్ష్మి తాను పెంచిన జామ మొక్కను బహూకరించింది. ‘అమ్మా.. ఇది నా దగ్గర కాదు.. ఏకంగా ప్రధాని నివాసంలోనే పెరగాలి. నేను దీనిని ప్రధానికి బహూకరిస్తాను’ అన్నాడు సురేశ్ గోపి. గురువారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో ప్రధానికి ఆ మొక్కను బహూకరించాడు కూడా. ఈ సంగతి తెలిసి జయలక్ష్మి ఎంతో సంతోషపడుతోంది. సాటి విద్యార్థులు కూడా ఆమెను చాలా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. చదువుతో పాటు ఈ దేశపు మట్టి గురించి, పంట గురించి, కనీసం నాలుగైదు మొక్కలు పెంచాల్సిన పరిజ్ఞానం గురించి కూడా నవతరం ఎరుక తెచ్చుకోవాల్సి ఉంది. అందుకు జయలక్ష్మి వంటి వారు ఒక కేటలిస్ట్ అవుతారు తప్పక. జయలక్ష్మీ జిందాబాద్. -
వారి ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది: ఎంపీ సంతోష్
సాక్షి, మెదక్: హరితహారానికి మేముసైతం అంటున్నారు రేపటి పౌరులు. నాటిన మొక్కలు ఎండిపోకుండా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటాకింద బస్తీ పిల్లలు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపరుస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు పడకపోవడంతో హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్‌కు డబ్బాకట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకూ నీళ్లు పోస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ డబ్బాను తయారుచేసి, దానికి పైపును బిగించి తమ సైకిల్‌కు కట్టారు. సమీపంలో ఉన్న కాలువ నుంచి నీటిని డబ్బాలోకి తోడి, సైకిల్ ద్వారా తరలించి మొక్కలకు నీరందిస్తున్నారు. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ప్రాణవాయువుతో పాటు నీడనూ ఇస్తాయని వారు చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంపీ సంతోష్ అభినందనలు.. వెల్దుర్తి పిల్లల పర్యావరణ చైతన్యాన్ని గురించి తెలుసుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన పని చేస్తున్నారంటూ పిల్లలను అభినందిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. Gives me immense pleasure to see these little hearts from Veldurthi(V) of Medak, taking care of the saplings. Look at their enthusiasm and love for the plants. It is very much required for today’s generation for their better future with sustainable environment. LoveYou boys. 👌😊 pic.twitter.com/xEwshTvVjK — Santosh Kumar J (@MPsantoshtrs) August 5, 2021 -
‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ ఏడాది కోటి మొక్కలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి 17 వేల కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది కోటి మొక్కల్ని నాటేందుకు ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా.. రాష్ట్రంలో పచ్చదనం విలసిల్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. పచ్చతోరణం కార్యక్రమం నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ 13 జిల్లాల అధికారులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని, నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది ఆయన లక్ష్యమని చెప్పారు. గతంలో మాదిరిగా మొక్క నాటడంతో సరిపెట్టడం లేదని, ప్రతి మొక్క సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసే వీలు కల్పించామని చెప్పారు. మొక్కలకు నీటి తడులు అందించేందుకు ప్రతినెలా డబ్బులు కూడా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీలో నాటిన మొక్కల్లో కనీసం 83 శాతం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ఆ గ్రామ సర్పంచ్‌పై పెడుతున్నట్టు చెప్పారు. లేనిపక్షంలో వారు పదవికి అనర్హులుగా ప్రకటించేలా నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మొక్కల సంరక్షణతో నిరుద్యోగులకు ఉపాధి మొక్కల సంరక్షణ బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి మొక్కకు నెలకు నాలుగు తడుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి తడికి రూ.5 చొప్పున కిలోమీటర్ పరిధిలో కనీసం 400 మొక్కల్ని సంరక్షిస్తే నెలకు రూ.8 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 10 కిలోమీటర్ల పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొనే వారు ట్రాక్టరు కొనుక్కుంటే రెండేళ్లు తిరిగే సరికి అతనికి కొనుగోలు ఖర్చు లభించి ట్రాక్టరు మిగిలే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొలి మూడు జిల్లాల అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో సన్మానిస్తామని, అదే సమయంలో చివరి మూడు స్థానాల్లో నిలిచే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది 44 వేల మంది రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి (సోషల్ ఫారెస్ట్) చిరంజీవి చౌదరి, ఉద్యావ శాఖ కమిషనర్ శ్రీధర్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ నవీన్‌కుమార్, సెర్ప్ సీఈవో రాజాబాబు, డైరెక్టర్ చినతాతయ్య, పంచాయతీరాజ్ ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్! దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్ బిగ్‌బాస్ 4 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఆటోకి ఊరి లుక్ వచ్చింది!
పల్లెను వదిలొచ్చాక తల్లి గుర్తొస్తే గుట్టుగానైనా కన్నీళ్లు పెట్టుకోడానికి సిటీలో చోటే దొరకదు. పల్లే తల్లయిన కుర్రాడికి చెరువులోని చేపలు, చేలోని వరి కంకులు, కోళ్లూ కుందేళ్లూ, కొండ మీద గుడిలో స్వాముల వారు.. ఊరంతా తోబుట్టులే. బతకడానికి వచ్చినవాడు రాళ్లు కొట్టగలడు, ఆటో నడపగలడు, పట్టభద్రుడైతే పద్దులూ రాయగలడు. పొద్దుపోయాక, ’ఏరా పెద్దోడా తినే పడుకున్నావా..’ అనే తండ్రి గొంతు వినకుంటే సిటీలో బతుకు ఉన్నట్టేనా? బతుకుతున్నట్టేనా? ఇలాగే ఉంటుంది ఊరిని వదిలి రావడం. ఒడిశాలోని కంధమల్ గ్రామం నుంచి పని వెతుక్కుంటూ రాజధాని నగరం భువనేశ్వర్ వచ్చాడు సుజిత్ దిగల్. అమ్మను వదిలి వచ్చిన పిల్లవాడిని సిటీ పెద్దమ్మ ఆదరించింది. ఆటో నడిపే పనిలో పెట్టింది. డబ్బులొస్తున్నాయి సంతోషమే. అమ్మతోనూ రోజూ మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మలాంటి ఊరినే.. చూడకుండా ఉండలేక పోతున్నాడు. సిటీలో ఊపిరి ఆడటం లేదు. సిటీని వదలి వెనక్కు వెళితే ఊపిరే ఉండదు. కొన్నాళ్లు చూశాడు. బెంగ అలాగే ఉంది. ఆటోలో చిన్న మొక్కను పెట్టుకున్నాడు. మనసుకు నెమ్మదిగా అనిపించింది. మరికొన్ని మొక్కలు తగిలించాడు. ఆటోకి గార్డెన్ లుక్ వచ్చింది. చిన్న ఆక్వేరియం పెట్టాడు. ఆటో లోపలే రెండు బోన్లు వేలాడదీసి ఒక దాంట్లో కుందేలు పిల్లను, ఇంకో దాంట్లో పక్షుల్ని ఉంచాడు. ఆటోకి ఊరి లుక్ వచ్చింది! ఆటో నడుపుతున్నంతసేపూ ఊళ్లో తిరుగుతున్నట్లే ఉంది సుజిత్ కి. ‘ఈ కుందేలు పిల్ల, పక్షులు, చేపలు, పూల మొక్కలు మా ఊరి వైబ్రేషన్స్‌ని నాకు అందిస్తున్నాయి‘ అంటున్నాడు. అమ్మ ఫొటో ఉన్న పర్స్ సుజిత్ కి తన ఆటో ఇప్పుడు. -
తప్పు చేస్తే.. ‘మొక్క’ల్సిందే!
సూరత్: విద్యార్థులు ఏ చిన్న తప్పు చేసినా... ఆఖరికి యూనిఫామ్ వేసుకు రాకపోయినా దారుణంగా దండించే స్కూళ్లను మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే గుజరాత్‌లోని వీర్ నర్మాద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ వినూత్నమైన శిక్షలు వేస్తోంది. ఇక్కడి ఓ ప్రొఫెసర్‌కు వచ్చిన ఆలోచన ఫలితంగా... విద్యార్థులు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడల్లా వారి చేత ఓ మొక్కను నాటించేలా శిక్ష విధిస్తున్నారు. దీంతో గత ఎనిమిదేళ్లలో ఈ వర్సిటీలో 550కి పైగా చెట్లు వచ్చాయి. వర్సిటీలోని ఆర్కిటెక్చర్ విభాగంలో ‘బేసిక్ డిజైన్’ సబ్జెక్టును బోధిస్తున్న ప్రొఫెసర్ మెహుల్ పటేల్ (36) ఈ వినూత్న పద్ధతికి తెరలేపారు. క్లాసులకు లేటుగా రావడం, అసైన్మెంట్లు చేయకపోవడం, క్లాసులో ఫోన్ వాడడం వంటి చిన్న చిన్న తప్పులకు మొక్కలను నాటడాన్ని శిక్షగా విధిస్తున్నారు. పచ్చదనం పెరగడం సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు. ‘పర్యావరణానికి నా వంతుగా ఏదోటి చేయాలన్న ఆలోచనతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాను. విద్యార్థులు చేసిన చిన్న చిన్న తప్పులకు మొక్కలు నాటిస్తున్నాను. 8 ఏళ్లలో క్యాంపస్‌లో 550పైగా మొక్కలు నాటించాను. ముందుగా నాటిన మొక్కలు 20 మీటర్లు ఎత్తు వరకు పెరిగాయి. మొక్క నాటడంతో అయిపోదు. దాన్ని కాపాడేందుకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం చేస్తుంటాం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ సమీపంలో పచ్చదనం బాగా పెరగడంతో పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగల సందడి చేస్తున్నాయ’ని ప్రొఫెసర్ పటేల్ తెలిపారు. మొక్కలకు నీళ్ల కోసం విద్యార్థులు చిన్న కుంట కూడా తవ్వారని వెల్లడించారు. ఈ ప్రొఫెసర్‌ను చూసి మన ‘దండో’పాధ్యాయులు చాలా నేర్చుకోవాలేమో!!. -
వెరైటి వరకట్నం..పెరుగుతూనే ఉంటుంది
భువనేశ్వర్ : ఆడపిల్ల వివాహం తల్లిదండ్రులకు ఎంతటి భారమో తెలిసిన సంగతే. కారణం ‘వరకట్నం’...నేటికి ఈ వరకట్న భూతానికి జడిసి సమాజంలో చాలా మంది ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో భారీ వరకట్నాన్ని కోరి మరి అత్తింటి వారికి సంతోషాన్ని కల్గించాడు ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి. అందేంటి కట్నం అడిగితేనే ఎవరికైన కోపం వస్తుంది. అలాంటిది భారీ కట్నం అడిగినా సంతోషించడం ఎంటనుకుంటున్నారా...? అక్కడే ఉంది అసలు విషయం. ఈ పెళ్లి కొడుకు ‘పచ్చ నోట్ల’(నోట్ల రద్దు పుణ్యామాని ఇప్పుడు ఈ పచ్చనోట్లు కనిపించడం లేదు) కట్నం బదులు ‘పచ్చని మొక్కల’ను కోరాడు. హరిత కట్నం ఎవరికైనా హర్షమే కదా. ఈ పచ్చని వివాహ వివరాలు...ఒరిస్సా కేంద్రపర జిల్లా బలభద్రపూర్ గ్రామానికి చెందిన సరోజ్ కాంత్ బిస్వాల్(33) పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి మరో పంతులమ్మతో వివాహం కుదిరింది. బిస్వాల్‌కు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే తన వివాహానికి కట్నంగా 1000 మొక్కలను ఇవ్వాలని అడిగాడు. అవి కూడా పళ్ల మొక్కలనే కోరాడు. అందుకు బిస్వాల్‌కు కాబోయే మామ గారు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ నెల 22న బిస్వాల్ వివాహం కాలుష్యరహితంగా, పర్యావరణహితంగా పచ్చగా జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులందరికి బిస్వాల్ మొక్కలు పంచి...ఆశీర్వాదాలు అందుకున్నాడు. -
ఒకేరోజు 2 కోట్ల మొక్కలు..
పర్యావరణాన్ని సంరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా మహరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నం ప్రారంభించింది. జూలై 1న 450 జాతులకు చెందిన రెండు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రకటన చేసింది. తాము చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ లో ప్రజలంతా భాగస్వాములై, తమకిష్టమైన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది. ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు, వాతావరణాన్ని రక్షించే ప్రత్యేక కార్యక్రమాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపిన అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగన్ తివార్.. కార్యక్రమానికి ప్రధానమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో భాగంగా 450 జాతులకు చెందిన 2 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటుతున్నామని, ప్రజలంతా భాగస్వాములయ్యేందుకు వీలుగా వేదికను, సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. 2014 అక్టోబర్ లో తాను మంత్రి అయిన సందర్భంలో ప్రజలు తనకు ప్రశంసాపూర్వకంగా పూలదండలు, బొకేలు తెచ్చిచ్చారని, అలా డబ్బు వృధా చేసే బదులు వారంతా మొక్కలు ఇచ్చి ఉంటే బాగుండేదన్న తన భార్య సలహానే తాను ఈ కార్యక్రమం చేపట్టేందుకు మార్గమైందని ముంగన్ తివార్ తెలిపారు. కార్యక్రమం మొత్తాన్ని ప్రజల భాగస్వామ్యంతోనే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మొక్కలను పాతేందుకు 1.75 కోట్ల గుంతలను తీసి సిద్ధం చేశామన్నా ఆయన.. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో రెండు ప్రత్యేకమైన కారణాలున్నాయని, ముఖ్యంగా తమ సిబ్బంది తక్కువగా ఉండటం ఒకటైతే, వాతావరణ పరిరక్షణలో ప్రజలు తమతో కలసి పనిచేయాలన్నది రెండో ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని 36 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఓ లక్ష్యాన్నిసిద్ధం చేసిన అటవీశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు కూడ ఈ డ్రైవ్ లో చేరాలని కోరింది. దీనికి తోడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, పంతంజలి యోగ పీఠ్, రైల్వే కలసి డ్రైవ్ లో పాల్గొంటున్నట్లు తెలిపింది. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణా బాధ్యతలను చేపట్టేందుకు ఓ శాశ్వత కమిటీని కూడ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొక్కలు పాడైతే కమిటీదే బాధ్యత అని, వాటి శ్రద్ధ వహించేందుకు మహిళా స్వయం సహాయక బృందాలకు కూడ 70 శాతం బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నట్లు మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో మొక్కల పెరుగుదలను బట్టి కమిటీ సభ్యులకు చెల్లించే వేతనం ఉండాలని, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పర్ దేశీ సూచించారు. మూడు సంవత్సరాల్లో కనీసం 80 శాతం మొక్కలు పెరిగేట్లుగా ఉండాలని, వాటికి సంరక్షకులే జవాబుదారీగా ఉండాలని లేదంటే విషయాన్ని వారు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదని ప్రవీణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ సహకారంతో కరువు ప్రాంతమైన మారాఠ్వాడా లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని రక్షణ మంత్రిత్వ శాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. గ్రీన్ బెటాలియన్ పేరిట మొక్కలు నాటేందుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచి వారికి కేటాయిస్తామని తెలిపింది. -
బంగారం వద్దు.. మొక్కలే ముద్దు...!
ఆ సందర్భం దంపతుల పర్యావరణ స్పృహకు మారుపేరుగా... ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా మారింది. పెళ్ళిలో సంప్రదాయానుసారం అందించే బంగారం, డైమండ్స్ కు బదులుగా అత్తమామలను వధువు... బహుమతిగా మొక్కలు కావాలని కోరడం... మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని భిండ్ జిల్లా కిసిపురా గ్రామమంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమం ప్రకృతి ప్రేమకు మారుపేరుగా నిలిచింది. 22 ఏళ్ళ సైన్స్ గ్రాడ్యుయేట్, వధువు ప్రియాంక తన అత్తవారు బహుమతిగా ఇచ్చే బంగారు నగలకు బదులు పచ్చని మొక్కలు కావాలని కోరడం ప్రత్యేకతగా నిలిచింది. ముందుగా అత్తమామలను ఆమె అభ్యర్థన ఆశ్చర్య పరచినా... చివరికి ఆమెలోని ప్రకృతి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆధునిక కాలంలోనూ పర్యావరణంపై శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తి కోడలుగా రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. తనకు కాబోయే భార్య సంపద కంటే పర్యావరణంపై అధిక శ్రద్ధ చూపిస్తున్నతీరు ఎంతో ఆనందం కలిగించిందని వరుడు రవిచౌహాన్ ఓ పత్రికకు తెలిపారు. ఆభరణాల స్థానంలో ఆమె 10,000 మొక్కలను కోరడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అడవులను నరికేస్తున్న నేపథ్యంలో పచ్చదనం క్షీణించి పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, ముఖ్యంగా మధ్య ప్రదేశ్ లో ఈ కారణంగా భూమిలో నీరు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని వధువు ప్రియాంక తెలిపారు. . పంట నష్టాలతో తీవ్ర నిరాశ చెందిన తన తండ్రే ఇందుకు సాక్ష్యమని, పరావరణాన్ని రక్షించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడాలంటే పచ్చదనాన్ని పెంచాలన్న విషయాన్ని చిన్నతనంలోనే గుర్తించిన ప్రియాంక పెళ్ళి సందర్భాన్ని అందుకు అనువుగా మలచుకున్నారు. తాను కోరిన పదివేల మొక్కల్లో ఐదు వేలు తన తండ్రి ఇంట్లో, మరో ఐదు వేలు అత్తమామల ఇంట్లో పాతాలన్న యోచనతోనే మొక్కలను బహుమతిగా కోరానన్నారు. చిన్నతనంనుంచే పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకున్నానని, రైతులకు, కార్యకర్తలకు మొక్కలను పంచి పచ్చదనాన్ని మరింత పెంచాలన్నదే తన ఆశయమని ప్రియాంక చెప్తున్నారు. ఏప్రిల్ 22 న జరిగిన వివాహం అనంతరం దంపతులిద్దరూ గ్రామంలో రెండు మామిడి మొక్కలు పాతామని, అవి వాతావరణాన్ని రక్షిస్తాయన్న నమ్మకం ఉందని ఆమె చెప్తున్నారు. ఇకనుంచి ప్రతి పెళ్ళి రోజునాడు క్రమం తప్పకుండా మొక్కలు పాతే కార్యక్రమం చేపడతామని ప్రియాంక వెల్లడించారు.