ఒకేరోజు 2 కోట్ల మొక్కలు..
పర్యావరణాన్ని సంరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా మహరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నం ప్రారంభించింది. జూలై 1న 450 జాతులకు చెందిన రెండు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రకటన చేసింది. తాము చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ లో ప్రజలంతా భాగస్వాములై, తమకిష్టమైన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది.
ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు, వాతావరణాన్ని రక్షించే ప్రత్యేక కార్యక్రమాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపిన అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగన్ తివార్.. కార్యక్రమానికి ప్రధానమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో భాగంగా 450 జాతులకు చెందిన 2 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటుతున్నామని, ప్రజలంతా భాగస్వాములయ్యేందుకు వీలుగా వేదికను, సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. 2014 అక్టోబర్ లో తాను మంత్రి అయిన సందర్భంలో ప్రజలు తనకు ప్రశంసాపూర్వకంగా పూలదండలు, బొకేలు తెచ్చిచ్చారని, అలా డబ్బు వృధా చేసే బదులు వారంతా మొక్కలు ఇచ్చి ఉంటే బాగుండేదన్న తన భార్య సలహానే తాను ఈ కార్యక్రమం చేపట్టేందుకు మార్గమైందని ముంగన్ తివార్ తెలిపారు. కార్యక్రమం మొత్తాన్ని ప్రజల భాగస్వామ్యంతోనే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మొక్కలను పాతేందుకు 1.75 కోట్ల గుంతలను తీసి సిద్ధం చేశామన్నా ఆయన.. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో రెండు ప్రత్యేకమైన కారణాలున్నాయని, ముఖ్యంగా తమ సిబ్బంది తక్కువగా ఉండటం ఒకటైతే, వాతావరణ పరిరక్షణలో ప్రజలు తమతో కలసి పనిచేయాలన్నది రెండో ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని 36 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఓ లక్ష్యాన్నిసిద్ధం చేసిన అటవీశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు కూడ ఈ డ్రైవ్ లో చేరాలని కోరింది. దీనికి తోడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, పంతంజలి యోగ పీఠ్, రైల్వే కలసి డ్రైవ్ లో పాల్గొంటున్నట్లు తెలిపింది. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణా బాధ్యతలను చేపట్టేందుకు ఓ శాశ్వత కమిటీని కూడ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొక్కలు పాడైతే కమిటీదే బాధ్యత అని, వాటి శ్రద్ధ వహించేందుకు మహిళా స్వయం సహాయక బృందాలకు కూడ 70 శాతం బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నట్లు మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో మొక్కల పెరుగుదలను బట్టి కమిటీ సభ్యులకు చెల్లించే వేతనం ఉండాలని, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పర్ దేశీ సూచించారు. మూడు సంవత్సరాల్లో కనీసం 80 శాతం మొక్కలు పెరిగేట్లుగా ఉండాలని, వాటికి సంరక్షకులే జవాబుదారీగా ఉండాలని లేదంటే విషయాన్ని వారు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదని ప్రవీణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ సహకారంతో కరువు ప్రాంతమైన మారాఠ్వాడా లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని రక్షణ మంత్రిత్వ శాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. గ్రీన్ బెటాలియన్ పేరిట మొక్కలు నాటేందుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచి వారికి కేటాయిస్తామని తెలిపింది.