Visually Impaired Woman Geetha Inspiring Journey In Telugu: గీత పదమూడేళ్ల అమ్మాయి. బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదని తరచూ చెప్తోంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. రకరకాల పరీక్షలు చేశారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అని తేల్చారు. అది అత్యంత అరుదైన జన్యుపరమైన సమస్య. వైద్యం ద్వారా పోయిన చూపును తీసుకురావడం కాదు కదా దృష్టి మరింత క్షీణించకుండా ఆపడమూ సాధ్యం కాలేదు.
పదిహేనేళ్లు వచ్చేటప్పటికి చూపు పూర్తిగా తగ్గిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు 39 ఏళ్ల సక్సెస్‌ఫుల్ ఉమన్. సొంత కుటీరపరిశ్రమ ద్వారా నెలకు యాభై వేలు సంపాదిస్తోంది. ‘గీతాస్’ అని తన పేరుతోనే తన ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంది, తన విజయాన్ని తన పేరుతోనే నమోదు చేసుకుంది. తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకుంది.
నచ్చని పదం ‘రెస్ట్’
కేరళలోని త్రిశూర్‌కి చెందిన గీత దృష్టిలోపం కారణంగా దేనినీ ఆపలేదు. ఆత్మవిశ్వాసంతో చదువును బ్రెయిలీలో కొనసాగించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఏమీ చేయకుండా ఊరుకోవడం తనకు నచ్చలేదు. దాంతో భర్త సహకారంతో చిన్న రెస్టారెంట్ ప్రారంభించింది. ఆమె స్వయంగా వండేది కూడా.
ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ అది. వంటకాలు, పండ్ల రసాలు అన్నీ సేంద్రియ పద్ధతులతో పండించిన పండ్లు, కూరగాయలు, ధాన్యాలతోనే. ఆ ప్రయత్నం ఆమెను విజయపథంలో నడిపించింది. కాలం పరీక్షలు పెట్టకుండా ఆగదు. ఆ రెస్టారెంట్ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆమె మరో ప్రదేశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొంతకాలం ఇల్లు, పిల్లల పెంపకంలో విశ్రాంతిగా గడపమని భర్త సలీశ్ సూచించాడు.
అతడు మెడికల్ రిప్రజెంటేటివ్. గీతకు ఇష్టంలేని మాట ‘విశ్రాంతి’. సొంత పరిశ్రమ అయితే ఎక్కువ సమయం పరిశ్రమ కోసమే కేటాయించాల్సి వస్తోంది. ఉద్యోగం అయితే కొంత వెసులుబాటు ఉంటుందని ఆలోచించింది. కానీ అప్పటికే ఆమె రెస్టారెంట్ నడిపి తనను తాను నిరూపించుకుని ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఎవరూ ఇవ్వకపోతే ఏంటి? నేనే మరొకరికి ఉద్యోగం ఇస్తాను అనుకుంది గీత దృఢంగా.
తనకు బాగా పట్టున్న వంట పనినే ఈ సారి ఇంటి నుంచి మొదలు పెట్టింది. అలాగే షెల్ఫ్‌లైఫ్ ఎక్కువ కాలం ఉండే పదార్థాలను వండసాగింది. వాటిని ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడమూ మొదలుపెట్టింది. ‘గీతాస్ హోమ్ టు హోమ్’ బ్రాండ్ మీద ఆమె తయారు చేస్తున్న నెయ్యి, పచ్చళ్లు, బాలింతలు తినాల్సిన ఔషధ ఆహారానికి మార్కెట్ కేరళ నుంచి కశ్మీర్ వరకు విస్తరించింది. గీత ప్రపంచాన్ని చూడలేదు. కానీ ప్రపంచం ఆమెను చూసేలా చేసుకోగలిగింది. ఇది గీత గ్రహించిన జీవితసారం. తన కంటిచూపును హరించిన విధిని సవాల్ చేస్తోంది.
చదవండి: లోన్ కావాలంటే 2 నిమిషాలే.. క్లిక్ చేశారో ఇక అంతే?!
Comments
Please login to add a commentAdd a comment